వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ పార్థివ్ పటేల్ ఆటకు వీడ్కోలు పలికాడు. అన్ని రకాల క్రికెట్ నుంచి రిటైరవుతున్నట్లు బుధవారం ట్విట్టర్లో ప్రకటించాడు. ‘‘అన్ని రకాల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా. 18 ఏళ్ల క్రికెట్ ప్రయాణానికి తెరదించుతున్నా. 17 ఏళ్ల కుర్రాడిపై నమ్మకంతో భారత్‌కు ఆడే అవకాశం కల్పించి.. కెరీర్ తొలి రోజుల్లో నాకు అండగా నిలిచి, చేయి పట్టుకుని నడిపించిన బీసీసీఐకి ఎంతో రుణపడి ఉంటా. నా కెప్టెన్లందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా నా మీద నమ్మకముంచిన నా మొదటి నాయకుడు గంగూలీకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. నేను టీమ్ఇండియాకు ఆడాలని మా నాన్న కల కన్నారు. ఎన్నో త్యాగాలు చేశారు. ప్రతి ముగింపు తర్వాత ఓ కొత్త ఆరంభం ఉంటుంది. త్వరలోనే మళ్లీ కలుస్తా’’ అని ట్విట్టర్లో పోస్టు చేసిన లేఖలో అతను పేర్కొన్నాడు. అతని రిటైర్మెంట్పై స్పందించిన సచిన్.. ‘‘పార్థివ్.. నీ అద్భుతమైన కెరీర్‌కు అభినందనలు. వెనకడుగు వేయని నీ వ్యక్తిత్వం నాకెంతో ఇష్టం. అది నాకూ అండగా నిలిచింది. రావల్పిండిలో పాకిస్థాన్‌పై ఓపెనర్‌గా పట్టుదలతో నువ్వాడిన ఇన్నింగ్స్ నాకిప్పటికీ గుర్తుంది’’ అని ట్వీట్ చేశాడు. బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ.. ‘‘భారత క్రికెట్‌కు పార్థివ్ ఓ గొప్ప రాయబారి. అతనెప్పుడూ జట్టు మనిషిగా ఉండేవాడు. 17 ఏళ్ల వయసులో అతను అంతర్జాతీయ అరంగేట్రం చేసినపుడు టీమ్ఇండియాకు నేను కెప్టెన్‌గా ఉన్నా. అతని భవిష్యత్ బాగుండాలని కోరుకుంటున్నా’’ అని పేర్కొన్నాడు. తన కెరీర్లో గంగూలీ, అనిల్ కుంబ్లే ప్రత్యేకమైన సారథులుగా మిగిలిపోతారని రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత వర్చువల్ సమావేశంలో పార్థివ్ తెలిపాడు. ‘‘నాకెప్పటికీ నిజమైన నాయకుడంటే గంగూలీనే. ఆటగాళ్లను సమన్వయం చేయడం, వాళ్ల పట్ల ప్రవర్తించే విధానం.. ఇలా ఎన్నో గొప్ప లక్షణాలు అతనికున్నాయి. అతను, కుంబ్లే మేటి నాయకులు. నా వ్యక్తిత్వాన్ని వాళ్లు తీర్చిదిద్దారు. దాదా చేతుల మీదుగా అందుకున్న ఆ టెస్టు క్యాప్ (దాని మీద నా పేరు తప్పుగా అచ్చయింది) ఇప్పటికీ నా దగ్గర ఉంది. హెడింగ్లీ (2002), అడిలైడ్ (2003-04)లో సాధించిన విజయాలు, రావల్పిండి మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చి అర్ధసెంచరీ చేయడం.. ఇవి నాకిష్టమైన జ్ఞాపకాలు’’ అని 35 ఏళ్ల పార్థివ్ పేర్కొన్నాడు.
పార్థివ్ పటేల్ వీడ్కోలు
Related tags :