Sports

బంతులపై వాదులాటలు

Shane Warne Warns About Using Pink vs Red Ball In Tests

అధమమైన ఎర్ర బంతి స్థానంలో ఇక టెస్టుల్లో గులాబి బంతినే వాడాలని స్పిన్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ అన్నాడు. ‘‘కొన్నేళ్లుగా ఇదే చెబుతున్నా. డే/నైట్‌ టెస్టుల్లోనే కాదు.. అన్ని టెస్టుల్లోనూ గులాబి బంతినే వాడాలి. గులాబి బంతిని చూడడం చాలా తేలిక. జనం కూడా తేలిగ్గా చూడగలుగుతారు. టీవీల్లో గులాబి బాగా కనిపిస్తుంది. మరి అన్ని టెస్టుల్లోనూ గులాబి బంతినే ఎందుకు వాడకూడదు? కావాలంటే 60 ఓవర్లకు మార్చుకోవచ్చు. ఎందుకంటే అప్పటికి బంతి మృదువుగా మారుతుంది. ఎర్ర బంతిని అసలే వాడనే కూడదు. అది స్వింగ్‌ కాదు. ఎలాంటి సహకారం ఇవ్వదు. 25 ఓవర్ల తర్వాత మృదువుగా మారుతుంది. చాలా కాలంగా దాని పనితీరు ఘోరం’’ అని వార్న్‌ చెప్పాడు.
***మూడు రంగులు మూడు రకాలు
భారత్‌, ఆస్ట్రేలియా మధ్య డేనైట్‌ టెస్టు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడంతా గులాబి బంతిపైనే చర్చ. సాధారణంగా టెస్టుల్లో వాడే ఎర్ర బంతికి, ఈ గులాబి బంతికి, పరిమిత ఓవర్ల క్రికెట్లో వాడే తెల్ల బంతికి తేడా ఏంటన్న ఆసక్తి కలగడం సహజం. అయితే బంతుల లోపలి పదార్థాల్లో, కుట్టే విధానంలో తేడా ఏమీ ఉండదు. బరువులోనూ అంతే. మరి అసలు తేడాలు ఎక్కడ ఉన్నాయో చూద్దాం.
****ఎర్రబంతి
* బంతిపై మైనంతో పూస్తారు. మ్యాచ్‌ సాగుతున్నకొద్దీ బంతి మైనాన్ని పీల్చుకుంటుంది. ఫలితంగా బంతిని రుద్దుతూ ఒకవైపు మెరుపును కొనసాగించడం ద్వారా రివర్స్‌ స్వింగ్‌ రాబట్టగలుగుతారు. మైనం బంతికి రంగును కూడా ఇస్తుంది. ఎర్ర బంతిని తెల్ల ధారంతో కుడతారు. సీమ్‌ పూర్తిగా సింథటిక్‌. సీమ్‌ బయటికి తక్కువగా కనిపిస్తుంది.
****గులాబి బంతి
* గులాబి బంతికి మైనాన్ని పూయరు. అలా చేస్తే అది నల్లగా మారుతుంది. మైనానికి బదులుగా బాల్‌ పాలిష్‌ను వాడతారు. దాని వల్ల బంతి 40 ఓవర్ల వరకు రంగును కోల్పోదు
* బంతిని నల్ల ధారంతో కుడతారు.
* సీమ్‌ ఎర్ర బంతి సీమ్‌ కన్నా ఎక్కువ ఉబ్బెత్తుగా ఉంటుంది. ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. సింథటిక్‌, లినెన్‌ల కలయికతో సీమ్‌ ఉంటుంది. సీమ్‌లోని లినెన్‌ మంచును పీల్చుకుని, మెరుగైన గ్రిప్‌కు తోడ్పడుతుంది.
* ఆరంభంలో సాధారణం కన్నా ఎక్కువ స్వింగ్‌ లభిస్తుంది. పాలిష్‌ కారణంగా బంతి ఎక్కువ సమయం కొత్తగా ఉండడం వల్ల తొలి 10-15 ఓవర్ల పాటు అధిక స్వింగ్‌ లభిస్తుంది.
****తెల్ల బంతి
డేనైట్‌ మ్యాచ్‌ల రాకతో క్రికెట్లో తెల్ల బంతి ప్రవేశించింది. ఎర్ర బంతిని రూపొందించేలాగానే దీన్ని తయారు చేస్తారు. అయితే ఫ్లడ్‌ లైట్ల వెలుతురులో స్పష్టంగా కనిపించడం కోసం దానికి తెల్ల రంగు అద్దుతారు. రంగు త్వరగా క్షీణించకుండా ఉండేందుకు కోటింగ్‌ ఎక్కువ వేస్తారు. అందుకే ఎర్ర బంతితో పోల్చితే ఇది ఎక్కువ గట్టిగా ఉంటుంది. ఎక్కువ స్వింగవుతుంది.