Food

రంగు రంగుల తేనె

రంగు రంగుల తేనె

మనిషికి ప్రకృతి ప్రసాదించిన అమృతతుల్యమైన ఆహారం, అంతకుమించిన ఔషధమే తేనె. ఆ పూల మకరందం ఇప్పుడు పండ్ల ఫ్లేవర్లూ జోడించుకుని రంగురంగుల్లో మరిన్ని మధురమైన రుచుల్లో వస్తోంది. తియ్యని జెల్లీలా సులభంగా చప్పరించే స్టిక్స్‌ రూపంలోనూ దొరుకుతూ పిల్లల్ని సైతం ఆకర్షిస్తోంది.తేనె అనగానే లేతపసుపు, గోధుమ, ముదురుగోధుమ, అంబరు… ఇలా కొన్ని రంగుల్లో కనిపించే చిక్కని పదార్థమే గుర్తుకొస్తుంది. కానీ సహజమైన తేనెలోనూ పసుపు, బూడిద, నలుపు, ముదురుకాఫీ, ఎరుపు, తెలుపు… ఇలా అనేక రంగులూ ఛాయలూ ఉన్నాయి; తుమ్మ, వెదురు, బక్‌వీట్‌, క్లోవర్‌, ఆరెంజ్‌బ్లోజమ్‌, సోర్‌వుడ్‌, వైల్డ్‌ ఫారెస్ట్‌, తులసి, యూకలిప్టస్‌… ఇలా వందలకొద్దీ రుచులూ ఉన్నాయి. పైగా ఒక్కో తేనె ఒక్కో పరిమళాన్నీ వెదజల్లుతుంటుంది- అంటే, తేనె రంగూ రుచీ వాసన అనేది తేనెటీగలు సేకరించే పూలజాతులమీదా అవి విరిసే వాతావరణంమీదా ఆధారపడి ఉంటుందన్నమాట. ఇప్పుడు కొత్తగా వాటికి కివీ, చెర్రీ, క్రాన్‌బెర్రీ, లిచి, పేషన్‌ఫ్రూట్‌, ఆపిల్‌, బ్లూబెర్రీ, పీచ్‌, పుచ్చ, మామిడి, ద్రాక్ష, స్ట్రాబెర్రీ, గ్రీన్‌టీ, నిమ్మ, పుదీనా, నారింజ… ఇలా రకరకాల పండ్ల రుచుల్నీ, హెర్బల్‌ ఫ్లేవర్లనీ జోడిస్తున్నారు. మిర్చిని జోడించి ఘాటైన తేనెనీ తయారుచేస్తున్నారు. దాంతో ఎరుపూ నీలమూ ఆకుపచ్చా నారింజా పసుపూ ఇలా ఆకర్షణీయమైన రంగుల్లో మధువు చవులూరిస్తోంది. ఇందుకోసం వైల్డ్‌ ఫ్లవర్స్‌ నుంచి సేకరించిన తేనెల్లో కొద్దిపాళ్లలో పండ్లూ ఆకుల నుంచి తీసిన పొడులను కలిపి వాటికా రంగునీ రుచినీ ఫ్లేవర్‌నీ తీసుకొస్తున్నారు.
**తేనె చాక్లెట్లు!
పంచదారకు బదులుగా టీ కాఫీలతోబాటు అన్నింటా తేనెను వాడటం ఈమధ్య పెరిగింది. మామూలుగానే బేకరీ ఉత్పత్తులూ చల్లని పానీయాల తయారీలో తేనెను ఎక్కువగా వాడతారు. ఇప్పుడు కొత్తగా ఈ ఫ్లేవర్డ్‌ హనీలను వాడటం వల్ల అవి మరింత సువాసనభరితమై చవులూరిస్తున్నాయి. ఆరోగ్యంకోసం తాగే పూల టీలల్లో నచ్చిన తేనె ఫ్లేవర్‌నీ జోడించి, ‘ఆహా ఏమి రుచి’ అనే మధుప్రియుల సంఖ్యా పెరుగుతోంది.
తేనె శక్తిమంతమైన ఆహారం. ఆ కారణంతోనే ఆహారంలో భాగంగా పిల్లలకీ తేనె తినిపిస్తుంటారు. అందుకే వాళ్లకోసం ఓ చాక్లెట్‌లా చప్పరించేలా ఫ్లేవర్డ్‌ హనీ స్టిక్స్‌ రూపంలోనూ తేనె దొరుకుతోంది. ఒక్కో స్టిక్‌లో సుమారుగా 20 క్యాలరీలను అందించే టీస్పూను తేనె మాత్రమే ఉంటుంది. పైగా ఊళ్లకు వెళ్లేటప్పుడూ స్కూలుకీ ఆఫీసులకీ వెళ్లేటప్పుడూ ఇన్‌స్టంట్‌ శక్తికోసం వీటిని సులభంగా తీసుకెళ్లవచ్చు. ఈ స్టిక్‌లోని తేనెను నీళ్లలో కలుపుకుంటే పండ్ల రుచితో కూడిన తియ్యని పానీయం నిమిషంలో తయార్‌. బ్రెడ్డుమీద జామ్‌లానూ వాడుకోవచ్చు. పాలూ పెరుగూ ఐస్‌క్రీమూ పాయసమూ పానకమూ ఎందులోనైనా తేనెను కలుపుకుంటే ఆ రుచే వేరు.
**ఔషధ మధువు!
రంగూ రుచీ వాసన ఎలా ఉన్నా తేనె ఏదయినా సర్వరోగనివారిణి. వాడుకునే విధానం తెలియాలేగానీ తేనెని మించిన ఔషధమే లేదట. ప్లేటో, అరిస్టాటిల్‌… వంటి తత్త్వవేత్తలంతా తేనె ప్రాశస్త్యాన్ని మరీ మరీ ప్రస్తావించారు. ఆయుర్వేదానికి తేనె ప్రాణంలాంటిదనీ ఏ మందునైనా తేనెతో కలిపి ఇస్తే ఫలితం త్వరగా కనిపిస్తుందనీ అంటారు. దగ్గు మందులకోసం సిరప్‌లు తాగేబదులు కాస్త తేనెలో నిమ్మరసం పిండుకుని తాగితే ఉపశమనం లభిస్తుందనీ, జీర్ణ సమస్యలన్నింటికీ తేనెని మించింది లేదనే బామ్మల మాటనే ఈతరం వైద్యులూ చెబుతున్నారు. ఇది జీవక్రియాలోపాలను సరిచేయడంతోబాటు అల్సర్లనీ తగ్గిస్తుంది. రక్తంలోని హోమోసిస్టయిన్‌ అనే కొలెస్ట్రాల్‌నీ ట్రైగిజరైడ్‌ల పరిమాణాన్నీ తగ్గించడం ద్వారా హృద్రోగాల నుంచీ రక్షిస్తుంది. క్యాన్సర్లనీ అడ్డుకుంటుంది. రోజూ పడుకునేముందు రెండు స్పూన్ల తేనె తాగితే హాయిగా నిద్రపడుతుంది. బీపీ రోగులకీ మధువు మేలు చేస్తుంది. గోరువెచ్చని నీళ్లలో కాస్త నిమ్మరసం, తేనె కలుపుకుని పరగడుపున తాగితే ఊబకాయాన్నీ తగ్గించుకోవచ్చు. మధుమేహులకి సైతం తేనె మంచిదే. ఇది రక్తప్రవాహంలో మెల్లమెల్లగా కలుస్తూ గ్లూకోజ్‌ నిల్వలు పేరుకోకుండా చేస్తుంది. తేనె యాంటీమైక్రోబియల్‌, యాంటీబ్యాక్టీరియల్‌, యాంటీసెప్టిక్‌గానూ పనిచేస్తుంది. గొంతులో ఇన్ఫెక్షన్‌ బాగా ఉంటే రెండుస్పూన్ల తేనెలో నాలుగుస్పూన్ల నిమ్మరసం, చిటికెడు ఉప్పు కలిపి పుక్కిలిస్తే త్వరగా తగ్గుతుంది. లేదూ గోరువెచ్చని నీళ్లలో తేనె వేసుకుని తాగినా మంచిదే. కాలిన గాయాలకీ క్యాన్సర్‌ పుండ్లకీ తేనె రాస్తే త్వరగా నయమవుతాయి. వాపుల్నీ మచ్చల్నీ కూడా తగ్గిస్తుంది. మశూచికం మచ్చలకీ తేనెని వాడేవారట చైనీయులు.
**ఏముంది తేనెలో?
కూలీ తేనెటీగలు పువ్వుపువ్వుకీ తిరిగి మకరందాన్ని గ్రోలి తేనెతుట్టె దగ్గరకు తీసుకువచ్చే క్రమంలో పూలల్లోని పుప్పొడితోబాటు తేనెటీగల లాలాజలంలోని కొన్ని ఎంజైములూ ప్రొటీన్లు కూడా అందులో కలుస్తాయి. ఆ మకరందంతో తుట్టెని నింపే ప్రక్రియలో అవి పైకీ కిందకీ రెక్కలల్లారుస్తూ ఎగరడంవల్ల మకరందంలోని నీరంతా ఆవిరై చక్కెర గాఢత పెరిగి తేనె మాత్రమే మిగులుతుంది. పంచదార కన్నా తేనె రెండు రెట్లు ఎక్కువ తియ్యగా ఉండటానికి కారణమిదే. నీటి శాతం తక్కువగా ఉండటం వల్లే తేనె పులవకుండా పాడవకుండా ఎంతకాలమైనా నిల్వ ఉంటుంది.
ప్రతీ తేనెబొట్టులో 200 రకాల పోషకాలు ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా తేనెలో కలిసిన పుప్పొడిలో ఆరోగ్యానికి తోడ్పడే విటమిన్లూ అమైనోఆమ్లాలూ ఫ్లేవనాయిడ్లూ ఎంజైములూ గుడ్డులో కన్నా ఎక్కువ ఉంటాయని తేలిందట. ప్రాసెస్‌ చేయని జుంటి తేనెలో వీటి శాతం మరీ ఎక్కువ. అమెరికాలో తయారయ్యే బక్‌వీట్‌ తేనె చూడ్డానికి నల్లగా ఉంటుంది కానీ అందులో ఐరన్‌, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.స్థానికంగా తయారయ్యే తేనె తాగితే అలర్జీలకి దూరంగా ఉండొచ్చట. అదెలా అంటే- సాధారణంగా అలర్జీలన్నీ పుప్పొడివల్లే వస్తాయి. తేనెటీగలు చుట్టుపక్కలుండే పువ్వుల నుంచే పుప్పొడితో కూడిన మకరందాన్ని సేకరించడం వల్ల ఆ పుప్పొడి శరీరంలో చేరుతుంది. తద్వారా రోగనిరోధకశక్తి పెరుగుతుంది. నిత్యం తేనె తీసుకునేవాళ్లలో తెల్లరక్తకణాల సంఖ్య పెరిగినట్లు ఎన్నో పరిశోధనల్లోనూ తేలింది.250 రకాల బ్యాక్టీరియాను నాశనం చేసే ఆర్గానిక్‌ ఆమ్లాలూ ఎంజైములూ కలిగిన దివ్యౌషధమే తేనె.తేనెని మించిన కాస్మొటిక్‌ క్రీమూ లోషనూ కూడా లేవు. జుట్టునీ ఒంటినీ కాంతిమంతంగా మెరిసేలా చేస్తుంది. తేనె సహజమైన లిప్‌బామ్‌. పెదవులు పగిలిపోకుండా సంరక్షిస్తుంది. అయితే అమృతంలాంటి మధువులో రవ్వంత విషమూ ఉంటుంది. అందులో సహజంగా ఉండే బ్యాక్టీరియా బాట్యులిన్‌ అనే టాక్సిన్‌ను విడుదల చేస్తుంది. ఇది క్యాన్సర్‌, మల్టిపుల్‌ స్ల్కెరోసిస్‌కు మంచి మందు. అదేసమయంలో ఈ విషం ఏడాదిలోపు పసిపిల్లలకు అత్యంత హానికరం.మొక్కల్లో పరపరాగసంపర్కానికి తోడ్పడుతూ అటు పర్యావరణం, ఇటు మానవాళి మనుగడకోసం కృషిచేస్తోన్న ఆ తేనెటీగలు భూమ్మీద అంతరించిపోయిన నాలుగేళ్లకే మానవజాతి అంతరించిపోతుంది అన్నాడు ఐన్‌స్టీన్‌. అంటే తేనెటీగలూ అవి సేకరించే తేనె ఎంత గొప్పవో తెలియడం లేదూ. ప్రపంచవ్యాప్తంగా అందరూ తినే ఆహారమేదయినా ఉందీ అంటే అది తేనె ఒక్కటే. అలాంటి తేనె ఇప్పుడు ఆరోగ్యకరమైన పండ్ల రుచుల్నీ సంతరించుకుంది. ఇంకా ఆలోచన ఎందుకు? మీకిష్టమైన ఫ్లేవర్‌లో తేనెని హాయిగా ఆస్వాదించండి. ఆరోగ్యంగా జీవించండి.