WorldWonders

జపాన్ సీరియల్ కిల్లర్‌కు మరణ్శిక్ష

Twitter Killer In Japan Ordered To Be Hanged

జపాన్‌లో సంచలనం సృష్టించిన కేసులో నిందితుడైన ‘ట్విటర్‌ కిల్లర్‌’కు టోక్యో జిల్లా కోర్టు నేడు మరణశిక్ష విధించింది. తొమ్మిదిమందిని క్రూరంగా హత్య చేసి శరీర భాగాలను వేరుచేసినందుకు టకాహిరో షిరైషీ అనే 30 ఏళ్ల వ్యక్తిని దోషిగా నిర్ధారించారు. ఇతని చేతిలో ప్రాణాలు కోల్పోయిన తొమ్మిది మందిలో ఎనిమిది మంది మహిళలే. వీరందరూ 15 నుండి 26 మధ్య వయస్కులని తెలిసింది. కాగా, వరుస హత్యల నిందితుడు టకాహిరో తన నేరాన్ని అంగీకరించడం గమనార్హం.

ఈ వరుస హత్యలు 2017 ఆగస్టు, అక్టోబర్‌ మధ్యలో చోటుచేసుకోగా.. అదే సంవత్సరం హాలోవీన్‌ పండుగ సమయంలో వెలుగుచూసాయి. అక్టోబర్‌, 2017లో కనిపించకుండా పోయిన ఓ 23 ఏళ్ల యువతి గురించి పోలీసులు అన్వేషణ చేపట్టారు. ఈ క్రమంలో టోక్యో సమీపంలోని జామా పట్టణంలో ఉన్న టకాహిరో ఫ్లాట్‌లో సోదా చేపట్టిన పోలీసులకు ఘోర దృశ్యాలు ఎదురయ్యాయి. అక్కడ ఉన్న పలు కూలర్లు, టూల్‌ బాక్స్‌లలో తొమ్మిది మనుషుల తలలు, ముక్కలు ముక్కలుగా ఉన్న వివిధ శరీర భాగాలను కనుగొన్నారు.

టకాహిరో షిరైషీ ట్విటర్‌ ఆధారంగా బాధితులను ఎంపిక చేసుకునేవాడు. జీవితం పట్ల నిరాశ, నిస్పృహ వ్యక్తం చేసేలా ఉన్న పోస్టులను గుర్తించి.. సంబంధిత యూజర్లను సంప్రదించేవాడు. వారు సరైన నిర్ణయం తీసుకునేందుకు తాను సహకరిస్తానంటూ పరిచయం పెంచుకునేవాడు. వారితో కలసి చనిపోయేందుకు తాను సిద్ధమంటూ తన ఇంటికి ఆహ్వానించేవాడు. అనంతరం వారిని గొంతునులిమి చంపి.. మరణించిన అనంతరం శరీరాన్ని ముక్కలుగా చేసేవాడు. చంపే ముందు మహిళలను లైంగికంగా హింసించినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి.

తొమ్మిది హత్యలకు పాల్పడిన ఈ సీరియల్‌ కిల్లర్‌కు మరణ శిక్ష విధించాలని ప్రభుత్వం తరపు న్యాయవాదులు వాదించారు. కాగా, మృతులు ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశాన్ని సామాజిక మాధ్యమాల్లో వెలువరించారని.. చనిపోవటం వారికి సమ్మతమే కాబట్టి తమ క్లయింటు శిక్షను తగ్గించి జైలు శిక్షగా మార్చాల్సిందిగా వాదించారు. బాధితుల అనుమతి లేకుండానే తను వారిని చంపినట్టు టకాహిరో షిరైషీ అంగీకరించాడు. తనకు మరణ శిక్ష విధించినా పై కోర్టుకు అప్పీలు చేసుకోనని అతను ప్రకటించాడు.