Politics

బ్యాంకులను మోసం చేయడంలో రాయపాటి నూతన రికార్డు

Rayapati Bank Scam Crossed Nirav Modi's By 200Crores

బ్యాంక్‌ రుణ ఎగవేతల్లో ఇప్పటివరకు మారుమోగుతున్న పేర్లలో ప్రధానమైన నీరవ్‌ మోదీని మించిన రుణ ఎగవేతకు ఓ కంపెనీ పాల్పడినట్టు సీబీఐ అధికారులు గుర్తించారు. దేశంలోనే ఇది అతిపెద్ద బ్యాంక్‌ ఫ్రాడ్‌ కానున్నదని దర్యాప్తు అధికారులు పేర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు, అక్కినేని సతీశ్‌కు చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌ ఇండియా లిమిటెడ్‌ సంస్థ హైవేలు, బ్రిడ్జీలు, సాగునీటి ప్రాజెక్టులు, మెట్రో సంబంధ పనుల కోసం కెనరా బ్యాంకు నుంచి రూ. 7,926 కోట్ల రుణం తీసుకున్నట్టు సీబీఐ అధికారులు తెలిపారు. ఇది నీరవ్‌ మోదీ బ్యాంకులను మోసగించిన రూ.7,700 కోట్ల కంటే ఎక్కువ కావడం గమనార్హం. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు శుక్రవారం గుంటూరు, హైదరాబాద్‌లోని రాయపాటి సాంబశివరావు నివాసాల్లో వేర్వేరుగా దాదాపు ఏడు గంటలపాటు సోదాలు నిర్వహించారు. అనంతరం రాయపాటి వాంగ్మూలాన్ని నమోదు చేశారు.