‘అధికార వికేంద్రీకరణ, ఏపీ రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో భాగంగా రాజధాని కార్యకలాపాలను వికేంద్రీకరించేలా ప్రణాళిక వేసుకున్నాం. విశాఖపట్నం, అమరావతి, కర్నూలులను పరిపాలన, శాసన, న్యాయ రాజధానులుగా చేస్తూ ఆగస్టులో చట్టం చేశాం. హైకోర్టును కర్నూలుకు తరలించే ప్రక్రియను ఆరంభించాలి. ఇందుకు నోటిఫికేషన్ జారీ చేయాలి’ అని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు. 2019 భాజపా ఎన్నికల మేనిఫెస్టోలోనూ కర్నూలులో హైకోర్టు ఏర్పాటు అంశం ఉందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మంగళవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో అమరావతి నుంచి దిల్లీ చేరుకున్న జగన్.. రాత్రి 8.34 నుంచి 9.40 వరకు అమిత్ షాతో దాదాపు గంటపాటు సమావేశమయ్యారు. అక్టోబర్ 5, 6 తేదీల్లో దిల్లీ వచ్చిన సీఎం జగన్.. హోం మంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఆ తర్వాతే ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల శైలిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బోబ్డేకు లేఖరాశారు. జగన్ మళ్లీ దిల్లీకి రావడం ఇదే ప్రథమం. తాజా భేటీ ముగిశాక హోంమంత్రితో జరిగిన చర్చల వివరాలను వెల్లడిస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. కేంద్రం నుంచి వివిధ రూపాల్లో రాష్ట్రానికి రూ.14,555.07 కోట్ల బకాయిలు రావాల్సి ఉన్నట్లు వినతిపత్రంలో సీఎం ప్రస్తావించారు.
ముఖ్యమంత్రి చేసిన వినతులు ఇవే
* రెండో సవరించిన అంచనాల ప్రకారం 2017-18 నాటి ధరల ఆధారంగా పోలవరం ప్రాజెక్టు వ్యయాన్ని రూ.55,656 కోట్లకు ఆమోదించాలి. ఈ మేరకు కేంద్ర జల్‌శక్తి, ఆర్థిక శాఖలకు ఆదేశాలివ్వాలి. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణ, పునరావాసానికయ్యే ఖర్చులను కేంద్రం పూర్తిగా రీఎంబర్స్ చేయాలి. 2005-06తో పోలిస్తే 2017-18 నాటికి ప్రాజెక్టు ముంపు ప్రాంతం నుంచి తరలించాల్సిన కుటుంబాల సంఖ్య 44,574 నుంచి 1,06,006కు పెరిగింది. మునిగిపోయే ఇళ్ల సంఖ్యా పెరిగింది. వెరసి సహాయ, పునరావాస ఖర్చు అధికమైంది. ఈప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులో ఇంకా రూ.1,779 కోట్లను కేంద్రం చెల్లించాల్సి ఉంది. ఏపీకి ప్రాణాధారమైన పోలవరం ప్రాజెక్టు ఫలాలు వీలైనంత త్వరగా ప్రజలకు అందించాల్సి ఉంది. సత్వరం పూర్తిచేయడానికి సహకరించాలి.
* ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలి. దాని ద్వారానే రాష్ట్రం స్వయం సమృద్ధి సాధ్యమవుతుంది.
* కొవిడ్ మహమ్మారి దృష్ట్యా అదనపు రుణాలు తెచ్చుకొనేందుకు కేంద్రం రాష్ట్రాలకు అనుమతి ఇచ్చింది. ఇందుకు నిర్దేశించిన మార్గదర్శకాల అమలులో భాగంగా కేంద్ర విద్యుత్తు శాఖ ధ్రువీకరణపత్రం ఇవ్వాల్సి ఉంది. ఈ ప్రక్రియ వెంటనే పూర్తిచేసేలా విద్యుత్తు శాఖకు తగిన ఆదేశాలివ్వాలి.
* 2013-14 నుంచి 2018-19 వరకు కేంద్ర ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా చేపట్టిన బియ్యం పంపిణీకి కేంద్రం నుంచి రాయితీ రూపంలో రావాల్సిన రూ.1,600 కోట్లను వెంటనే విడుదల చేయాలి.
* ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు రావాల్సిన జీఎస్‌టీ బకాయిలు రూ.4,308.46 కోట్లు చెల్లించాలి.
* స్థానిక సంస్థలకు 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రూ.1,111.53 కోట్లు, 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రూ.1,954.5 కోట్ల గ్రాంట్లు విడుదలయ్యేలా చూడాలి.
* ఉపాధి హామీ పథకం బకాయిలు రూ.3,801.98 కోట్లు మంజూరు చేయాలి.
* రాష్ట్రంలో నెలకొల్పనున్న 16 వైద్య కళాశాలలకు తక్షణం అనుమతులు ఇవ్వాలి.
* మహిళలు, చిన్నారులపై నేరాలు తగ్గించడానికి తీసుకొచ్చిన దిశ, ప్రత్యేక కోర్టుల ఏర్పాటు బిల్లులను కేంద్రం ఆమోదించేలా చూడాలి.
* రాష్ట్రంలో డిసెంబర్ 21 నుంచి సమగ్ర భూసర్వే ప్రారంభించనున్నందున అందుకోసం ఉద్దేశించిన ఏపీ ల్యాండ్ టైట్లింగ్ అథారిటీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర పొందేలా ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలి.
* రాష్ట్రంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు చొరవ తీసుకోవాలి.
* ఇటీవలి వర్షాలు, నివర్ తుపాను వల్ల భారీగా పంట నష్టం జరిగింది. ఆగస్టు, సెప్టెంబర్‌లో కురిసిన వర్షాల నష్టాన్ని అంచనా వేసేందుకు ఇప్పటికే కేంద్ర బృందం పరిశీలించింది. నివర్ తుపాను అంచనాకూ కేంద్ర బృందాన్ని పంపాలి. ఆ బృందాల సిఫార్సుల మేరకు పరిహారాన్ని మంజూరు చేయాలి.
* కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే ప్రాధాన్య క్రమంలో పంపిణీ చేసేందుకు కేంద్ర మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉంది. వ్యాక్సిన్ సరఫరాలో అత్యంత కీలకమైన కోల్డ్ చైన్ల ఏర్పాటు, నిర్వహణకు సంసిద్ధంగా ఉన్నాం.