అధికారంలో ఉన్నవారు అవినీతికి పాల్పడతారని విమర్శలు వస్తుంటాయి. అందరూ అవినీతికి పాల్పడకపోవచ్చు.. కానీ లంచాలు తీసుకొని, వృత్తికి మచ్చ తెచ్చే వారు కొందరుంటారు. లంచగొండి తనాన్ని అరికట్టడం కోసం ప్రభుత్వాలు ప్రత్యేకంగా అవినీతి నిరోధక శాఖను ఏర్పాటు చేసి అధికారుల్ని నియమిస్తాయి. ఎవరైనా లంచం తీసుకుంటూ పట్టుబడినా, అవినీతికి పాల్పడినట్టు తెలిసినా దాడులు చేసి నిందితులకు శిక్ష పడేలా చేస్తాయి. ఇప్పుడయితే.. కెమెరాలు, కంప్యూటర్లు ఇలా సాంకేతికతను ఉపయోగించి లంచం తీసుకున్నారని చెప్పడానికి అనేక ఆధారాలు చూపించగలుతున్నాం. కానీ, ఇవేవీ లేనప్పుడు అవినీతికి పాల్పడ్డారని తెలుసుకోవడం ఎలా? 17వ శతాబ్దంలో ఇంగ్లాండ్‌లోని ఓ నగరం ఇందుకోసం వినూత్న ఆలోచన చేసింది. ఇప్పటికీ దాన్ని అనుసరించడం విశేషం. బకింగ్‌హమ్‌షైర్ కౌంటీలోని హై వికాంబ్‌లో 1678 నుంచి నగర మేయర్ అవినీతికి పాల్పడ్డారా లేదా తెలుసుకోవడం కోసం విచిత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ వస్తున్నారు. మేయర్‌గా ఎన్నికైన వ్యక్తిని బాధ్యతలు స్వీకరించేముందు నగరంలో బహిరంగంగా తులాభారంలో కూర్చొబెట్టి వారి బరువు ఎంత ఉన్నారో కొలిచి రాసుకుంటారు. మరుసటి ఏడాది మళ్లీ మేయర్‌ను తులాభారంలో వేసి బరువు కొలుస్తారు. గతేడాది ఉన్న బరువు కంటే ఎక్కువ పెరిగితే అవినీతికి పాల్పడుతూ.. ప్రజల సొమ్మును తినే లావు అయ్యాడని నిర్థారించేవారు. అలా లావు పెరిగిన వ్యక్తుల్ని ప్రజలు కుళ్లిన టమాటాలతో కొట్టేవారు. మేయర్‌గా నియమితులైన వారు ఏటా ఈ తంతులో పాల్గొనాల్సిందే. దీన్నే అక్కడి ప్రభుత్వం ఇంకా కొనసాగిస్తూ సంప్రదాయాన్ని కాపాడుతోంది. అయితే, బరువు పెరగడంతో అవినీతికి పాల్పడినట్లు నిర్థారించట్లేదు. కుళ్లిన టామాటాలతో కొట్టట్లేదు. కేవలం ఈ తులాభారాన్ని ఆచారంగా నిర్వహిస్తున్నారు.
అవినీతి మేయర్ల బరువు తూచి…కుళ్లిన టమాటాలతో కొడతారు
Related tags :