* తెలంగాణ రాజధాని హైదరాబాద్.. ఏపీలోని ప్రధాన నగరం విజయవాడ మధ్య ప్రయాణించే రైలు ప్రయాణికులకు శుభవార్త. లింగంపల్లి – విజయవాడ మధ్య నడిచే ఇంటర్‌సిటీ ఏసీ ఎక్స్‌ప్రెస్ రైలును పునరుద్ధరించారు. 9వ తేదీన ఈ ప్రత్యేక రైలు విజయవాడ నుంచి ప్రారంభమవుతుంది. 10వ తేదీన లింగంపల్లి నుంచి ఈ రైలు బయలుదేరుతుంది. తర్వాత ప్రతి రోజూ ఉదయం లింగంపల్లి నుంచి విజయవాడకు, సాయంత్రం విజయవాడ నుంచి లింగంపల్లికి ప్రయాణం సాగిస్తుంది. లింగంపల్లి నుంచి 02796 నంబరుతో ఈ రైలు ప్రతి రోజూ వేకువజామున 4.40 గంటలకు బయలుదేరుతుంది. సికింద్రాబాద్‌కు ఉదయం 5.20 గంటలకు చేరుకుని.. 5.30కి తిరిగి బయలుదేరుతుంది. ఉదయం 10.30 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది. విజయవాడ నుంచి 02795 నంబరుతో ఈ రైలు ప్రతి రోజు సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి.. సికింద్రాబాద్‌కు రాత్రి 10.15 గంటలకు చేరుకుని తిరిగి 10.20 గంటలకు బయలుదేరి లింగంపల్లికి 11.20 గంటలకు చేరుకుంటుంది. ఏసీ చైర్‌కార్‌తో పాటు నాన్ ఏసీలో కూర్చొనే వెసులుబాటు ఉంది. కరోనా నేపథ్యంలో శానిటైజేషన్ చేసిన తర్వాత రైలు బయలుదేరుతుంది. మొత్తం సీట్లన్నింటికీ రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. రిజర్వేషన్ ఉన్నవారినే అనుమతిస్తారు. హైదరాబాద్-హజ్రత్ నిజాముద్దీన్‌ల మధ్య ప్రతిరోజు నడుస్తున్న దక్షిణ్ ఎక్స్‌ప్రెస్(నంబరు.02721/02722) ప్రత్యేక రైలు రాకపోకల సమయాలు జనవరి 1వ తేదీ నుంచి మారుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ రైలు హైదరాబాద్ నుంచి రాత్రి 10.30కి బదులుగా రాత్రి 11 గంటలకు బయల్దేరుతుంది. హజ్రత్ నిజాముద్దీన్(దిల్లీ) స్టేషన్‌కు రెండోరోజు తెల్లవారుజామున 4.05 గంటలకు బదులుగా 3.40కి చేరుకుంటుంది. హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్ నుంచి రాత్రి 11 గంటలకు బదులు 10.50కి బయల్దేరి హైదరాబాద్ స్టేషన్‌కు రెండోరోజు తెల్లవారుజామున 4.45కి బదులు 3.40కి చేరుకుంటుంది.
* వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఉద్యోగుల టేక్ హోమ్ శాలరీ (నెలవారీ చేతికొచ్చే మొత్తం)లో కోత పడనున్నట్టు సమాచారం. నూతన వేతన నిబంధన- 2019 వల్ల ఈ మార్పు చోటుచేసుకోబోతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కేంద్రప్రభుత్వం తాజాగా ముసాయిదా విడుదల చేసింది. ఈ ముసాయిదా ప్రకారం ఇకపై అలవెన్సుల వాటా 50 శాతానికి మించరాదు. దీంతో మూల వేతనాన్ని (బేసిక్ పే) 50 శాతంగా నిర్ణయించాల్సి ఉంటుంది. దీనివల్ల ఆ మేర గ్రాట్యుటీ చెల్లింపులు, పీఎఫ్ వాటా పెరిగి ఏప్రిల్ నుంచి టేక్ హోం శాలరీ కొంతమేర తగ్గనుంది. నూతన నిబంధనలకు అనుగుణంగా సంస్థలు ఆ మేరకు వేతనాల్లో సవరణలు చేపట్టొచ్చని తెలుస్తోంది.
* దేశీయ మార్కెట్లు మరోసారి సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ చరిత్రలో తొలిసారి 46 వేల మార్కును దాటింది. కరోనా వైరస్‌కు వీలైనంత త్వరలో వ్యాక్సిన్ వస్తుందన్న అంచనాలు, ఆర్థిక వ్యవస్థ త్వరగా కోలుకుంటుండడం వంటి సానుకూల పరిణామాలు మార్కెట్ల వరుస ర్యాలీకి కారణమవుతున్నాయి. బ్యాంక్, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ షేర్లు రాణించడంతో బుధవారం నాటి ట్రేడింగ్‌లో మార్కెట్లు మరోసారి దూసుకెళ్లాయి. నిఫ్టీ సైతం 13,500 పైన ముగిసింది.
* డిజిటల్ ఆర్థిక కార్యకలాపాల నిర్వహణలో భారత్ అద్భుతమైన పద్ధతులను అవలంబిస్తోందని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తెలిపారు. ఇవే విధానాల్ని ఇతర దేశాల్లోనూ అమలుచేసేందుకు తమ దాతృత్వ సంస్థ కృషి చేస్తోందని వెల్లడించారు. చైనా కాకుండా మరే దేశం నుంచైనా ప్రపంచం నేర్చుకోవాలనుకుంటే కచ్చితంగా భారత్‌వైపు చూడాల్సిందేనని అభిప్రాయపడ్డారు. సింగపూర్‌లో మంగళవారం జరిగిన ఓ ఫిన్‌టెక్ సదస్సులో బిల్‌గేట్స్ వర్చువల్‌గా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
* దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ దిగ్గజం ఈ ఏడాది చివరిలో బీఎస్-6 మోడల్ వాహనాలపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని తన అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించింది. మోడల్‌ను బట్టి ఈ డిస్కౌంట్లు లక్షరూపాయల వరకు ఉన్నాయి. ‘డిసెంబర్ డిలైట్’ స్కీం కింద వీటిని అందిస్తోంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్‌ఛేంజి బెనిఫిట్స్, కార్పొరేట్ డిస్కౌంట్ వంటివి ఉన్నాయి. ఈ ఆఫర్లు డిసెంబర్ 31 వరకు అమల్లో ఉండనున్నాయి. మోడల్‌ను బట్టి ఇవి మారిపోతాయి. ఇవి కాకుండా ప్రభుత్వ ఉద్యోగులకు రూ.8వేలు అదనపు డిస్కౌంట్, మెడికల్ ఉద్యోగులకు అదనపు ఆఫర్లు ఇస్తోంది. చిన్నకారు సాంత్రోపై ఇవన్నీ కలుపుకొంటే రూ.50వేలు లబ్ధి చేకూరనుంది. దీనిలో క్యాష్ డిస్కౌంట్ రూ.30 వేలు, ఎక్స్ఛేంజి ఆఫర్ రూ.15 వేలు, కార్పొరేట్ ఆఫర్ రూ.5వేలు ఉన్నాయి. ఎంట్రిలెవల్‌లోని ఎరా వేరియంట్‌కు మాత్రం క్యాష్ డిస్కౌంట్ రూ.20 వేలు లభించనుంది.
* భారత్‌లో కఠినమైన సంస్కరణలను అమలు చేయడం కష్టమని, ఇక్కడ ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉందని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. అయితే చైనా వంటి దేశాలకు పోటీ ఇచ్చేందుకు మరిన్ని సంస్కరణలు అవసరమని అభిప్రాయపడ్డారు. స్వరాజ్య మ్యాగజైన్ నిర్వహించిన వర్చువల్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. మైనింగ్, బొగ్గు, కార్మిక, వ్యవసాయం సహా అన్ని రంగాల్లో కేంద్రం కఠిన సంస్కరణలను అమలు చేసిందని, తదుపరి దశ సంస్కరణలను రాష్ట్రాలు ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. కఠినమైన సంస్కరణలు లేకుండా చైనా వంటి దేశాలకు పోటీ ఇవ్వలేమని తెలిపారు. ‘10-12 రాష్ట్రాలు అధిక వృద్ధి రేటు సాధిస్తే.. భారత్‌లో వృద్ధి నమోదుచేయకపోవడంలో ఆశ్యర్యం ఉండదు. డిస్కంలను ప్రైవేటీకరణ చేయాల్సిందిగా కేంద్రపాలిత ప్రాంతాలను కోరాం. డిస్కంలు మరింత పోటీ ఇచ్చే విధంగా తయారై చౌక ధరలకే విద్యుత్‌ను అందించాలి. ఇక వ్యవసాయ రంగానికి కూడా సంస్కరణలు చాలా అవసరం. కనీస మద్దతు ధర, మండీలు కొనసాగుతాయని రైతులు అర్థం చేసుకోవాలి. రైతుల తమకు నచ్చిన విధంగా పంటను అమ్ముకునే సౌలభ్యాన్ని కొత్త చట్టాలు అందిస్తున్నాయి’ అని అమితాబ్ కాంత్ చెప్పారు. ప్రభుత్వం అత్మనిర్భర్ భారత్ నినాదంతో భారత కంపెనీల సత్తా బయటకు వస్తుందని అభిప్రాయపడ్డారు. ఇక భారత్ తయారీ హబ్‌గా ఎదిగేందుకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు (పీఎల్‌ఐ) పథకం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.