ScienceAndTech

తెలుగులో గూగుల్ మ్యాప్స్

Google Maps Linguistic Enhancements In Indian Languages

తెలుగు భాషలోనే ప్రజలు సులభంగా సమాచారాన్ని తెలుసుకునేందుకు, గూగుల్‌ మ్యాప్స్‌ను మరిన్ని భారతీయ భాషల్లో పొందేందుకు వీలుగా అదనపు సామర్థ్యాలను జోడించామని గూగుల్‌ వెల్లడించింది. ఆంగ్లం నుంచి సమాచారాన్ని తెలుగు, తమిళం, బెంగాలీ, మరాఠీ భాషల్లో మార్చుకునే సౌలభ్యాన్ని గూగుల్‌ కల్పించింది. గణిత ప్రశ్నలను ఎలా పరిష్కరించాలో కూడా హిందీభాషలో కూడా నేర్చుకోవచ్చని తెలిపింది. ఇంటర్నెట్‌పై స్థానిక భారతీయ భాషల్లో సమాచార సృష్టి, వినియోగం, ఇతర సవాళ్లను ఎదుర్కొనేందుకు గూగుల్‌ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ ఫీచర్లను చేర్చామని గూగుల్‌ ఇండియా కంట్రీ హెడ్‌, ఉపాధ్యక్షుడు సంజయ్‌ గుప్తా వివరించారు. గూగుల్‌ ఎల్‌10ఎన్‌ వర్చువల్‌ సదస్సులో ఆయన మాట్లాడారు. ‘భారత్‌లో 10 కోట్ల మంది ఆన్‌లైన్‌ వినియోగదారులు ఉన్న సమయంలో కూడా గూగుల్‌ సెర్చ్‌ కనీసం 9 భారతీయ భాషల్లో లభించింది. గత కొన్నేళ్లలో ప్రాంతీయ భాషల్లో మరిన్ని ఉత్పత్తులు తీసుకొచ్చేందుకు కృషి చేశాం’ అని అన్నారు. మెట్రో నగరాల వెలుపల ఇంటర్నెట్‌ వినియోగం భారీగా పెరిగిందని, 10 కోట్ల మందికి పైగా కొత్త ఇంటర్నెట్‌ వినియోగదారులు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిచేరారని గుప్తా పేర్కొన్నారు. ఆన్‌లైన్‌కు వస్తున్న ప్రతి కొత్త వినియోగదారుడు ప్రాంతీయ భాష వాడుతున్నట్లు తెలిపారు.