Movies

సినిమా తీశారు. యూనిఫాం నిండా తప్పులు.

సినిమా తీశారు. యూనిఫాం నిండా తప్పులు.

ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు బాలీవుడ్‌ స్టార్‌ హీరో అనిల్‌ కపూర్‌ క్షమాపణలు చెప్పాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. బాలీవుడ్‌ సినిమా ‘ఏకే వర్సెస్‌ ఏకే’లోని కొన్ని సన్నివేశాలపై ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ (ఐఏఎఫ్‌) అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రముఖ నటుడు అనిల్‌ కపూర్‌, సోనమ్‌ కపూర్‌, అనురాగ్‌ కశ్యప్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమిది. విక్రమాదిత్య మోట్వానీ దర్శకుడు. నెట్‌ఫ్లిక్స్‌ ఈ చిత్రం డిసెంబర్ 24న విడుదల కాబోతోంది. సినిమా ప్రచారంలో భాగంగా డిసెంబరు 7న ట్రైలర్‌ను విడుదల చేశారు. అందులో అనిల్‌ ఐఏఎఫ్‌ యూనిఫాంలో కనిపించారు. ఆయన కుమార్తె సోనమ్‌ కపూర్‌ను అనురాగ్‌ కిడ్నాప్‌ చేస్తాడు. ఆమెను రక్షించుకోవడానికి కేవలం 10 గంటల సమయం ఇస్తున్నానని చెప్తాడు. ఈ ట్రైలర్‌ను చూసిన ఐఏఎఫ్‌ ట్విటర్‌లో స్పందించింది. అనిల్‌ యూనిఫాం సరిగ్గా లేదని, వీడియోలో ఆయన మాట్లాడిన భాష అభ్యంతరకరంగా ఉందని పేర్కొంది. ఇది ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో విధులు నిర్వహిస్తున్న వారి ప్రవర్తనా నిబంధనలకు అనుగుణంగా లేదని, ఆ సన్నివేశాన్ని తొలగించాలని దర్శక, నిర్మాతలను కోరింది. ఈ వివాదంపై ఇంకా నిర్మాతలు స్పందించలేదు.

అయితే.. అనిల్‌ కపూర్‌ ట్విటర్‌ వేదికగా ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు క్షమాపణలు చెప్పారు. ‘నా కొత్త చిత్రం ఎకె వర్సెస్ ఎకె ట్రైలర్ కొంతమందిని బాధపెట్టిందని నా దృష్టికి వచ్చింది. అభ్యంతరకరమైన పదాలు మాట్లాడినప్పుడు నేను భారత వైమానిక దళం యూనిఫాంలో ఉన్నాను. నావల్ల ఎవరి మనసుకైనా గాయమైతే వారందిరికీ నా క్షమాపణలు తెలియజేస్తున్నాను’ అని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.