వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు ఆధార్ వివరాలు అడగబోమంటూ ప్రభుత్వం మౌఖికంగా ఇచ్చిన హామీకి విరుద్ధంగా ఆధార్ వివరాలను సేకరిస్తుండటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం కోర్టుకు ఇచ్చిన హామీకి విరుద్ధంగా వ్యవహరిస్తోందని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో గతంలో మౌఖికంగా ప్రభుత్వం ఇచ్చిన హామీని ఈసారి సీఎస్ రాతపూర్వకంగా తెలియజేయాలని ఆదేశిస్తూ విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఎటువంటి చట్టం లేకుండా ధరణి వెబ్‌పోర్టల్‌లో ఆస్తుల న మోదుకు కులం, ఆధార్ వివరాలు సమ ర్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ న్యాయవాదులు గోపాల్‌శర్మ, సాకేత్‌లు వేర్వురుగా దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌లో పొరపాట్లు జరగకుండా ఉండేందుకు కేబినెట్ సబ్ కమిటీ వేశామని ఏజీ బీఎస్ ప్రసాద్ నివేదించారు. సబ్ కమిటీ అన్ని అంశాలపై సమీక్ష చేస్తోందని తెలిపారు. దీంతో సమీక్ష అయిన తర్వాతే ఈ పిటిషన్లను వింటామని ధర్మాసనం పేర్కొంది. అయితే ఆస్తుల నమోదుకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై కౌంటర్ అఫిడవిట్ల దాఖలుకు గడువు ఇవ్వాలని ఏజీ కోరారు. ఆధార్, కులం వివరాలు అడగరాదని ధర్మాసనం ఆదేశించినా ఇప్పటికీ ఆ వివరాలను ఇవ్వాలని ఉంచారని పిటిషనర్ తరఫు న్యాయవాది వివేక్‌రెడ్డి వెల్లడించారు. అలాగే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు స్లాట్ బుక్ చేసుకునే సమయంలో ఆధార్ వివరాలు కోరుతున్నారని పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ప్రకాశ్‌రెడ్డి తెలిపారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియపై హైకోర్టు ఆగ్రహం
Related tags :