ఆస్ట్రేలియాలో దేశీయంగా తయారుచేస్తున్న ఓ కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేశారు. తొలి దశలో ఆశాజనక ఫలితాలిచ్చిన ఈ టీకా రెండు, మూడో దశలో మానవ శరీరంలో కొన్ని ప్రతికూల మార్పులకు కారణమైనట్లు తేలిందని అధికారులు తెలిపారు. అయితే, అవి అంత ప్రమాదకరమైనవేమీ కానప్పటికీ.. టీకా ప్రయోగాల్ని, అభివృద్ధిని పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ విశ్వవిద్యాలయం, ఔషధ తయారీ సంస్థ సీఎస్‌ఎల్ సంయుక్తంగా ఓ టీకాను తయారుచేశాయి. ప్రాథమిక ప్రయోగాల్లో మెరుగైన ఫలితాలు రావడంతో క్లినికల్ ట్రయల్స్‌ని ప్రారంభించారు. తొలి దశలో ఆశాజనక ఫలితాలే వచ్చాయి. టీకాతో ఉత్పత్తయిన యాంటీబాడీలు కరోనాను సమర్థంగా ఎదుర్కొన్నాయి. కానీ, రెండు, మూడో దశలో కొన్ని ప్రతికూల మార్పులను గమనించారు. ఈ టీకా వల్ల ఏర్పడిన యాంటీబాడీలు హెచ్‌ఐవీ నిర్ధారణ పరీక్షలో కలగజేసుకుంటున్నట్లు కనిపెట్టారు. దీనివల్ల హెచ్‌ఐవీ లేనివారికి కూడా పాజిటివ్‌గా తేలిందని గుర్తించారు. కొంతకాలం తర్వాత మళ్లీ వారికే హెచ్‌ఐవీ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. నెగెటివ్‌గా వచ్చింది. టీకా వల్ల ఎలాంటి ప్రమాదం లేనప్పటికీ.. హెచ్‌ఐవీ నిర్ధారణ విషయంలో యాంటీబాడీలు కలగజేసుకుంటున్నందుకు ప్రయోగాల్ని పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించారు.
ఆస్ట్రేలియా టీకా రద్దు
Related tags :