అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ కరోనా వైరస్ నిబంధనలను అతిక్రమించారనే వార్తలు వెలువడుతున్నాయి. ఓ ఆంగ్లపత్రిక కథనం ప్రకారం ఇక్కడి చిల్డ్రన్స్ నేషనల్ హాస్పిటల్‌ను సందర్శించిన మెలానియా.. చిన్నారులకు కథలను చదివి వినిపించే క్రమంలో మాస్కును తొలగించారు. కాగా, కరోనా వైరస్ అమెరికాలో విలయం సృష్టిస్తున్నా.. మాస్క్ ధరించేందుకు ఇష్టపడని అధ్యక్షుడు ట్రంప్ వైఖరి ఇప్పటికే విమర్శలకు గురైన విషయం తెలిసిందే. ఆస్పత్రి ప్రధాన సమావేశ మందిరంలోకి ప్రవేశించేప్పుడు మాస్కును ధరించే ఉన్న మెలానియా.. తన సీటులో కూర్చున్న అనంతరం దానిని తీసివేశారు. అనంతరం చిన్నారులను పలకరించి, వారికి కథలు చదివి వినిపించారు. అయితే కరోనా నిబంధనల ప్రకారం చిల్డ్రన్స్ నేషనల్ ఆస్పత్రి పరిసరాల్లో ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ మాస్కులు ధరించే ఉండాలి. ఆస్పత్రి ప్రాంగణంలో ఉండే వరండాలు, పలహార శాలలతో సహా ఎక్కడైనా ఇది తప్పనిసరి అని అధికారులు తెలిపారు. ఇతరులెవరూ లేనప్పుడు తప్ప, ఆస్పత్రికి సంబంధించిన బహిరంగ ప్రదేశాల్లో కూడా మాస్కులు ధరించాలని నిబంధనలు సూచిస్తున్నాయి. చిన్నారుల కోసం కథను చదివి వినిపించేందుకే ప్రథమ మహిళ మాస్కును తొలగించారని.. ఆ సమయంలో ప్రతి ఒక్కరు ఆమెకు 12 అడుగులకుపైగా దూరంలో ఉన్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అక్కడున్న మిగిలిన వారందరూ కూడా మాస్కు ధరించే ఉన్నారు. అంతేకాకుండా పర్యటనలో మిగిలిన సమయమంతా ఆమె మాస్కును ధరించే ఉన్నారని వారు వెల్లడించారు.
మెలానియా మాస్క్ గోల!
Related tags :