DailyDose

కమల్‌తో MIM జట్టు-తాజావార్తలు

Breaking News - Kamal To Join Hands With MIM

* బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన ఆలిండియా మజ్లిస్‌-ఎ-ఇత్తేహాదుల్‌ ముస్లిమీన్‌ (ఏఐఎంఐఎం) పార్టీ దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ పోటీ చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌లో పోటీ చేస్తామని ఎంఐఎం ప్రకటించిన విషయం తెలిసిందే. బెంగాల్‌ నేతలతో హైదరాబాద్‌లో భేటీ అయిన ఆ పార్టీ చీఫ్‌, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఫలవంతమైన చర్చలు జరిగాయంటూ ట్వీట్‌ చేశారు. ఇక తాజా సమాచారం ప్రకారం.. తమిళనాడులో కూడా పాగా వేసేందుకు ఎంఎంఐం కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక ముస్లిం పార్టీలతో పాటు సినీ నటుడు కమల్‌ హాసన్‌ మక్కల్‌ నీది మయ్యం పార్టీతో జతకట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. మైనార్టీ జనాభా ఎక్కువగా ఉన్న వెల్లూర్‌, రాణీపేట్‌, తిరపత్తూర్‌, క్రిష్టగిరి, రామనాథపురం, పుదుకొట్టై, ట్రిచి, ముధురై, తిరునల్వేలి జిల్లాల్లోని కనీసం 25 నియోజకవర్గాల్లో బరిలో దిగేందుకు సమాయత్తమవుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒవైసీ, తమిళనాడు ఆఫీస్‌ బేరర్లతో సోమవారం భేటీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పోటీ చేయాల్సిన నియోజకవర్గాలు, ఎన్నికల్లో గెలుపున​కై అనుసరించాల్సిన వ్యూహాల గురించి వారితో చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశం అనంతరం తిరుచిరాపల్లి, చైన్నైలో జనవరిలో మరోసారి భేటీ అయి భవిష్యత్‌ ప్రణాళికపై నిర్ణయం తీసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తామని కమల్‌ హాసన్‌ సోమవారం ప్రకటించారు. అయితే తాము ఏయే నియోజకర్గాల్లో పోటీ చేసే అంశంపై త్వరలోనే స్పష్టతనిస్తామని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఒవైసీ, కమల్‌తో చేతులు కలిపేందుకు ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వెలువడటం గమనార్హం. కాగా 2011 గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని మొత్తం జనాభాలో ముస్లిం జనాభా సుమారు 5. 86 ఉంటుంది. ఇక ఇప్పటికే అక్కడ యూనియన్‌ ముస్లింలీగ్‌, ఇండియన్‌ నేషనల్‌ లీగ్‌, మనితనేయ మక్కల్‌ కట్చి, మనితనేయ జననయాగ కట్చి, ఆల్‌ ఇండియా ముస్లిం లీగ్‌, తమిళనాడు తోహీద్‌ జమాత్‌ సహా ఇతర రాజకీయ పార్టీలు మైనార్టీల తరఫున గళం వినిపిస్తున్నాయి. వీటిని కలుపుకోవడంతో పాటు మక్కల్‌ నీది మయ్యంతో కూడా పొత్తు పెట్టుకున్నట్లయితే విజయావకాశాలు ఎలా ఉంటాయన్న అంశంపై ఒవైసీ సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఎంఐఎం తమిళనాడు అధ్యక్షుడు వకీల్‌ అహ్మద్‌ గత నెలలో ఓ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ.. డీఎంకే(ద్రవిడ మున్నేట్ర కళగం) జనరల్‌ సెక్రటరీ దురైమురుగన్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొన్న విషయం తెలిసిందే.

* తమిళ సినీ హీరో విశాల్‌ వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. విశాల్‌ ఇదివరకే నిర్మాతల సంఘం, నడిగర్‌ సంఘం ఎన్నికల్లో పోటీ చేసి అధ్యక్షుడిగా గెలిచారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత పోటీ చేసిన ఆర్కే నగర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్‌ వేసి, చివరి క్షణంలో నామినేషన్‌ను ప్రతిపాదించిన పదిమందిలో కొందరు మద్దతు ఉపసంహరించుకోవడంతో ఆ నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించడంతో పోటీ చేయలేకపోయారు.

* కరోనా కోరల నుంచి విముక్తి కల్పించే కొవిడ్‌ వ్యాక్సిన్‌ మరికొద్ది వారాల్లో భారత్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీకా పంపిణీపై కేంద్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. తొలి ప్రాధాన్యం కింద కరోనా ముప్పు అధికంగా ఉండే వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులతో పాటు వృద్ధులకు టీకా ఇవ్వాలని యోచిస్తోన్న కేంద్రం.. తాజాగా వ్యాక్సినేషన్‌పై మార్గదర్శకాలు జారీ చేసింది. ఒక టీకా కేంద్రంలో రోజుకు 100 నుంచి 200 మందికి టీకా ఇవ్వాలని చెప్పిన ప్రభుత్వం.. వ్యాక్సిన్‌ తీసుకున్నవారిని 30 నిమిషాల పాటు పరిశీలనలో ఉంచాలని సూచించింది.

* సమయం… సాయంత్రం ఐదు గంటలు. అప్పటివరకు మోగుతున్న యూట్యూబ్‌ స్క్రీన్‌ మీద కోతి బొమ్మ వచ్చి కూర్చుంది. మెయిల్‌ చేద్దామని చూస్తే టెంపొరర్య్ ఎర్రొర్ అంటూ ఓ మెసేజ్‌ వచ్చింది. అదేంటి మీకూ ఈ సమస్య వచ్చిందా అనకండి. ఎందుకంటే ప్రపంచంలో చాలా దేశాల్లో ఇలాంటి సమస్య వచ్చింది. సుమారు గంటసేపు ఈ సమస్యతో వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. గూగుల్‌కు చెందిన ప్రధానమైన సర్వీసులు జీమెయిల్‌, యూట్యూబ్‌, డాక్స్‌, ఫొటోస్‌, కాంటాక్ట్స్‌, హ్యాంగ్‌అవుట్స్‌ ఇలా గూగుల్‌ ప్రోడక్ట్స్‌ సేవలు నిలిచిపోయాయి.

* భారత్‌లో ఎమర్జెన్సీ విధించిన నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత సుప్రీంకోర్టులో ఓ అభ్యర్ధన దాఖలైంది. 1975 నాటి ఎమర్జెన్సీని ‘పూర్తి రాజ్యాంగవిరుద్ధం’గా ప్రకటించాలంటూ ఓ వృద్ధురాలు భారత అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీన్ని విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు ధర్మాసనం.. కేంద్రప్రభుత్వ స్పందనను కోరింది.

* ఏపీ సీఎం జగన్‌ రేపు దిల్లీ వెళ్లనున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు అమరావతి నుంచి బయల్దేరి హస్తినకు పయనం కానున్నారు. దిల్లీలో పర్యటనలో భాగంగా పలువురు కేంద్రమంత్రులతో జగన్‌ సమావేశమయ్యే అవకాశముంది. ముఖ్యంగా కేంద్రహోంమంత్రి అమిత్‌షాతో సీఎం భేటీ కానున్నట్లు తెలుస్తోంది. రేపు రాత్రి 9 గంటలకు ఆయన్ను కలవనున్నట్లు సమాచారం. విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలు, పోలవరం నిధులు తదితర అంశాలతో పాటు తాజా రాజకీయ పరిస్థితులపైనా అమిత్‌షాతో సీఎం జగన్‌ చర్చించే అవకాశముంది.

* నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను కొనుగోలు చేసేందుకు టాటా గ్రూప్‌ ముందుకొచ్చింది. ఎయిరిండియా కొనుగోలుకు ఆసక్తికర వ్యక్తీకరణ (ఈవోఐ) బిడ్‌ను దాఖలు చేసింది. ఈవోఐకు సోమవారం సాయంత్రం 5 గంటల వరకు గడువు నిర్దేశించిన నేపథ్యంలో చివరి రోజున టాటా సన్స్‌ ఈవోఐను దాఖలు చేసింది. బిడ్‌ అర్హత సాధిస్తే రానున్న 15 రోజుల్లో ఫైనాన్షియల్‌ బిడ్‌ను సమర్పించే అవకాశం ఉంది.

* అమరావతి పరిరక్షణకై విజయవాడలో రేపు భారీ ర్యాలీ తలపెట్టినట్లు అమరావతి పరిరక్షణ సమితి ఐకాస కన్వీనర్‌ శివారెడ్డి తెలిపారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఆ ప్రాంతంలో జరుగుతున్న ఆందోళనలు ప్రారంభమై ఈనెల 17కి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా భవిష్యత్తు కార్యాచరణపై విజయవాడలో అమరావతి పరిరక్షణ సమితి ప్రత్యేక సమావేశం నిర్వహించింది. వివిధ రాజకీయ పార్టీల నేతలు, మహిళా సంఘాలు, ప్రజా సంఘాల ప్రతినిధులు, రైతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

* జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రాలకు కేంద్రం మరోసారి నిధులు విడుదల చేసింది. ఏడో విడతగా అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.6 వేల కోట్ల రుణాలు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. ఇందులో 23 రాష్ట్రాలకు 5,516.60 కోట్లు.. కేంద్ర పాలిత ప్రాంతాలైన దిల్లీ, జమ్మూకశ్మీర్‌, పుదుచ్చేరికి రూ.483.40 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఇప్పటివరకు విడుదల చేసిన రుణాల్లో ఆంధ్రప్రదేశ్‌కు రూ.1055.79 కోట్లు, తెలంగాణకు రూ.559.02 కోట్లు కేంద్రం విడుదల చేసింది.

* వికెట్‌కీపర్‌ రిషభ్‌ పంత్‌ టీమిండియాకు ఒకప్పుడు ఆశాకిరణంలా కనిపించాడు. కానీ క్రమేణా వచ్చిన అవకాశాలు వృథా చేస్తూ పరిమిత ఓవర్ల క్రికెట్‌ జట్టులో చోటు కోల్పోయాడు. ఇక సుదీర్ఘ ఫార్మాట్‌లో పంత్‌ స్థానానికి సాహా గట్టిపోటీ ఇస్తుండటంతో జట్టులో అతడి స్థానం ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఆస్ట్రేలియా-ఎతో జరిగిన రెండో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో అజేయ మెరుపు శతకం (103; 73 బంతుల్లో)తో పంత్‌ అందరి దృష్టి తనవైపు తిప్పుకున్నాడు.

* ఐఐటీ మద్రాస్‌ కొవిడ్‌ ప్రజ్వలన కేంద్రం(హాట్‌స్పాట్‌)గా మారింది. గత కొన్ని రోజుల్లో ఏకంగా 71 మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. వీరిలో 66 మంది విద్యార్థులు కాగా.. ఐదుగురు మెస్‌ సిబ్బంది ఉన్నారు. ఒక్క ఆదివారం రోజే 32 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రాంగణంలోని అన్ని విభాగాల్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు తరగతులు జరగబోవని స్పష్టం చేసింది.

* స్మార్ట్‌ఫోన్‌తో పాటు, రీఛార్జిని ఈఎంఐ కింద అందించేందుకు ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్‌ ఐడియా (వి), బజాజ్‌ ఫైనాన్స్‌ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశాయి. దీని ప్రకారం స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుదారులు ఫోన్‌తో పాటు 6 నెలలు లేదా ఏడాది గడువు కలిగిన రీఛార్జి ప్లాన్‌ మొత్తాన్ని సైతం ఈఎంఐ కింద చెల్లించే వీలు కలుగుతుంది.