DailyDose

తిరుపతిలో భక్తుల ఆందోళన-తాజావార్తలు

Devotees In Tirupati Do Protest For Sarvadarshanam Tokens

* తిరుపతిలోని విష్ణు నివాసం ఎదుట భక్తులు ఆందోళనకు దిగారు. సర్వదర్శనం టోకెన్ల జారీ విషయమై భక్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. 24వ తేదీ దర్శనం టోకెన్లు ముందస్తుగా ఇవ్వడంపై శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దర్శనం కోసం నాలుగైదు రోజులు ఎక్కడ ఉండాలంటూ వారు తితిదే అధికారులను ప్రశ్నించారు. చిన్నపిల్లలు, వృద్ధులతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన తమకు నాలుగు రోజుల తర్వాత దర్శన అవకాశం కల్పిస్తారా అని నిలదీశారు. తితిదే నిఘా అధికారులు, పోలీసులు భక్తులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినా భక్తులు ఆందోళన విరమించకపోవడంతో అధికారులు రేపటి టోకెన్లను మరో మూడు వేలు అదనంగా ఇచ్చారు.

* తెలుగు సినీ పరిశ్రమలో విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమలో ఒక విభాగానికి సంబంధించి రాయితీలు ప్రకటించడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. నిర్మాతల విజ్ఞప్తులను కూడా ముఖ్యమంత్రి జగన్ పరిశీలనలోకి తీసుకోవాలని కోరారు.

* బ్రిటన్‌ సహా దక్షిణాఫ్రికా దేశాల్లో కొత్త రకం కరోనా వైరస్‌ స్ట్రెయిన్‌ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ప్రపంచ దేశాలు మరోసారి కలవరంలోకి జారుకుంటున్నాయి. తాజాగా ఆ రెండు దేశాల నుంచి వచ్చే ప్యాసింజర్‌ విమానాలపై నిషేధాజ్ఞలు విధించేందుకు జర్మనీ ప్రభుత్వం పరిశీలనకు దిగింది. ఆయా దేశాల్లో కరోనా కొత్త రకం స్ట్రెయిన్‌ విజృంభణ కొనసాగుతున్నందున.. అక్కడి నుంచి వచ్చే విమానాలపై జర్మనీ దృష్టి సారించింది. ఈ మేరకు జర్మనీ ఆరోగ్య అధికారులు ఓ మీడియాతో వెల్లడించారు.

* పార్టీ శ్రేణుల ఉత్సాహం, అధికార పార్టీ వైఫల్యాలను చూస్తుంటే 2023 శాసనసభ ఎన్నికల్లో గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగురవేస్తామన్న సంపూర్ణ నమ్మకం కలుగుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. నారాయణపేట జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం మరికల్‌ మండలంలోని అప్పపల్లి గ్రామంలో స్వామి వివేకానంద విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరముందన్నారు. యువత స్వామి వివేకానంద ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

* రెండు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పశ్చిమ బెంగాల్‌లో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. ఆదివారం ఆయన బోల్‌పూర్‌లో రోడ్‌ షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో భాజపా మద్దతుదారులు హాజరయ్యారు. దీనిపై స్పందించిన అమిత్‌షా.. పశ్చిమ బెంగాల్‌ మార్పును కోరుకుంటోదనడానికి ర్యాలీలో పాల్గొన్న భారీ జనసంద్రమే నిదర్శనమన్నారు. రోడ్‌షోలో ఇంతటి జనాన్ని నా జీవితంలో ఎన్నడూ చూడలేదని అమిత్‌ షా అన్నారు.

* దేశంలో కొవిడ్‌-19 రెండో తీవ్రదశ (సెకెండ్‌ పీక్‌) ఉండకపోవచ్చని.. ఒకవేళ వచ్చినా తొలిదశ అంత బలంగా ఉండదని ఆరోగ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశంలో కొవిడ్‌ కేసుల సంఖ్య కోటి దాటిన నేపథ్యంలో నిపుణులు చెబుతున్న అంశాలు కొంత ఊరటనిస్తున్నాయి.

* టీకా తయారీదారులకు న్యాయపరమైన రక్షణ ప్రభుత్వాలే కల్పించాలని ప్రముఖ వ్యాక్సిన్‌ తయారీ సంస్థ సీరం ఇన్‌స్టిట్యూట్‌ సీఈవో అదర్‌ పూనావాలా అన్నారు. ముఖ్యంగా మహమ్మారి సమయంలో సంస్థలపై దాఖలయ్యే కేసుల విషయంలో సర్కార్‌ అండగా నిలవాలని కోరారు. వర్చువల్‌ విధానంలో శనివారం జరిగిన ‘కార్నెగీ ఇండియా గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్’లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్‌ అభివృద్ధిలో ఎదురయ్యే సవాళ్లపై చర్చ సందర్భంగా పూనావాలా ఈ అంశాన్ని లేవనెత్తారు. ఆరోపణల కారణంగా ప్రజల్లో అనవసర భయాలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది వ్యాక్సినేషన్‌.. తద్వారా కరోనా కట్టడికి పెద్ద అవరోధంగా మారే ప్రమాదం ఉందన్నారు. అలాగే తయారీ సంస్థలు సైతం టీకా ఉత్పత్తి నుంచి తప్పుకునే పరిస్థితులు ఉత్పత్తన్నమవుతాయన్నారు. ఇదే జరిగితే ఆయా సంస్థలు దివాళా తీసే ప్రమాదం కూడా ఉందన్నారు.

* కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు కేంద్రం గుడ్‌న్యూస్‌ చెప్పింది. పింఛను పొందేందుకు ఏటా సమర్పించాల్సిన లైఫ్‌ సర్టిఫికెట్‌ గడువును పొడిగించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు సర్టిఫికెట్లను సమర్పించొచ్చని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ వెల్లడించారు. కొవిడ్‌ నేపథ్యంలో బ్యాంకుల వద్ద రద్దీ తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

* తెలంగాణలో ధరణి పోర్టల్‌ ద్వారా నిర్వహించిన వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లతో రూ.106.15 కోట్లు ఆదాయం సమకూరిందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ధరణి పోర్టల్‌ ద్వారా రాష్ట్రంలో జరిగిన వ్యవసాయ రిజిస్ట్రేషన్ల పురోగతిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. నవంబర్‌ 2 నుంచి ధరణి పోర్టల్‌ ద్వారా సాగు భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతున్న విషయం తెలిసిందే.

* కరోనా కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. వారందరికీ నెలకు రూ.10వేలు చొప్పున ఆర్థిక సాయం అందించాలన్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో పాఠశాలలు మూతపడడంతో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు ప్రతీక్‌రెడ్డి 9వ వర్ధంతి సందర్భంగా ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్గొండకు చెందిన 250 మంది ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు రూ. 3 వేలు చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేశారు.

* ప్రభుత్వ భూములు ఎవరు ఆక్రమించినా కఠిన చర్యలు తప్పవని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ భూమి అంటే ప్రజల భూమి అని.. ప్రజాస్వామ్యంలో అందరూ సమానమేనన్నారు. ఈ విషయంలో తెదేపా నేతలు తప్పుడు ప్రచారాలు చేయవద్దన్నారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. విశాఖ జిల్లాలో బాక్సైట్‌ తవ్వకాలను అనుమతించబోమని స్పష్టం చేశారు.

* విశాఖ జిల్లా చీడికాడ మండలంలోని చుక్కపల్లిలో రాష్ట్ర స్థాయి ఎండ్లబండి పరుగు పోటీలు ప్రారంభించారు. ఈ పోటీల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన 19 బృందాలు పాల్గొన్నాయి. సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి జన్మదిన వేడుకను పురస్కరించుకొని ఈ పోటీలను నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. విజేతలుగా నిలిచిన 9మందికి నగదు, షీల్డ్‌లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండలశాఖ అధ్యక్షుడు అప్పారావు, గొల్లవెల్లి రాజబాబు, లాలం జానకీరాం తదితరులు పాల్గొన్నారు.

* విశాఖపట్నంలో గత కొంత కాలంగా అధికారులు భూ ఆక్రమణలపై కొరడా ఝుళిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం విశాఖ రుషికొండలోని సర్వే నెంబరు 21లో ఉన్న 8 సెంట్ల భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ భూమి ప్రభుత్వానికి చెందినదైనప్పటికీ ఇంతకాలం విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆధీనంలో ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. వైకాపా కక్షసాధింపు చర్యల్లో భాగంగానే తన భూమిని స్వాధీనం చేసుకున్నారని ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు.

* ఏపీలో కొత్తగా 438 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలో 64,236 నమూనాలను పరీక్షించగా తాజా కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య 8,78,723కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో కరోనా చికిత్స పొందుతూ ఇద్దరు మృతిచెందారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒకరు చొప్పున చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కొవిడ్‌తో మరణించిన వారి సంఖ్య 7,076కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 589 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 4,202 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,12,60,810 పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.

* అదనపు రుణాలు తీసుకునేందుకు పలు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు రూ.16,728 కోట్ల అదనపు రుణాలు తీసుకునేందుకు అనుమతించింది. సులభతర వాణిజ్యం, ఒకే దేశం-ఒకే రేషన్‌, పట్టణ స్థానిక సంస్థలు, విద్యుత్‌ రంగాల్లో సంస్కరణలు అమలు చేసినందుకు ఈ అవకాశం కల్పించింది.

* కోనసీమ ప్రజల డిమాండ్ల పరిష్కారానికి దివీస్ సంస్థ అంగీకరించిందంటూ ప్రభుత్వం మోసం చేస్తోందని తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. స్థానికులపై పెట్టిన క్రిమినల్‌ కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. కేసులు తొలగిస్తామని ప్రభుత్వం వాగ్దానం చేయలేదని, సంస్థను వేరొక ప్రాంతానికి తరలించడానికి కూడా అంగీకరించలేదన్నారు.

* పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) పరిశీలించింది. తొలుత ప్రాజెక్టుకు వద్దకు చేరుకున్న పీపీఏ సీఈవో చంద్రశేఖర్‌ అయ్యర్‌ నేతృత్వంలోని బృందానికి ప్రాజెక్టు ఇంజినీర్లు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం సీఈవో చంద్రశేఖర్‌ అయ్యర్‌, సభ్యులు ప్రాజెక్టు కాఫర్‌ డ్యాం, స్పిల్‌వే క్రస్ట్‌ గేట్ల అమరిక పనులను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనులు జరుగుతున్న విధానాన్ని ఇంజినీర్లు పీపీఏ బృందానికి వివరించారు.