DailyDose

పెళ్లి ఇంట్లో 2కిలోల బంగారం చోరీ-నేరవార్తలు

Crime News - 2Kilos Gold Stolen From Wedding Home In Mahabubnagar

* మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌ మండలం బోయినపల్లి గ్రామంలో భారీ చోరీ జరిగింది. గ్రామానికి చెందిన ఇంద్రరెడ్డి ఇంట్లో ఈనెల 23న వివాహ కార్యక్రమం ఉండటంతో సమీప బంధువుల అందరూ ఇంటికి వచ్చారు. బంధువులకు సంబంధించిన బంగారు నగలు, రూ.6లక్షల నగదు బీరువాలో ఉంచారు. ఇదే అదునుగా అర్ధ రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నగదు, బంగారం ఎత్తుకెళ్లారు. దాదాపు రెండు కిలోల బంగారం, రూ.6లక్షల నగదు చోరీకి గురైందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ శివకుమార్‌ ఘటనాస్థలికి చేరుకుని క్లూస్‌ టీమ్‌తో దర్యాప్తు చేపట్టారు. పెళ్లి ఇంట్లో భారీ చోరీ జరగడం స్థానికంగా సంచలనం కలిగించింది.

* గన్నవరం(మం) కేసరపల్లి లో వైసిపి ఇరు వర్గాల మధ్య ఘర్షణ…స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ కేసరపల్లి లో అభివృద్ధి పనులు రోడ్లు శంకుస్థాపనకు వచ్చిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.ఎమ్మెల్యే శంకుస్థాపన కార్యక్రమం లో ఉండగా సభా వేదిక వద్ద చెలరేగిన వివాదం.రాళ్లతో ఇరువర్గాల పరస్పర దాడి.కాసరనేని రంగబాబు ముప్పనేని రవి రాళ్లతో పరస్పర దాడి చేసుకోవడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడిన సభ ప్రాంగణం.పోలీసులు రంగప్రవేశం చేయడంతో సద్దుమణిగిన వివాదం.

* కర్నూలు జిల్లా హాలహర్వి మండలం గుళ్లెం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో తల్లి, ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. స్థానికులు, పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. సతీష్‌, కవిత దంపతులు గ్రామంలో కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారు. ఎప్పటి లాగే ఈరోజు ఉదయం కూడా హీటర్‌తో నీళ్లు కాచే సమయంలో వాటర్‌ హీటర్‌కు ప్రమాదవశాత్తు చేయి తగలడంతో కవిత(35) విద్యుదాఘాతానికి గురైంది. పక్కనే ఉన్న చిన్నారులు నిశ్చల్‌ కుమార్‌(11), వెంకటసాయి(8) తల్లిని పట్టు కోవడంతో ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబంలోని ముగ్గురు ఒకేసారి మరణించడంతో కవిత భర్త సతీష్‌ హతాశుడయ్యాడు. ఈ ఘటన స్థానికులను కలచివేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్టు హాలహర్వి ఎస్‌ఐ నరేందర్‌ తెలిపారు.

* పనిచేస్తున్న సంస్థలోనే భారీ చోరీ చేసిన వ్యక్తిని.. అతనికి సహకరించిన మరో ఇద్దరిని రాచకొండ సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద రూ.కోటి 7లక్షలు విలువచేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఎల్బీనగర్‌లోని సీపీ క్యాంపు కార్యాలయంలో రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ నిందితుల వివరాలు వెల్లడించారు. కడప జిల్లా రైల్వే కోడూరు మండలంలోని రెడ్డివారిపల్లెకు చెందిన రాపూరు దినేష్‌రాయ్‌(27) నాగోలులో నివసిస్తూ ఆదిభట్ల సమీపంలోని మన్నెగూడలోని కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ సంస్థలో పనిచేస్తున్నాడు. సంస్థకు చెందిన క్రిమిసంహారక మందులున్న గోదాములో డిస్పాచ్‌ ఉద్యోగిగా పనిచేస్తున్న దినేష్‌ రాయ్‌ రూ.77లక్షల విలువైన పురుగుల మందులను కాజేసి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ముఖేష్‌(21), జనగాం జిల్లాకు చెందిన శివప్రసాద్‌(21) సాయం తీసుకున్నాడు. వాటిని నిజాంపేటలో ఉండే ముఖేష్‌, సికింద్రాబాద్‌లోని రైల్వే కార్టర్స్‌లో ఉండే శివప్రసాద్‌ల ఇళ్లలో దాచారు. యాజమాన్యం గత నెల 30న పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎల్బీనగర్‌ సీసీఎస్‌ పోలీసులు దర్యాప్తు చేసి ఆదిభట్ల పోలీసుల సహకారంతో శుక్రవారం నిందితులను అరెస్టుచేశారు. రెండు కార్లు, రెండు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

* పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం జట్లపాలెం రహదారిపై ఓ వ్యక్తి భార్యను దారుణంగా నరికి చంపేశాడు. తనతో తెగదెంపులు చేసుకునేందుకు ప్రియుడితో కలసి శుక్రవారం ఉదయం పోలీస్‌స్టేషన్‌కు బయలు దేరిన ఆమెను దారికాచి హతమార్చాడు. పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం .. గణపవరం మండలం మొయ్యేరుకు చెందిన బేతిన చంద్రిక (24) అదే మండలంలోని చిలకంపాడుకు చెందిన దువ్వారపు చంటి 2014లో ప్రేమ వివాహం చేసుకున్నారు. కొద్ది కాలం సంసారం సజావుగానే సాగింది. స్థలం కొనుక్కుంటానంటే చంద్రిక తల్లిదండ్రులు రూ.5 లక్షలు అల్లుడు చంటికి ఇచ్చారు. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఆరునెలల నుంచి ఆమె భర్తకు దూరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉంగుటూరు మండలం గొల్లగూడెంకు చెందిన కొమ్ము జెల్సీతో చంద్రికకు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆమె జెల్సీతోనే కలసి ఉంటోంది. భర్తతో ఉన్న గొడవల నేపథ్యంలో అతనిపై గణపవరం పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేసి విడాకులు తీసుకునేందుకు గొల్లగూడెం నుంచి మొయ్యేరుకు ప్రియుడిని తీసుకుని ద్విచక్రవాహనంపై బయలుదేరింది. విషయం తెలిసిన భర్త.. వారు ప్రయాణిస్తున్న పెంటపాడు – జట్లపాలెం మార్గంలో మరో ఇద్దరితో కలిసి కాపుకాశాడు. ఘటనా స్థలానికి చేరుకున్నాక మాట్లాడే పని ఉందని చంద్రికను ఆపాడు. చంటి ముందుగా జెల్సీపై దాడిచేయగా అతను తప్పించుకుని పెంటపాడు పోలీసుస్టేషన్‌కు వెళ్లాడు. తర్వాత చంద్రికపై దాడిచేసి కత్తితో నరకడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది.

* ఆన్‌లైన్‌ లోన్‌ యాప్‌ల వ్యవహారాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు. వరుస ఘటనలపై చర్యలకు ఉపక్రమించారు. ఆన్‌లైన్‌ లోన్‌యాప్‌ తయారు చేసి అప్పులు ఇచ్చి యువత జీవితాలతో చెలగాటం ఆడుతున్న వ్యక్తిని సైబరాబాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.