DailyDose

విశాఖలో 30కిలోల హవాలా వెండి పట్టివేత-నేరవార్తలు

Crime News - 30Kgs Silver And 100Kgs Drugs Seized In Visakhapatnam

* విశాఖలో హవాలా నగదు కలకలం రేపింది. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు జరిపిన తనిఖీల్లో వేర్వేరు చోట్ల భారీగా నగదుతో పాటు గంజాయి, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ ప్రేమ్‌కాజల్‌ వివరాలు వెల్లడించారు. ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. నగర పోలీసులు యాంటీ డ్రగ్‌ ప్రత్యేక డ్రైవ్‌లో నిర్వహించారు. ఈ తనిఖీల్లో 100 కిలోల గంజాయి, రూ.కోటి నగదు, 29.415కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. గాజువాక ప్రాంతంలోని దువ్వాడ రైల్వే బ్రిడ్జి వద్ద దువ్వాడ పోలీసులు యాంటీ డ్రగ్‌ ప్రత్యేక తనిఖీల్లో భాగంగా ఓ ఇన్నోవా కారులో 100 కిలోల గంజాయిని గుర్తించారు. కారుడ్రైవర్ గౌరవ్‌ (25)ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కారులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి సుబ్బారెడ్డి అలియాస్‌ సురేష్‌ తప్పించుకున్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

* పదోతరగతి విద్యార్థినికి ఓ యువకుడు తాళికట్టేందుకు యత్నించాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. ఏఎస్సై పి.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం..అనపర్తి మండలంలోని మహేంద్రవాడకు చెందిన పదోతరగతి బాలిక యథావిథిగా పాఠశాలకు హాజరైంది. తరగతులు ప్రారంభం కాకముందే అనపర్తి మండలంలోని కొప్పవరానికి చెందిన సత్తి శివారెడ్డి(23) అనే యువకుడు మైనర్‌ బాలికకు తాళి కడతానంటూ తరగతిలోకి ప్రవేశించాడు. ఈ హఠాత్పరిణామానికి విస్తుపోయిన విద్యార్థులు, బాలిక తమ్ముడు కేకలు వేస్తూ యువకుడిని అడ్డుకుని నెట్టివేశారు. కేకలు విని ఉపాధ్యాయులు రావడం గమనించిన యువకుడు తాళిబొట్టును పడేసి ద్విచక్రవాహనంపై పారిపోయాడు.

* ప్రేమిస్తున్నానని వెంటపడుతూ వేధింపులకు గురిచేస్తున్నందుకు ఓ యువతి తన తండ్రి సహాయంతో చెప్పుతో కొట్టారని మనస్తాపంతో షేక్‌ పర్దిన్‌ వలి (20) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం కొరిటపాడు సమీపంలోని హనుమయ్యనగర్‌కు చెందిన షేక్‌ పర్దిన్‌వలి పెయింటర్‌గా పని చేస్తూ జీవిస్తున్నాడు. చదువుకునే సమయంలో ఎనిమిదో తరగతిలో అదే ప్రాంతానికి చెందిన ఒక విద్యార్థినితో పరిచయం ఏర్పడింది. అనంతరం యువతి డిగ్రీ పూర్తి చేసింది. ఇటీవల ఆమె వ్యాయామానికి వెళ్లేటప్పుడు పర్దిన్‌వలి వెంటపడుతూ వేధింపులకు గురిచేస్తున్నాడు. యువతి ఆ విషయాన్ని ఆమె తండ్రికి తెలియజేసింది. ఆయన తన కుమార్తెతో పర్దీన్‌వలిని రోడ్డుపై చెప్పుతో కొట్టించి మళ్లీ వెంటపడొద్దని బెదరించి అరండల్‌పేట ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు పెయింటర్‌ను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపారు. ఈ ఘటనతో మనస్తాపానికి గురైన పర్దీన్‌వలి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఆగ్రహించిన బంధువులు యువకుడి మృతదేహాన్ని అరండల్‌పేట ఠాణా వద్దకు తీసుకు వచ్చి ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని, యువతితోపాటు తండ్రిపై కేసు నమోదు చేయాలని పట్టుబట్టారు. సీఐ శ్రీనివాసరావు జోక్యం చేసుకొని యువతి, ఆమె తండ్రిపై కేసు నమోదు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతదేహాన్ని శవ పరీక్ష కోసం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

* ఆన్‌లైన్‌ ‘కాల్‌మనీ’పై పోలీసుల విచారణలో విస్తుపోయే అంశాలు వెలుగు చూస్తున్నాయి. నిర్ణీత వ్యవధిలో రుణం చెల్లించినా.. ‘యాప్‌’ల చట్రం నుంచి బయటికెళ్లకుండా ఉచ్చు బిగిస్తున్నారు. మరో 25 యాప్‌లను పరిచయం చేసి రుణం తీసుకొనేలా చేస్తున్నారు. సింగరేణికి కాలనీకి చెందిన ఓ బాధితుడు నవంబరులో ‘మై బ్యాంక్‌’ యాప్‌ నుంచి రూ.3,500 తీసుకుని వారంలోపు చెల్లించాడు. ఆ వెంటనే ‘మరికొన్ని యాప్స్‌ను అన్‌లాక్‌ చేశాం..డౌన్‌లోడ్‌ చేసుకుని మరింత రుణం తీసుకోవచ్చు’ అంటూ సందేశం పంపారు. రూ.30వేలు తీసుకున్నాడు. వారంలో రూ.55 వేలు కట్టాలని సందేశం రావడంతో లబోదిబోమన్నాడు.

* మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో జరిగిన ఓ ఘటన షాక్‌కు గురిచేస్తోంది. డబ్బుకు ఆశపడిన ఓ అక్క మైనర్‌ అయిన తన చెల్లికి డ్రగ్స్‌ ఇచ్చి వ్యభిచారం చేయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న తల్లి పోలీసులకు తెలియజేయడంతో అక్కతో సహా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. భోపాల్‌కు చెందిన 15 ఏళ్ల బాలిక డ్రగ్స్‌కు బానిసవ్వడంతో కౌన్సిలింగ్‌ కోసం తల్లి ఆమెను ఎన్‌జీఓలో చేర్పించింది. అయితే సదరు బాలిక నిర్ఘాంతపోయే విషయాలు వెల్లడించింది. రెండేళ్ల క్రితమే తన సోదరి(20) తనకు మాదకద్రవ్యాలు అలవాటు చేసిందని, డ్రగ్స్‌ ఇచ్చి తనతో వ్యభిచారం చేయించిందని వెల్లడించింది. ఇప్పటివరకు ఐదుగురు వ్యక్తులతో ఆరుసార్లు తనను పంపించిందని పేర్కొంది. దీంతో బాలిక తల్లి గాంధీనగర్‌ పోలీసులను ఆశ్రయించింది.పోక్సో చట్టం కింద అత్యాచారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు మొదట అక్కను అరెస్టు చేసి విచారించారు. ఆమె అందించిన సమాచారంతో ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.