Health

వ్యాక్సిన్ ఏర్పాట్లు జరుగుతున్నాయి

వ్యాక్సిన్ ఏర్పాట్లు జరుగుతున్నాయి

దేశంలో కరోనా ప్రభావం, వ్యాక్సిన్ అభివృద్ధికి సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ మంగళవారం ప్రెస్‌మీట్ నిర్వహించింది.

ఈ సందర్భంగా కేంద్ర వైద్యఆరోగ్య శాఖ సెక్రటరీ రాజేష్ భూషణ్ మాట్లాడుతూ సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ కలిసి వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతినివ్వాల్సిందిగా ఇప్పటికే దరఖాస్తు చేసినట్లు చెప్పారు.

ప్రధాని మోదీ ఇప్పటికే పలు వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలతో, శాస్త్రవేత్తలతో మాట్లాడారని తెలిపారు.

భారత్‌లో మొత్తం 6 వ్యాక్సిన్‌లు క్లినికల్ ట్రయల్ దశలో ఉన్నాయని చెప్పారు.

వీటిలో కొన్ని వ్యాక్సిన్‌లకు మరో కొద్ది వారాల్లో లైసెన్స్ వచ్చే అవకాశం ఉందని కేంద్ర వైద్యఆరోగ్య శాఖ సెక్రటరీ రాజేష్ భూషణ్ వివరించారు.

దేశ ప్రజలకు వ్యాక్సిన్‌ను అందించే విషయంలో ఏర్పాట్లు జరుగుతున్నాయని, కేంద్రం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కలిసి వ్యాక్సిన్‌ను అందరికీ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.

అయితే.. వ్యాక్సినేషన్ అనేది కేవలం రాష్ట్రాలు, కేంద్రాల బాధ్యత మాత్రమే కాదని, ప్రజల భాగస్వామ్యం అన్న సంగతి కూడా గుర్తుంచుకోవాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

మొదటగా వ్యాక్సిన్‌ను 3 కోట్ల మంది హెల్త్ వర్కర్లకు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు అందించనున్నట్లు రాజేష్ భూషణ్ తెలిపారు.

ప్రస్తుతం భారత్‌లో యాక్టివ్ కేసుల సంఖ్య నాలుగు లక్షల కంటే తక్కువగా ఉందన్నారు.

మొత్తం కరోనా కేసుల సంఖ్యలో యాక్టివ్ కేసుల సంఖ్య కేవలం 4 శాతం మాత్రమేనని చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ గత సెప్టెంబర్ నెల మధ్య కాలం నుంచి భారత్‌లో కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుందని తెలిపారు.

భారత్‌లో నమోదవుతున్న మొత్తం కరోనా కేసుల్లో మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ రాష్ట్రాల్లోనే 54 శాతం కేసులు నమోదవుతున్నట్లు రాజేష్ భూషణ్ పేర్కొన్నారు.