పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అంతుచిక్కని వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. బుధవారం ఉదయం నుంచి మరో 18 మంది అస్వస్థతకు గురికావడంతో మొత్తం బాధితుల సంఖ్య 585కు చేరింది. ఇప్పటివరకు 503 మంది రోగులను డిశ్చార్జ్ చేయగా.. ప్రస్తుతం 58 మంది ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలినవారికి గుంటూరు, విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు. రోగుల రక్త నమూనాలతోపాటు నీరు, ఆహార పదార్థాల నమూనాలను పరీక్షలకు పంపించామని.. వీటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థల నివేదికలు వచ్చాక స్పష్టమైన ప్రకటన చేస్తామని అధికారులు వెల్లడించారు.
క్రిమిసంహారక మందుల్లో ఉండే ‘ఆర్గానో క్లోరిన్’ కారణంగానే ఏలూరులో అంతుచిక్కని వ్యాధి ప్రబలినట్లు వైద్య వర్గాలు ఓ అంచనాకు వచ్చాయి. బాధితుల రక్తంలో సీసం, నికెల్ వంటి లోహాలున్నట్లు దిల్లీ ఎయిమ్స్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ)ల పరీక్షల్లోనూ నిర్ధారణ అయింది. వీటికి అదనంగా ఆర్గానో క్లోరిన్ కలిసినందువల్లనే మూర్ఛ, ఇతర అనారోగ్య లక్షణాలు బాధితుల్లో కనిపిస్తున్నాయని భావిస్తున్నారు. ఆర్గానో క్లోరిన్ నీరు లేదా పాలలో కలిసేందుకు అవకాశాలున్నాయా? అందుకు దారి తీసిన కారణాలేమిటి? అనే దానిపై విశ్లేషణలు జరుగుతున్నాయి. బ్యాటరీల రీసైక్లింగ్‌లో భాగంగా సీసం నేలలో కలిసి ఉండొచ్చు. కూరగాయలు, ధాన్యం లాంటి.. వాటి ద్వారా కూడా శరీరంలో చేరి ఉండొచ్చు. దీంతోపాటు ఆర్గానో క్లోరిన్ ప్రభావంపై నిర్థారణ జరిగితే.. అంతుచిక్కని వ్యాధి మూలాలు తెలిసినట్లేనని మంగళగిరి ఎయిమ్స్ వైద్యుడొకరు అన్నారు. దీనిపై శుక్రవారం నాటికి స్పష్టత వస్తుందని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలోనూ దీనిపై చర్చకు వచ్చినట్లు తెలిసింది.