డ్రాగన్ ఏం చేసినా దాని వెనుక ఏదో ఒక కుట్ర దాగే ఉంటుంది. ఆర్థికంగా బలంగా ఉన్న చైనా.. డబ్బులు, ప్రాజెక్టులు ఎర వేసి ఇండియా చుట్టుపక్కల దేశాలను ఎలా తన నియంత్రణలోకి తీసుకుంటోందో మనం చూశాం. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి ప్రధాన కారణమైన అదే చైనా.. వ్యాక్సిన్ దౌత్యానికి తెరతీసింది. సుమారు వంద దేశాలకు వ్యాక్సిన్ ఎర వేసి వాటిపై పట్టు కోసం ప్రయత్నిస్తుండటం పలువురు విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యే టర్కీ కూడా చైనా వ్యాక్సిన్‌కు ఆర్డర్ ఇచ్చిందని, ఇలా ఇప్పటికే వందకు పైగా దేశాలు ఆర్డర్లు ఇచ్చాయని అక్కడి మీడియా చెప్పుకుంటోంది. సాధారణంగా వ్యాక్సిన్ తయారీదారు మూడు దశల్లో క్లినికల్ ట్రయల్స్ జరిపి.. తమ వ్యాక్సిన్ సామర్థ్యం, భద్రత గురించి వెల్లడిస్తాయి. కానీ చైనా ప్రభుత్వానికి చెందిన చైనా నేషనల్ ఫార్మాసూటికల్ గ్రూప్ (సినోఫార్మ్) మాత్రం ఇప్పటి వరకూ తమ వ్యాక్సిన్ సామర్థ్యం గురించి ఎలాంటి డేటా విడుదల చేయలేదు. కానీ గత జులైలోనే వివాదాస్పద రీతిలో అత్యవసర వ్యాక్సిన్ వినియోగాన్ని ప్రారంభించింది. వచ్చే నాలుగు నెలల్లో పది లక్షల మంది తమ వ్యాక్సిన్‌ను తీసుకోనున్నట్లు సినో ఫార్మ్ చెబుతోంది. అయితే ఇప్పటి వరకూ ఈ వ్యాక్సిన్ భద్రతపైగానీ, సామర్థ్యంపైగానీ చైనా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయితే ఆశ్చర్యకరంగా ఈ వ్యాక్సిన్ సామర్థ్యంపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) సమాచారం అందించింది. తమ మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో సినోఫార్మ్ వ్యాక్సిన్ 86 శాతం సమర్థవంతంగా పని చేసిందని ఈ నెల 9న యూఏఈ ప్రకటించింది. సంస్థ నుంచే ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం లేకపోగా.. యూఏఈ ఈ వ్యాక్సిన్ సామర్థ్యంపై ప్రకటన ఇవ్వడం అనుమానాలకు తావిస్తోంది. యూఏఈ ఈ ప్రకటన చేయగానే బహ్రెయిన్ కూడా అదే పని చేసింది. ఈ సినోఫార్మ్ వ్యాక్సిన్ త్వరలోనే ఈజిప్ట్‌లోనూ ల్యాండవనుంది. ఆలోపు చైనా కంపెనీ సినోవాక్ బయోటెక్ ప్రయోగాత్మక వ్యాక్సిన్‌ను ఇండోనేషియాకు 12 లక్షల డోసులు పంపించేందుకు చైనా ప్లాన్ చేసింది. జనవరిలో మరో 18 లక్షల డోసులను కూడా పంపనుంది. చైనా చేస్తున్న ఈ వ్యాక్సిన్ దౌత్యం అభివృద్ధి చెందుతున్న ఈ దేశాలపై పట్టు కోసమే అని విశ్లేషకులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా చైనా పలుకుబడిని పెంచుకోవడానికి ఈ వ్యాక్సిన్‌ను ఓ అవకాశంగా జీ జిన్‌పింగ్ మలుచుకుంటున్నారని వాళ్లు అంటున్నారు. అంతేకాకుండా ఎలాంటి షరతులు పెట్టకుండా చైనా ఇలా తమ వ్యాక్సిన్‌లను పంపిణీ చేయదని, దీని వెనుక బలమైన కారణమే ఉన్నదని స్పష్టం చేస్తున్నారు. దక్షిణాసియా ప్రాంతంలో తమ పట్టు పెంచుకోవడానికి, సున్నితమైన దక్షిణ చైనా సముద్రం వంటి అంశాలలో మద్దతు కూడగట్టుకోవడానికి చైనా ఈ ప్రయత్నం చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఇక మధ్య, స్వల్ప ఆదాయ దేశాల్లో ఉన్న వ్యాక్సిన్ డిమాండ్‌లో కనీసం 15 శాతం అందుకున్నా.. చైనాకు ఆర్థికంగా ఎంతో మేలు చేయనుందన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి.
టీకా పరీక్షా ఫలితాలు లేవు. అయినా అమ్మకానికి పెడుతున్న చైనా.
Related tags :