Food

సింధు లోయ నాగరికులు మాంసాహారులు

సింధు లోయ నాగరికులు మాంసాహారులు

సింధు లోయ నాగరికత 4,000 ఏళ్ల క్రితం ఉనికిలో ఉందని వివిధ చోట్ల జరిపిన తవ్వకాల్లో బయటపడ్డ విషయం తెలిసిందే. అయితే, వారు ఏ ఆహారం ఎక్కువగా తీసుకున్నారు? అనేది ఇప్పటికీ మనకు సమాధానం దొరకని ప్రశ్నగానే ఉంది. తాజా అధ్యయనంలో దీనికి సమాధానం దొరికేసింది. సింధూ ప్రజలు ఎక్కువగా మాంసాహారంపైనే ఆధారపడ్డారని శాస్త్రవేత్తలు గుర్తించారు. పశువులు, గేదెలు, గొర్రెలు, మేకలు, పందులతోపాటు పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకునేవారని కనుగొన్నారు. ఈ అధ్యయనం వివరాలు ‘జర్నల్ ఆఫ్ ఆర్కియాలజికల్ సైన్స్’లో ప్రచురితమయ్యాయి. సింధు లోయ నాగరికత ఆహార ఎంపికలు, ప్రాధమ్యాలను తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు అధ్యయనం నిర్వహించారు. సింధూప్రజలు వంటకు వాడిన కుండలపై విశ్లేషణ జరిపారు. పురాతన సిరామిక్‌ పాత్రల నాళాల్లో కొవ్వు అవశేషాలను గుర్తించారు. దీంతో వారు ఈ నిర్ధారణకు వచ్చారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నివసించే సింధూ ప్రజలుకూడా మాంసాన్నే ఎక్కువగా తీసుకునేవారని తేల్చారు. ఇందులో కొవ్వుతోకూడిన మాంసం అధికమొత్తంలో ఉన్నట్లు గుర్తించారు. ఈ కొవ్వు మాంసం వారికి వాతావరణ మార్పులకు తట్టుకునేలా ఉపయోగపడిందని అంచనా వేశారు.

కొవ్వులు, జిడ్డైన ఆహారంలో లిపిడ్లు ఉంటాయి. ఇవి అణువులు. పాత్రలపైన వీటి జాడలను తొలగించడం చాలా కష్టం. ఇవి వేల సంవత్సరాలవరకు ఉండగలవు. కానీ ప్రొటీన్‌లాంటి ఇతర పోషకాలు త్వరగా క్షీణిస్తాయి. ఇదిలా ఉండగా, హరప్పన్‌ ప్రజల ఆహారంలో కూడా కొవ్వు మాంసం వినియోగం ఉందని పరిశోధకులు నిర్ధారించారు. దేశీయ జంతువులలో పశువులు/గేదెలు పుష్కలంగా ఉన్నాయి. జంతువుల ఎముకలు 50%-60% మధ్య సగటున, గొర్రెలు / మేక ఎముకలు 10% మాత్రమే లభించాయి. దీన్నిబట్టి సింధుప్రజలు గొడ్డు మాంసం ఎక్కువగా తిని ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనావేశారు. మేక లేదా గొర్రె మాంసాన్ని తక్కువమొత్తంలో తీసుకునేవారని గుర్తించారు. జింకలు, కుందేళ్ళు, పక్షులు, సముద్రజీవులు, జంతు జాతుల అవశేషాలు కూడా గ్రామీణ, పట్టణప్రాంతాల్లో కనిపించాయి. ఈ విభిన్న వనరులకు సింధు ఆహారంలో స్థానం ఉందని అధ్యయనం తెలుపుతున్నది. దేశీయ, అడవి క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు, నది చేపలు, మొలస్కాలనుకూడా చిన్నమొత్తంలో తీసుకునేవారని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈశాన్య భారతదేశంలోని సింధు లోయ నాగరికత వెలసిల్లిన గ్రామీణ, పట్టణ స్థావరాల్లో లభించిన పురాతన సిరామిక్స్‌ను విశ్లేషించి, శాస్త్రవేత్తలు ఈ నిర్ధారణకు వచ్చారు.