మేజర్ జనరల్ సర్ థామస్ మన్రో చావుకి బంగారుతోరణానికి సంబంధముందా ?
…………………………………………..
కడప జిల్లా గంగపేరూరులో థామస్ మన్రో గురించి ఓ కథను ఇప్పటికి ప్రజలుచెప్పుకొంటున్నారు. అదేమిటంటే
గంగపేరూరు గ్రామంలో ఇనాం భూములు, శ్రోత్రియంభూములు తనిఖీ చేసి వాటికి పన్నులు లెక్క కట్టడం, అవసరంలేదనుకొన్న భూములను ప్రభుత్వపరం చేసుకోవడం.
గంగపేరూరులో కూడా నృసింహాలయం ఉంది. మన్రో గంగపేరూరులో ఓ రోజు విడిదిచేశాడు. అక్కడి నరసింహాలయానికి దశబంధ ఇనాం భూములున్నాయి. దశబంధ ఇనాం భూములంటే స్వల్పంగా పన్నులు విధించి భూములను పురోహితులకో, వృత్తిపనివారలకో, దేవాలయాలకో ఇవ్వడం.
మేజర్ జనరల్ థామస్ మన్రో నరసింహాలయానికి చెందిన భూములను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించుకొన్నాడు. గ్రామకరణం దేవుడి మాన్యాలు రద్దు చేయవద్దని ప్రార్థించాడు. దేవుడుంటే కదా! మాన్యాలు అవసరం. దేవుడే లేనపుడు గుడికి మడిమాన్యాలెందుకని కరణం విజ్ఞప్తిని కొట్టిపారేశాడు. అయినా కరణం విన్నపాలను వదలలేదు. మన్రో విసుక్కొని నరసింహదేవుడిని నాక్కాని చూపితే దేవాలయ భూములను యథాతథంగా వుంచుతానని చెప్పాడు.
కరణం దేవాలయానికి వెళ్ళి స్వామి నీవు మన్రోగారికి దర్శనమిచ్చి నీ భూములను నీవే కాపాడుకొమ్మని మనసావాచకర్మణ ప్రార్థించాడు.
మరుసటి రోజున తన గుడారానికి కొద్ది దూరంలోగల రచ్చబండ వద్ద కచేరీ చేస్తుండగా తన గుడారం మీదుగా శ్వేతగుర్రంపై ఎవరో వేగంగా వస్తున్నట్లు ఆయనకు కనబడింది. తెల్లగుర్రంపై వచ్చే అకారం స్పష్టంగా కనబడింది. అదేవరో కాదు సాక్ష్యాత్తు ఆ శ్రీహరే. మన్రోకి ఈ విధంగా శ్రీవారి దర్శనంకాగానే గంగపేరూరు భూములను స్వాధీనపరచుకొనే అంశాన్ని మన్రో విరమించుకొన్నాడు.
1826 వ – సంవత్సరంలోనే మన్రో గవర్నరుపదవికి రాజీనామా చేసి ఇంగ్లాండుకు వెళ్లిపోవాలని నిర్ణయించుకొని ఆ విషయాన్ని బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరక్టర్స్ కు తెలిపాడు. కాని సరైన సమర్థుడైన వ్యక్తి దొరకక వారాయన విన్నపాన్ని వాయిదా వేశారు.ఇలా సంవత్సరం వరకు జరిగింది.
ఈలోగా తనకు అభిమానపాత్రమైన దత్తమండలాలను కడసారి చూద్దామని కడపనుండి తన పటాలంతో బయలుదేరాడు. కడపజిల్లాలో పాపాఘ్ని నది ఓ చోట కొండను గండిలా చీల్చుకొని ప్రవహిస్తోంది. అక్కడ వీరాంజనేయ క్షేత్రముంది. గండి వీరాంజనేయుడిగా కోరిన వరాలు తీర్చే దేవుడిగా ఇప్పటికి ఈ దేవుడు ప్రసిద్ధి.
రికార్డు చేయబడిన కథనం ప్రకారం మన్రోతన పటాలంతో గండిక్షేత్రం వద్దకు రాగానే పాపాఘ్ని నదిమీద ఆకాశంలో ఓ బంగారుతోరణం కనబడింది. మన్రో తన సిబ్బందితో అకాశంలో ఏమిటా తోరణమని ప్రశ్నించాడు. సిబ్బంది ఎగాదిగా చూచి మాకేమి కనబడలేదని బదులిచ్చారు. ఎందుకు కనబడలేదు, అదిగో అక్కడ పైన చూడండి ఎంత అందమైన బంగారుతోరణమో అంటూ మరలా చెప్పాడు. పటాలం పైకి చూచి మాకేమి కనబడలేదని సమాధానం ఇచ్చాడు.
ఇంతలో వయసుమళ్ళిన భటుడొకడు అయ్యో ఎంతపని జరిగింది, త్వరలో ఓ గొప్పవాడు మరణిస్తాడని గొణిగాడు. అతని మాటలను ఎవరు పట్టించుకోలేదు. ముందుకు బయలుదేరారు.
మన్రో మొదట అనంతపురం చేరి మరలా గుత్తికి బయలుదేరాడు.4.7.1827 వ తేదీన గుత్తిలో పటాలంలోని కొంతమందికి మహమ్మారి (కలరా ) సోకింది. రెండురోజుల విరామం తరువాత పటాలం పత్తికొండను చేరింది. 6.7.1827 వ తేదీన ఉదయం మేజర్ జనరల్ సర్ థామస్ మన్రోకి మహమ్మారి సోకింది.
మధ్యాహ్నానికి మహమ్మారి కుదుటపడ్డట్టు కనబడినా సాయంత్రానికి తిరగబెట్టింది. రాత్రికి మన్రో ఆరోగ్యం విషమించి 9.30 గంటలకు ఈ లోకాన్ని వదిలాడు.
7.7.1827 వ తేదీన గుత్తికోట పర్వతసానువు వద్ద ఖననం చేశారు. రాయలసీమ పెన్నిధి శకం ఇలా ముగిసింది.
(1) ఇందులో ఎగాదిగా అనే పదాన్ని వాడటం జరిగింది. అలా అంటే ఏమిటి ?
(2) మన్రో అస్థికలతో సమాధి ఇపుడెక్కడవుంది ?
(3) అనంతపురం, బళ్లారి జిల్లా కలెక్టరు కార్యాలయాలలో, మదరాసులోని సెయింట్ మేరి చర్చిలో సర్ థామస్ మన్రో చిత్ర పటాలున్నాయి. వీటిని ఎక్కడనుండి తీసుకోవడం జరిగిందో చెప్పగలరా ?
………………………………………………………………………………………….. జి.బి.విశ్వనాథ.9441245857. అనంతపురం.