22 రోజులు దాటింది.
ఈ ఇరవై రెండురోజులూ ఇరవై మందికి పైగా రైతులు చనిపోయారు.
ఢిల్లీ టెంపరేచర్ రోజురోజుకూ పడిపోతోంది.
వర్షం పడిన రాత్రి 4 డిగ్రీలకు చేరింది.
ఇప్పుడు ఈ క్షణం 3.5
సింగూ సరిహద్దు ఎంతగా వేడి పుట్టించిందో అంతగా గుబులు పుట్టిస్తోంది.
ఇంట్లో రగ్గులు కప్పుకొని వెచ్చగా పడుకున్నా కడుపులో నుండి చలి ఎగసినట్లు, తనువు కంపించినట్లు. మరి రైతు పండించిన అన్నమే కదా తింటున్నది.
దుండగుడు ఒకడు రైతుల్లో చొరబడి పాకిస్తాన్ జిందాబాద్ అన్నాడు. కలుపు ఏరేసే రైతులు కదా, వెంటనే పట్టేసారు. ఏమైనా ఉద్రిక్తంగానే ఉంది. ఉద్యమాన్ని దెబ్బతీయడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు.
రోజుకొక్కరు రాలిపోతున్నా రైతులు మాత్రం వెనకడుగు వేయడం లేదు.
ఆ చలిలో అనారోగ్యం బారినపడి 70 ఏళ్ళు పైబడిన వృద్ధుల దగ్గరి నుండి 30ల్లో ఉన్నవాళ్ల కూడా ప్రాణాలు విడుస్తున్నారు.
ఈరోజు (డిసెంబర్ 17) చనిపోయిన రైతు వయసు 37. ఆయనకు ముగ్గురు పిల్లలు.
అంతకన్నా దారుణం సంత్ రామ్ సింగ్ తనను తాను తుపాకీతో కాల్చుకొని చనిపోవడం.
రైతుల కష్టాలు ప్రత్యక్షంగా చూసి తట్టులేకపోయానని, ప్రభుత్వం చాలా అన్యాయం చేస్తోందని సూసైడ్ నోట్ రాసాడు.
ఏ కారణం చేత ఆత్మహత్య చేసుకున్నా అది సరైనది కాదు. ఆత్మహత్య ఎన్నటికీ పరిష్కారం కాదు, పోరాట రూపం కానే కాకూడదు. కానీ మనం ఆశించినట్లుగా ఏదీ ఉండదు కదా.
ఏమైనా ప్రతి అసహజ మరణం వెనక వ్యవస్థ దుర్మార్గం ఉంటుంది. అలా ఇవన్నీ పరోక్ష హత్యలే.
డిసెంబర్ 20 రైతు ఉద్యమంలో ప్రాణాలర్పించిన వారిని స్మరించుకుందామని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి.
మనందరం వారికి జోహార్లప్పిద్దాం. రైతుల్నిలా చంపొద్దని, కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకొమ్మని డిమాండ్ చేద్దాం.