ScienceAndTech

అంతరిక్ష విహారయాత్రలు వచ్చేస్తున్నాయి

Space Tourism To Begin Early Next Year

అంతరిక్ష పర్యాటకానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ప్రముఖ ప్రైవేట్‌ అంతరిక్ష సేవల సంస్థ స్పేస్‌ ఎక్స్‌తోపాటు అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్‌ తదితర కంపెనీలు స్పేస్‌ టూరిజంపై పరిశోధనలు చేస్తున్నాయి. బ్రిటన్‌ సంపన్నుడు రిచర్డ్‌ బ్రాన్సన్‌ స్థాపించిన వర్జిన్‌ గాలక్టిక్‌ సంస్థ వచ్చే ఏడాది అంతరిక్ష పర్యాటకాన్ని ప్రారంభిస్తామని ప్రకటించింది. ఈ మేరకు అంతరిక్షంలోకి వెళ్లే స్పేస్‌క్రాఫ్ట్‌ డిజైన్‌ను 2013లోనే సిద్ధం చేసింది. దీనికి ‘వీఎస్‌ఎస్‌ యూనిటీ’ అని పేరు పెట్టారు. ఇందులో మొత్తం 8 మంది ప్రయాణించవచ్చు. వారిలో ఇద్దరు పైలట్లు కాగా.. ఆరుగురు పర్యాటకులు. ఇప్పటికే సుమారు 600 మంది టికెట్లు బుక్‌ చేసుకున్నారు. అంటే 100 ట్రిప్పులకు సరిపడా టికెట్లు బుక్‌ అయ్యాయన్నమాట. వెయ్యి డాలర్లు (సుమారు రూ.75 వేలు) చెల్లించి టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు. ప్రయాణ ఖర్చు సుమారు 3 లక్షల డాలర్ల వరకు (సుమారు రూ.2.20 కోట్లు) ఉంటుందని అంచనా. విమాన విడిభాగాలు, స్పేస్‌ క్రాఫ్ట్‌ల తయారీ సంస్థ ‘ఆక్సియోమ్‌’ సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలనే ఆలోచనలో ఉన్నది. ప్రస్తుతానికి అంతరిక్షంలోకి, ఐఎస్‌ఎస్‌కు పర్యాటకులను పంపాలని వ్యూహాలు రచిస్తున్నది. తాము అభివృద్ధి చేస్తున్న భారీ అంతరిక్ష నౌక ‘స్టార్‌ షిప్‌’లో ఒక పర్యాటకుడిని పంపిస్తామని స్పేస్‌ఎక్స్‌ సంస్థ ప్రకటించింది. ‘బ్లూ ఆరిజిన్‌’ కంపెనీ ఒకటి రెండేండ్లలో అంతరిక్ష పర్యాటకానికి సిద్ధమవుతున్నది. ‘న్యూ షెపర్డ్‌’ పేరుతో రాకెట్‌ను అభివృద్ధి చేస్తున్నది. ఇది హెలికాప్టర్‌ మాదిరిగా నిటారుగా గాలిలోకి ఎగిరి.. తిరిగి అదేవిధంగా కిందికి దిగేలా రూపొందిస్తున్నారు. ఒక్కో ట్రిప్‌లో ఆరుగురిని అంతరిక్షంలోకి తీసుకెళ్లాలని బ్లూ ఆరిజిన్‌ లక్ష్యంగా పెట్టుకున్నది. అమెరికాకు చెందిన ఆర్మడిల్లో ఏరోస్పేస్‌ సంస్థ ‘హైప్రియాన్‌’ పేరుతో రాకెట్‌ను అభివృద్ధి చేస్తున్నది. ఇందులో ఇద్దరు ప్రయాణించవచ్చని చెప్పింది. ఈ సంస్థను ఇటీవలే ఎక్సోస్‌ ఏరోస్పేస్‌ సొంతం చేసుకున్నది.