* నిలకడైన ఆదాయంతోనే పల్లె ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. గ్రామీణ ప్రాంతాలకు ఆసరాగా నిలిచేందుకే ‘జగనన్న జీవక్రాంతి’ పథకాన్ని ప్రారంభించినట్లు సీఎం తెలిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా రైతు భరోసా కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు గొర్రెలు, మేకల యూనిట్లు పంపిణీ చేయనున్నారు. వ్యవసాయంతో పాటు పశుపోషణ చేపట్టగలిగితే కరవు కాటకాలు వచ్చినా రైతు కుటుంబాలు ధీమాగా ఉంటాయని సీఎం జగన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
* తెలంగాణలో వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లకు హైకోర్టు అనుమతి లభించింది. కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు చేపట్టాలని ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ వినతి మేరకు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు పలు సూచనలు చేస్తూ అనుమతిచ్చింది. రిజిస్ట్రేషన్ కోసం ముందుగా స్లాట్ బుకింగ్ చేసుకొనే విధానానికి అనుమతిచ్చింది. ఆస్తిపన్ను గుర్తింపు సంఖ్య కచ్చితంగా ఉండాలన్న నిబంధనకు న్యాయస్థానం సమ్మతించింది. రిజిస్ట్రేషన్ల సమయంలో ఆధార్, కులం, కుటుంబసభ్యుల వివరాలు అడగబోమని ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్లు ఆపాలని ఎప్పుడూ స్టే ఇవ్వలేదని విచారణ సందర్భంగా మరోసారి న్యాయస్థానం స్పష్టం చేసింది. అలాగే ధరణిపై ఇవాళ మరో ఐదు అనుబంధ పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ హైకోర్టును గడువు కోరారు. ఈ మేరకు విచారణను ఈ నెల16కు ఉన్నత న్యాయస్థానం వాయిదా వేసింది.
* భారత పార్లమెంట్ నూతన భవనానికి శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అభినందనలు తెలిపారు. స్వతంత్ర ప్రజాస్వామ్య చరిత్రలో ఇదో మైలురాయిగా నిలిచిపోతుందని కొనియాడారు. భగవంతుడి అభీష్టమైన అమరావతికి కాలమే దిక్సూచి అని అన్నారు. ఈ మేరకు చంద్రబాబు ట్వీట్ చేశారు. వేర్వేరు ప్రాంతాల్లోని ప్రభుత్వ శాఖలన్నింటినీ ఒకేచోటకు చేర్చడం ద్వారా రెడ్ టేపిజంకు అడ్డుకట్టవేసే కేంద్రీకృత పరిపాలనా వ్యవస్థకు ఇది నాంది పలుకుతుందని అభిప్రాయపడ్డారు.
* కోనసీమ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రసాయన పరిశ్రమల ఏర్పాటును వ్యతిరేకిస్తున్నామని మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. గతంలో దివీస్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకించినట్లు నటించిన వైకాపా.. ఇప్పుడు అనుమతి ఇవ్వడంలో ఆ పార్టీ అసలు రంగు బయటపడిందని విమర్శించారు. ఈ రసాయన పరిశ్రమల ఏర్పాటు వల్ల సముద్రజలాలు కలుషితమై మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతారన్నారు. భూములన్నీ ఉప్పు తేలడంతో రైతులకు ఎనలేని నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 300పైగా హేచరీలు కూడా కాలుష్యంలో చిక్కుకుని చిరు వ్యాపారులంతా పూర్తిగా దెబ్బతింటారని పేర్కొన్నారు. వాళ్ల ఆదాయాలు క్షీణించడమే కాకుండా ప్రభుత్వ రాబడి కూడా పడిపోతుందని యనమల ఆందోళన వ్యక్తం చేశారు.
* తెలంగాణలో రాక్షస పాలన కొనసాగుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. రైతులపై సీఎం కేసీఆర్ కపట ప్రేమ చూపిస్తున్నారని ఆయన ఆరోపించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన మీడియా సమావేశంలో సంజయ్ మాట్లాడారు. భూసార పరీక్షలకు కేంద్రం రూ.125కోట్లు విడుదల చేసినా ఆ నిధులు ఎక్కడికెళ్లాయో అర్థం కావడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తెరాస నేతలు కృత్రిమ ఉద్యమం చేశారని ఆయన ఆరోపించారు. బంద్‌లో రైతులు ఎక్కడా పాల్గొనలేదన్నారు. కొత్త వ్యవసాయ చట్టాలను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పకుండా సీఎం కేసీఆర్ ముఖం చాటేస్తున్నారని సంజయ్ విమర్శించారు. కేసీఆర్‌కు ఎన్నికలప్పుడే మాత్రమే రైతుబంధు గుర్తొస్తోందన్నారు. రైతుల రుణాలను ఎందుకు మాఫీ చేయలేదని ప్రశ్నించారు. సన్నరకం ధాన్యానికి రూ.2,500 ధర, రుణమాఫీ, రైతుబంధు తేదీలు ప్రకటించాలనే డిమాండ్లతో భాజపా కిసాన్‌మోర్చా ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు.
* తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం డిసెంబరు 16వ తేదీన ప్రారంభం కానుంది. ఆనాటి ఉదయం 6.04 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కానున్న నేపథ్యంలో డిసెంబరు 17వ తేదీ నుండి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. కాగా ధనుర్మాస ఘడియలు 2021, జనవరి 14న ముగియనున్నాయి.
* సీఎంగా కేసీఆర్ ఆరేళ్ల పాలనలో ఏం అభివృద్ధి చేశారని భాజపా నేత విజయశాంతి ప్రశ్నించారు. ఆయన పతనం ప్రారంభమైందని.. త్వరలోనే తెరాస కనుమరుగుకానుందని ఆమె జోస్యం చెప్పారు. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో విజయశాంతి మాట్లాడారు. తెలంగాణకోసం తాము ఉద్యమం చేస్తున్నప్పుడు కేసీఆర్ తెదేపాలో ఉన్నారన్నారు. తన దూకుడు చూసి ఆలె నరేంద్రను రాయబారానికి పంపారని.. తల్లి తెలంగాణ పార్టీని తెరాసలో విలీనం చేయాలంటూ కేసీఆర్ తనపై ఒత్తిడి తెచ్చారని ఆమె ఆరోపించారు. కేసీఆర్ తనకంటే గొప్ప నటుడని విజయశాంతి వ్యాఖ్యానించారు. ఎంపీగా గెలిచినప్పటి నుంచి తనను రాజకీయాలకు దూరం చేయాలనే కుట్ర పన్నారన్నారు. తెలంగాణ ఇస్తున్నామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించగానే అర్ధరాత్రి తనను తెరాస నుంచి సస్పెండ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా మద్దతుతోనే తెలంగాణ బిల్లు ఆమోదం పొందిందన్నారు. తెరాసను ఇన్నాళ్లు ప్రజలు భరించారని.. ఇక భరించే ఓపిక వారికి లేదన్నారు. జీవితాంతం తన కుటుంబమే పరిపాలించాలనే విధంగా కేసీఆర్ గేమ్ ప్లే చేశారని విజయశాంతి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో పదవుల కొట్లాట జరుగుతోందని.. రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయం భాజపానే అని చెప్పారు.
* నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సీనియర్ నేత, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ రాజీనామా చేశారు. గ్రేటర్ ఎన్నికల సీట్ల కేటాయింపులో తన ప్రమేయం లేదన్నారు. అంబర్‌పేటలో వీహెచ్, జూబ్లీహిల్స్‌లో విష్ణువర్ధన్‌రెడ్డి, సనత్‌నగర్‌లో మర్రిశశిధర్‌రెడ్డి.. ఇలా పార్టీలో అందరూ పెద్ద నేతలే ఉన్నారన్నారు. కార్పొరేటర్ అభ్యర్థుల సీట్ల కేటాయింపులో తాను సికింద్రాబాద్, ముషీరాబాద్ నియోజకవర్గాలను మాత్రమే చూశానని అంజన్‌కుమార్ తెలిపారు. తన రాజకీయ జీవితం ఉన్నంతకాలం కాంగ్రెస్‌లోనే ఉంటానని.. భాజపాలోకి ఎట్టిపరిస్థితుల్లోనూ వెళ్లనని స్పష్టం చేశారు. గ్రేటర్లో ఓటమి అపనింద ఇష్టంలేదన్నారు. తనకు పీసీసీ అధ్యక్షుడిగా పదోన్నతి కావాలని.. అందుకే హైదరాబాద్ నగర అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.
* రాష్ట్రంలో లాక్‌డౌన్‌కు ముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చే విధంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. కడప జిల్లాలో 50శాతానికిపైగా జడ్పీటీసీ, ఎంపీటీసీలను వైకాపా ప్రభుత్వం ఏకగ్రీవం చేసుకుందని ఆరోపించారు. వాటిని రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. కడప నగరంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.
* నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఆందోళనపై కేంద్ర మంత్రి రావు సాహేబ్ దన్వే చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. రైతుల ఆందోళన వెనక పాకిస్థాన్, చైనా హస్తం ఉందంటూ ఆయన మాట్లాడిన తీరును దిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ(డీఎస్‌జీఎంసీ) తీవ్రంగా ఖండించింది. ‘రైతులు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం వారికి న్యాయం చేయడంలో విఫలమైంది. వారు దేశం కోసం పోరాడుతూ ప్రాణాలు కోల్పోతుంటారు, ఆహారాన్ని పండిస్తుంటారు, వారి పిల్లలు కూడా దేశం కోసం అమరవీరులుగా మారుతుంటారు.. అలాంటి వారిని దేశ వ్యతిరేకులుగా ముద్రించడానికి ప్రయత్నించవద్దు. అలాంటి వ్యాఖ్యలు సిగ్గుచేటు’ అని డీఎస్‌జీఎంసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి చెందిన కొందరు మంత్రులు, ప్రతినిధులు తరచూ ఇలాంటి ఆరోపణలు చేస్తుంటారని విమర్శించింది.
* వ్యవసాయ చట్టాలను కేంద్రం ఉపసంహరించుకొనే వరకూ వెనక్కి తగ్గేదిలేదని రైతు సంఘాలు తేల్చి చెప్పిన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ బుధవారం భేటీ అయ్యారు. దాదాపు రెండున్నర గంటలకు పైగా వీరిద్దరి మధ్య సమావేశం జరిగింది. మంగళవారం రాత్రి రైతు సంఘాలతో చర్చించిన అమిత్ షా చట్టాలను వెనక్కి తీసుకొనేది లేదని, కొన్ని సవరణలకు అంగీకరిస్తామని స్పష్టం చేశారు.
* పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అంతుచిక్కని వ్యాధికి గల కారణాలపై పరిశోధనలు కొనసాగుతున్నాయని పశ్చిమగోదావరి జిల్లా వైద్య విధానపరిషత్ డీసీహెచ్ఎస్ డాక్టర్ ఏఆర్ మోహన్ తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో వ్యాధికి గల కారణాలు నిర్ధారణ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. గత ఆరు రోజులతో పోల్చుకుంటే కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లు వెల్లడించారు. గత రాత్రి నుంచి కొత్తగా 6 కేసులు మాత్రమే నమోదయ్యాయని.. వ్యాధి తీవ్రత కూడా తగ్గుతోందన్నారు. ఈ ఘటనకు సంబంధించి వివిధ జాతీయ సంస్థలతో డీసీహెచ్ఎస్ సమావేశం నిర్వహించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, దిల్లీ ఎయిమ్స్, జిల్లా వ్యవసాయశాఖ బృందాలతో తాజా పరిస్థితులపై సమీక్షించారు.
* ప్రస్తుత పార్లమెంట్ భవనం స్వాతంత్ర్యం తర్వాత దేశానికి దశదిశ నిర్దేశించిందని, అలాగే నూతన పార్లమెంట్ భవనం ఆత్మనిర్భర్ భారత్‌కు దిశానిర్దేశం చేయనుందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ల పూర్తైన సందర్భానికి గుర్తుగా ఈ భవనం నిలవనుందని చెప్పారు. దేశ ప్రజలందరూ గర్వించాల్సిన క్షణమని అన్నారు. నూతన పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన చేసిన అనంతరం మోదీ ప్రసంగించారు.
* వైద్యవిద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ 2021 పరీక్షను రద్దు చేసే ఆలోచనేదీ లేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ స్పష్టం చేశారు. త్వరలో జరగబోయే పోటీ/బోర్డు పరీక్షలపై గురువారం ఆయన ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులతో వెబినార్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా 2021లో జరిగే సీబీఎస్, జేఈఈ మెయిన్, నీట్ పరీక్షలపై విద్యార్థుల సందేహాలను తీర్చారు. జేఈఈ మెయిన్స్‌ను ఏడాదికి మూడు లేదా నాలుగు సార్లు నిర్వహించే అంశాన్ని పరిగణిస్తున్నట్లు రమేశ్ పోఖ్రియాల్ తెలిపారు.
* పశ్చిమబెంగాల్లో పర్యటిస్తున్న భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై కొందరు రాళ్లదాడికి పాల్పడ్డారు. కోల్‌కతాలోని డైమండ్ హార్బర్‌కు వెళ్తుండగా తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలుగా అనుమానిస్తున్నవారు రహదారిని నిర్బంధించి నడ్డా కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. వారు వాహనాలపై రాళ్లు, కర్రలతో దాడి చేసినట్లు భాజపా బెంగాల్ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్ మద్దతుదారులే ఈ దాడికి పాల్పడినట్లు ఆరోపించారు. ఈ ఘటనలో భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్ వర్గియా కారు ధ్వంసమైనట్లు చెప్పారు.
* విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఏలూరు వింత వ్యాధి బాధితుల్ని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని పరామర్శించారు. వారికి అందుతున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. ఏలూరు నుంచి మొత్తం 25 మంది బాధితులు విజయవాడ ఆస్పత్రికి రాగా అందులో ఇద్దరు డిశ్ఛార్జి అయ్యారు. ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు. మిగిలిన వాళ్లకు ప్రత్యేక వార్డులో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన ఇద్దరు వింత వ్యాధితో చనిపోలేదని వైద్యులు నిర్ధారించినట్లు మంత్రి తెలిపారు.
* పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే రెండు పడక గదుల ఇళ్ల పథకానికి సీఎం కేసీఆర్ రూపకల్పన చేశారని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేటలో డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రారంభోత్సవ వేడుకలో భాగంగా స్థానిక డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో హరీశ్‌రావు మాట్లాడారు. సిద్దిపేట జిల్లా ఏర్పాటు అయినప్పటినుంచి ఇప్పటివరకు జిల్లా పరిధిలో దాదాపు రూ.1000 కోట్ల విలువైన పనులను ప్రారంభించుకున్నామని చెప్పారు.
* కొవిడ్ తర్వాత మార్కెట్లోకి కొత్త సంస్థలు ఐపీవోలకు రావడం మొదలైంది. త్వరలో ప్రభుత్వ రంగానికి చెందిన నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థ ‘ఇండియన్ రైల్వేస్ ఫైనాన్సింగ్ కార్పొరేషన్’ ఐపీవోకు రానుంది. ఈ విషయాన్ని కంపెనీ సీఎండీ అమితాబ్ బెనర్జీ పీటీఐకు తెలిపారు. మార్కెట్ సెంటిమెంట్ సానుకూలంగా కొనసాగితే డిసెంబర్ మూడో వారంలో బిడ్డింగ్ మొదలయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఒక వేళ ప్రతికూలంగా మారితే మాత్రం జనవరి వరకు వేచి చూడాల్సిందేనని తెలిపారు.
* గుంటూరు జిల్లా కాజా టోల్గేట్ వద్ద జరిగిన దాడి వ్యవహారంపై రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ ఛైర్పర్సన్ దేవళ్ల రేవతి వివరణ ఇచ్చారు. తన తల్లిని ఆస్పత్రికి తీసుకెళ్తున్న సమయంలో టోల్ సిబ్బంది తనపై దుర్భాషలాడుతూ అమానవీయంగా వ్యవహరిస్తూ దాడి చేశారని ఆమె ఆరోపించారు. అందువల్లే తన రక్షణ కోసం టోల్ సిబ్బందిని అడ్డుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు రేవతి ఓ వీడియో విడుదల చేశారు.
* గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చేందుకు ప్రధాని నరేంద్రమోదీ ప్రయత్నిస్తుంటే.. దేశ వ్యాప్తంగా అన్ని విపక్ష పార్టీలు భారత్‌బంద్‌లో పాల్గొనడమేంటని భాజపా సీనియర్ నేత మురళీధర్ రావు మండిపడ్డారు. హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఆరు నిర్ణయాలతో రాష్ట్ర వ్యవసాయ రంగం ధ్వంసమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన అమలు విషయంలో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.
* అర నిమిషం ఖాళీ దొరికితే అరచేతిలోకి స్మార్ట్‌ఫోన్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తోంది. దీనికి ఎవరూ అతీతులు కాదు. అంతలా ఫోన్‌కి బానిసలయ్యాం. మొబైల్ ఎక్కువగా వినియోగిస్తే దీర్ఘ కాలంలో మానసిక, ఆరోగ్య సమస్యలు రావొచ్చని నిపుణులు చెబుతున్నా, ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదని నిపుణులు అంటున్నారు. మీ పరిస్థితి ఇలానే ఉన్నా, లేకపోతే మీకు ఇలాంటి పరిస్థితి రాకూడదన్నా… సింపుల్‌గా ఈ డిజిటల్ వెల్బీయింగ్ యాప్స్‌ని ప్రయత్నించండి. మొబైల్ వాడకాన్ని తగ్గించేయండి.