* దేశ వ్యాప్తంగా ఆహార ప్రియులు ఇష్టపడే పదార్థాల్లో బిర్యానీ తొలివరసలో ఉంటుంది. భారతీయ ఆహార రంగంలో భారీ డిమాండ్ దీని సొంతం. ఈ నేపథ్యంలో బిర్యానీ ప్రియులను మెప్పించేందుకు ప్రముఖ అంతర్జాతీయ ఆహార సంస్థ డోమినోస్ పిజ్జా సిద్ధమౌతోంది. ‘ఏక్‌దమ్!’ అనే పేరుతో తాము బిర్యానీ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నట్టు ‘జుబ్లెంట్ ఫుడ్ వర్క్స్ లిమిటెడ్’ ఓ ప్రకటనలో వెల్లడించింది. తమ బిర్యానీ తొలుత గురుగ్రామ్‌లోని మూడు రెస్టారెంట్లలో లభిస్తుందని.. అనంతరం దిల్లీ తదితర ముఖ్య పట్టణాల్లో కూడా అందచేస్తామని ఈ సంస్థ వెల్లడించింది. తమ సేవలు యాప్, వెబ్‌సైట్లలో కూడా అందుబాటులో ఉంటాయని జేఎఫ్‌ఎల్ తెలిపింది.
* వచ్చే ఐదేళ్లలో మరో ఐదు లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు మహీంద్రా గ్రూప్ సిద్దమవుతోందని వారు గురువారం ప్రకటించారు. గత పదిహేనేళ్లలో ‘మహీంద్రా ప్రైడ్ స్కూల్స్’(ఎమ్‌పీఎస్), తరగతులతో ఇప్పటికే ఐదు లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణతో పాటు లక్ష మందికి ఉద్యోగాలు కల్పించామని వారు ఒక ప్రకటనలో తెలిపారు. సమాజంలోని బలహీన వర్గాల్లోని ప్రతిభావంతులను వెలికితీసే లక్ష్యంతో మహీంద్రా ప్రైడ్ స్కూల్స్ ప్రారంభించారు. ‘‘గతంలో ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను.’’ అని మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సీఎస్‌ఆర్)లో భాగంగా ఎనిమిదేళ్ల క్రితం 2005లో మహీంద్రా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎమ్‌పీఎస్ కేంద్రాలు చెన్నై, పూణె, చండీగఢ్, హైదరాబాద్, శ్రీనగర్, పాట్నా , వారణాసిల్లో ఉన్నాయి. వారు విడుదల చేసిన ప్రకటలోని వివరాల ప్రకారం.. కరోనా వల్ల ఏర్పడిన సంక్షోభాన్ని అధిగమించేందుకు మహీంద్రా గ్రూప్ నాంది ఫౌండేషన్ సహకారంతో కొవిడ్-19 తర్వాతి కాలానికి కావల్సిన ఉపాధి నైపుణ్యాలను అందించేందుకు కృషి చేస్తోందన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు వ్యవసాయం, ఆరోగ్యం, ఈ-కామర్స్ వంటి వాటికి శిక్షణ కార్యక్రమాలను విస్తరిస్తున్నామన్నారు. రాబోయే ఏళ్లలో ఉద్యోగ కల్పనలో వేగాన్ని పెంచుతామని వారు తెలిపారు. నాంది ఫౌండేషన్ సీఈవో మనోజ్‌కుమార్ మాట్లాడుతూ.. మన దేశంలో తగినంత జనాభా ఉన్నా, వారి ఆర్థిక పరిస్థితులననుసరించి ఉద్యోగాల కోసం వెళ్లట్లేదన్నారు. ఎంపీఎస్ కార్యక్రమం ద్వారా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను రూపొందించామన్నారు. దీని ద్వారా వారికి సురక్షితమైన ఆదాయమార్గం కల్పించడమే ధ్యేయమని తెలిపారు.
* దేశీయ స్టాక్ మార్కెట్ల రికార్డుల పరంపర కొనసాగుతోంది. పలు దేశాల్లో కొవిడ్ -19 వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం, ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు వేగంగా కోలుకుంటుండడం మదుపరులు కొనుగోళ్లకు ఉత్సాహం చూపారు. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఫార్మా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో దేశీయ మార్కెట్లు వరుసగా ఐదో రోజూ లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ తొలిసారి 13,700 మార్కు దాటగా.. సెన్సెక్స్ సైతం 47 వేల మార్కుకు కొద్ది దూరంలో నిలిచింది.
* ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ షావోమి మరో కొత్త టీవీని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఎంఐ క్యూఎల్‌ఈడీ 4K పేరిట దీన్ని తీసుకొచ్చింది. ఇప్పటి వరకు కేవలం ఎల్‌ఈడీ టీవీల అమ్మకాలకే పరిమితమైన షావోమి తొలిసారి క్యూఎల్‌ఈడీ టీవీల మార్కెట్లోకి అడుగుపెట్టింది.
* రూపే కార్డులను ప్రోత్సహించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకులను కోరుతున్నారు. డిజిటల్ రంగంలోనూ స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి పరచాలన్న ప్రభుత్వ సంకల్పానికి ఆమె చేసిన వినతి అద్దం పడుతోంది. రూపే కార్డు క్రమక్రమంగా అంతర్జాతీయతను సంతరించుకుంటోంది. ఇప్పటికే అది అమెరికా, బ్రిటన్, యూఏఈ సహా 12 దేశాలకు విస్తరించింది. దేశీయ బ్యాంకులు రూపే కార్డుకు ప్రథమ ప్రాధాన్యం ఇచ్చితీరాలన్న ఆర్థికమంత్రి పిలుపు ఎంతైనా సహేతుకం. కార్డుల రంగంలో విదేశీ కార్డు సంస్థల గుత్తాధిపత్యానికి తెర దించేందుకు ఇది దోహదపడుతుంది. బ్యాంకులు ఇతర కార్డులు జారీ చేయకూడదని ఆర్థికమంత్రి ఎక్కడా పేర్కొనలేదు కనుక, తమకు దేశీయ బ్యాంకులతో పోటీ పడేందుకు సమాన అవకాశం తిరస్కరించిందంటూ విదేశీ కార్డుల సంస్థలు ప్రభుత్వాన్ని నిందించలేవు; కాంపిటీషన్ కమిషన్ వద్ద ఫిర్యాదు చేయడమూ కుదరదు. రూపే కార్డు ప్రాచుర్యానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆత్మనిర్భర్ భారత్ విధానంలో భాగంగా చూడాల్సి ఉంటుంది. ఆత్మనిర్భర్ భారత్ ఉద్యమం అంటే విదేశీ సంస్థల ప్రవేశాన్ని అడ్డుకోవడం కాదని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టంగా వివరణ ఇచ్చింది (చైనా ఇందుకు మినహాయింపు). స్వదేశీ సంస్థలను దేశీయ విపణిలో విదేశీ సంస్థలతో పోటీపడేలా తీర్చిదిద్దడమే ఈ విధాన ధ్యేయం.