సాన్పు పోసిందన్న చిన్న విషయాన్ని మనసులో పెట్టుకొన్న యువకుడు.. ఓ మహిళను అంతం చేయాలనుకొన్నాడు. కత్తితో ఎనిమిదిసార్లు పొడిచినా అతనిలోని అహం తగ్గక బండరాయితో ఇష్టమొచ్చినట్టు బాదాడు.. దాడిని ఆపేందుకు అడ్డొచ్చిన వ్యక్తిపైనా తన ప్రతాపం చూపించాడు.. తీవ్రంగా గాయపడిన ఇద్దరూ మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో గురువారం చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని మహంకాళీనగర్‌కు చెందిన మంగలి సంగీత(28) ఇండ్లల్లో పనిచేస్తూ జీవిస్తున్నది. కొన్ని రోజల క్రితం తాను పనిచేస్తున్న చిట్టిమల్ల అంబాదాస్ ఇంటి ముందు సాన్పు చల్లుతుండగా అటుగా వెళ్తున్న పట్టణానికి చెందిన ఉబేదర్ రహమాన్(20)పై నీళ్లు పడ్డాయి. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ ఘటనను మనసులో పెట్టుకున్న రహమాన్.. గురువారం అదే ఇంట్లో పనిచేస్తుండగా సంగీతపై కత్తితో దాడికి దిగాడు. సంగీతను ఎనిమిదిసార్లు పొడిచి అనంతరం బండరాయితో తలపై మోదాడు. ప్రాణభయంతో సంగీత అరవడంతో ఇంటి యజమాని అంబాదాస్ అడ్డుకోబోయాడు. ఈ క్రమంలో అంబాదాస్‌పైనా నిందితుడు బండరాయితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన సంగీత, అంబాదాస్‌ను స్థానికులు నారాయణఖేడ్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో సంగారెడ్డికి తరలించారు. నారాయణఖేడ్ పోలీసులు నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
కళ్లాపి మీద పోసిందని ఎనిమిది సార్లు కత్తితో పొడిచి…
Related tags :