మానిసికంగా చాలా హింసిస్తున్నారు. ఈ టీమ్ మేనేజ్‌మెంట్ కింద ఇక నేను ఆడలేను. ఈసారి నేను క్రికెట్‌ను వదిలిపెట్టాల్సిందే అని అన్నాడు పాకిస్థాన్ స్టార్ పేస్‌బౌలర్ మహ్మద్ ఆమిర్. టీమ్ మేనేజ్‌మెంట్ తనతో వ్యవహరించిన తీరుపై ఆమిర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. గతేడాది జూన్‌లో టెస్ట్‌ల నుంచి రిటైరైన ఆమిర్.. వన్డేలు, టీ20ల్లో మాత్రం కొనసాగుతున్నాడు. అయితే ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న పరిమిత ఓవర్ల సిరీస్ కోసం తనను ఎంపిక చేయకపోవడం తనకో మేలుకొలుపులాంటిదని ఆమిర్ అన్నాడు. నేషనల్ టీమ్‌కు ఎంపిక చేయకపోవడంతో ఆమిర్…..శ్రీలంక వెళ్లి లంక ప్రిమియర్ లీగ్‌లో ఆడాడు. ఈ సంఘటన గురించి పాకిస్థాన్ జర్నలిస్ట్ షోయబ్ జాట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమిర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. నేను క్రికెట్ నుంచి దూరంగా వెళ్లడం లేదు. అయితే ఈ టీమ్ మేనేజ్‌మెంట్ కింద మాత్రం నేను క్రికెట్ ఆడతానని అనుకోవడం లేదు. ఈసారి నేను క్రికెట్‌ను వదిలి పెట్టాల్సిందే. నన్ను మానసికంగా హింసిస్తున్నారు. 35 మంది సభ్యుల్లో నేను ఎంపిక కాకపోవడం నిజంగా నాకో మేలుకొలుపులాంటిదే అని ఆమిర్ అన్నాడు. ఇక ఈ వేధింపులు భరించడం నా వల్ల కాదు. 2010 నుంచి 2015 మధ్య చాలా వేదనకు గురయ్యాను. ఆ సమయంలో నేను చేసిన తప్పు వల్ల గేమ్‌కు దూరమయ్యాను అని ఆమిర్ చెప్పాడు. 2009లో 17 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన ఆమిర్.. సంచలన బౌలింగ్‌తో వార్తల్లో నిలిచాడు. అయితే 2010లో స్పాట్ ఫిక్సింగ్ వివాదంతో ఐదేళ్ల నిషేధం ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత టీమ్‌లోకి వచ్చినా……చాలా మంది ప్లేయర్స్‌తో తనతో కలిసి ఆడటానికి నిరాకరించారని, ఆ సమయంలో షాహిద్ అఫ్రిది, అప్పటి పీసీబీ చీఫ్ నజమ్ సేఠీ తనకు అండగా నిలిచారని ఆమిర్ గుర్తు చేశాడు. వాళ్లిద్దరికీ తానెప్పుడూ రుణపడి ఉంటానని చెప్పాడు.
పాకిస్థానీ ఆటగాడిని వేధించిన పీసీబీ
Related tags :