DailyDose

కౌలురైతు ఆత్మహత్య-నేరవార్తలు

Crime News - Koulu Farmer Commits Suicide In Andhra

* అన్నదాతలకు భరోసా ఇవ్వకపోగా రైతులను కించపరుస్తూ మంత్రులు మాట్లాడటం బాధ్యతారాహిత్యమని నారా లోకేశ్‌ మండిపడ్డారు.కృష్ణాజిల్లా అవనిగడ్డ మండలం మోదుముడి గ్రామానికి చెందిన కౌలు రైతు ఓలేటి ఆదిశేషు అప్పుల భారంతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బాధాకరమన్నారు.తాడేపల్లి ప్యాలస్​లో ఫిడేలు వాయించుకుంటున్న జగన్ రెడ్డి బయటకు వచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు ప్రభుత్వం సాయం అందించాలన్నారు.ఖరీఫ్ సీజన్​లో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని లోకేశ్‌ అన్నారు.

* కర్ణాటక శాసన మండలిలో తీవ్ర కలకలం.. ఛైర్మన్‌ను కుర్చీలోంచి లాగేసి తీసుకెళ్లిన కాంగ్రెస్ సభ్యులు..శాసన మండలిలో సభ్యులు బాహాబాహీ.ఏం జరుగుతోందో కూడా అర్థం కాని పరిస్థితి.బీజేపీ, జేడీఎస్‌ కలిసి ఒకరిని ఛైర్మన్ స్థానంలో అక్రమంగా కూర్చోబెట్టారన్న కాంగ్రెస్ సభ్యులు.ఛైర్మన్ తప్పుకోవాలంటోన్న కాంగ్రెస్ సభ్యులు.

* ఒంగోలు గాంధీ పార్కు వద్ద థామస్ అనే యువకుడిని పట్టపగలే దంపతులు హత్య చేశారు. యువకుడిని చంపిన అనంతరం నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఒంగోలులోని ఓ వస్ర్తదుకాణంలో థామస్‌ పనిచేస్తున్నట్టు గుర్తించారు. హత్యకు సంబంధించిన సమాచారంతో ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని ఒంగోలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.

* నగరంలోని చాదర్‌ఘాట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. మలక్‌పేటలోని డీమార్ట్‌ నుంచి బయటకు వస్తూ రివర్స్‌ తీసుకునే క్రమంలో కారు సమీపంలోని టీ దుకాణంలోకి దూసుకెళ్లింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాపురాజు అనే వ్యక్తి మలక్‌పేట డీమార్ట్‌లో సరకులు కొనుగోలు చేసేందుకు తన కారులో వచ్చాడు. షాపింగ్‌ ముగిసిన అనంతరం పార్కింగ్‌ నుంచి రివర్స్‌ తీసుకునే క్రమంలో కారు ఒక్కసారిగా పక్కనే ఉన్న టీ దుకాణంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అక్కడే ఉన్న సెక్యూరిటీ ఇంఛార్జ్‌కి గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

* జపాన్‌లో సంచలనం సృష్టించిన కేసులో నిందితుడైన ‘ట్విటర్‌ కిల్లర్‌’కు టోక్యో జిల్లా కోర్టు నేడు మరణశిక్ష విధించింది. తొమ్మిదిమందిని క్రూరంగా హత్య చేసి శరీర భాగాలను వేరుచేసినందుకు టకాహిరో షిరైషీ అనే 30 ఏళ్ల వ్యక్తిని దోషిగా నిర్ధారించారు. ఇతని చేతిలో ప్రాణాలు కోల్పోయిన తొమ్మిది మందిలో ఎనిమిది మంది మహిళలే. వీరందరూ 15 నుండి 26 మధ్య వయస్కులని తెలిసింది. కాగా, వరుస హత్యల నిందితుడు టకాహిరో తన నేరాన్ని అంగీకరించడం గమనార్హం.

* కర్నూలు- చిత్తూరు జాతీయ రహాదారిపై ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు మృతి చెందగా, మరో 8మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనేందుకు శిరివెళ్ల మండలంలోని ఎర్రగుంట్ల వద్ద జాతీయ రహదారిపై 40మంది నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఐషర్‌ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఝాన్సీ (15) అక్కడికక్కడే మృతి చెందగా, సుస్మిత (15), వంశీ (10), హర్షవర్దన్‌ (10) నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందారు.
ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ ఘటన తర్వాత వాహనం ఆపకుండా తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. స్థానికులు వెంబడించి ఆళ్లగడ్డ సమీపంలోని బత్తులూరు వద్ద అతన్ని పట్టుకున్నారు. క్షతగాత్రులను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చిన్నారుల మృతి చెందడంతో తల్లిదండ్రులు ఆర్తనాదాలతో నంద్యాల ప్రభుత్వాసుపత్రి దద్దరిల్లింది. ప్రమాద ఘటనతో ఎర్రగుంట్ల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.

* అల్పాహారం కోసం వెళ్లిన బాలుడు కంటెయినర్‌ కింద పడి దుర్మరణం పాలైన ఘటన మేడ్చల్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. సీఐ ప్రవీణ్‌రెడ్డి వివరాల ప్రకారం.. అత్వెల్లికి చెందిన దుండిగల్ల రవీందర్‌ మొదటి భార్య కుమారుడు నర్సింహ్మ(14) సెయింట్‌ క్లారెట్‌ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. సోమవారం ఉదయం అల్పాహారం తీసుకొచ్చేందుకు వరుసకు బావ అయిన శ్రవన్‌కుమార్‌ ద్విచక్రవాహనం తీసుకొన్నాడు. తన స్నేహితుడు కైరబాల కృష్ణను ఎక్కించుకొని మేడ్చల్‌కు వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగొస్తుండగా జాతీయరహదారి 44పై ఐటిఐ సమీపంలో మలుపు వద్ద బైక్‌ అదుపుతప్పడంతో వారు కింద పడిపోయారు. వెనకాలే వస్తోన్న కంటెయినర్‌ లారీ నర్సింహ్మ తలపై నుంచి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. కృష్ణ తీవ్రంగా గాయపడ్డాడు. బాలుడికి వాహనాన్ని ఇచ్చిన వ్యక్తిపైనా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.