మహాభారతంలో ఇద్దరు మహిళలకు పుట్టిన ఈ రాజు గురించి మీకు తెలుసా..?
మహాభారత పురాణం అంటేనే అది చాలా పెద్ద పురాణం. అందులో ఎన్నో పాత్రలు ఉంటాయి. ఒక్కోపాత్రకు ఒక్కో కథ ఉంటుంది. ప్రధానంగా చెప్పుకునేది పాండవులు, కౌరవులు, శ్రీకృష్ణుడి గురించే అయినా ఇంకా చాలా పాత్రలకు కథలు ఉన్నాయి. అలాంటి పాత్రల్లో జరాసంధుడు కూడా ఒకడు. ఇతను కౌరవుల పక్షాన నిలిచాడు. పాండవుల చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. భీముడు జరాసంధున్ని రెండుగా చీల్చి చంపుతాడు. అయితే ఆ జరాసంధుడు గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోయేది..!
మగధ సామ్రాజ్యపు రాజు బృహద్రతుడికి సంతానం ఉండదు. అతనికి ఇద్దరు భార్యలు ఉంటారు కానీ ఎవరికీ సంతానం కలగదు. దీంతో అతను మనస్థాపం చెందుతాడు. అయితే చండకౌశికుడనే ఓ ముని గురించి తెలుసుకుని అతనికి సపర్యలు చేస్తాడు బృహద్రతుడు. అలా కొన్ని రోజుల పాటు అతను ఆ ముని వద్దే ఉండి అతని మెప్పు కోసం ప్రయత్నిస్తాడు. దీంతో చండకౌశికుడు బృహద్రతుడి మనస్సులో ఉన్న కోరికను గ్రహించి అతనికి ఓ పండును ఇస్తాడు. ఆ పండును భార్యకు తినిపించమని చెబుతాడు. దాంతో సంతానం కలుగుతుందని ఆ ముని ఆశీర్వదిస్తాడు.
ఆ పండును తీసుకున్న బృహద్రతుడు సంతోషంతో ఇంటికి బయల్దేరతాడు. అయితే ఇద్దరు భార్యలు కావడంతో ఎవరినీ నొప్పించవద్దని చెప్పి ఆ పండును సగం కోసి ఇద్దరికీ ఇస్తాడు. దీంతో వారు నిలువుగా సగం శరీరం మాత్రమే ఉన్న బాలున్ని ఇద్దరూ కంటారు. ఈ క్రమంలో ఆ బాలుడి రెండు భాగాలకు వారు జన్మనిస్తారు. అయితే అలా జన్మించిన ఆ బాలున్ని చూసి రాజు, అతని భార్యలు ఎంతగానో దుఃఖిస్తారు. దానికి బాగా చింతిస్తూ రాజు ఆ రెండు శరీర ముక్కలను తీసుకుని వెళ్లి అడవిలో పారేస్తాడు. వెంటనే వెను దిరుగుతాడు. అయితే ఆ ముక్కలను జర అనే ఓ రాక్షసి చూస్తుంది.
దీంతో జర ఆ రెండు ముక్కలను కలిపి తన మంత్ర శక్తితో ప్రాణం పోస్తుంది. అప్పుడు బాలుడు పెద్దగా ఏడుస్తాడు. ఆ ఏడుపు విన్న రాజు మళ్లీ వెనక్కి వచ్చి చూడగా ఆ బాలుడు బతికే ఉంటాడు. ఇది ఎలా సాధ్యమైందని జరను అతను అడుగుతాడు. దీంతో జర జరిగింది చెబుతుంది. అప్పుడు ఆ రాజు ఆమె పేరు మీదుగానే ఆ బాలుడికి జరాసంధుడనే పేరు పెడతాడు. అలా జరాసంధుడు మగధ సామ్రాజ్యానికి తండ్రి తరువాత రాజు అవుతాడు. కౌరవుల పక్షాన చేరతాడు. యుద్ధంలో భీమునితో తలపడతాడు.
అయితే భీముడు జరాసంధునితో 14 రోజుల వరకు మల్లయుద్ధం చేస్తూనే ఉంటాడు. కానీ ఎవరూ ఓడిపోరు. దీంతో కృష్ణున్ని భీముడు సహాయం అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు అసలు రహస్యం చెబుతాడు. దీంతో భీముడు జరాసంధున్ని రెండుగా చీలుస్తాడు. ఒక్కో ముక్కను వ్యతిరేకంగా చేసి రెండు వేర్వేరు ప్రాంతాల్లో విసిరేస్తాడు. దీంతో జరాసంధుడు చనిపోతాడు. అదీ… అతని కథ..!