భూమి మీద ఏ జీవి మనుగడకైనా జలమే ఆధారం. అలాంటి నీళ్లు తాగడం కాసేపు ఆలస్యం అయితే దాహంతో విలవిలలాడటం సాధారణం. కానీ ఓ వృద్ధురాలు మాత్రం ఏళ్లుగా నీళ్లు తాగకుండా జీవిస్తోంది. నీళ్లంటే ఆమడ దూరం జరుగుతోంది. జనగామ జిల్లాకు చెందిన ప్రమీలమ్మ పదేళ్లుగా నీళ్లు తాగకుండానే కాలం వెళ్లదీస్తోంది. ఇంట్లో వాళ్లు బతిమాలినా నీళ్లు నాకొద్దంటూ దూరంగా వెళ్తోంది. పదేళ్ల వయసు వరకు అందరిలానే నీళ్లు తాగిన ఆమె క్రమంగా తగ్గించేసింది. వయసు పెరిగే కొద్ది నీళ్లే తాగకుండా గడిపేస్తోంది. చలి, వర్షాకాలాల్లోనే కాదు, భగభగ మండే వేసవిలోనూ నీరు ముట్టడంలేదు. నీళ్లు తాగకపోయినా తనలో ఏ మార్పు లేదని చెబుతున్న ప్రమీలమ్మ 70ఏళ్ల వయసులోనూ ఆరోగ్యంగా ఇంటి పనులన్నీ చక్కబెడుతోంది. సాధారణంగా నీళ్లు తాగకుండా గంటల పాటు ఉంటేనే ఆరోగ్యం క్షీణిస్తుంది. కానీ పదేళ్లుగా ప్రమీలమ్మ నీరు తీసుకోకపోయినా ఆరోగ్యంగా ఉండటానికి కారణం ఆమె తీసుకునే ఆహారంలో నీటి శాతం ఉండటమేనని వైద్యులు భావిస్తున్నారు. శరీరానికి నీటి అవసరం ఉంటుందన్న వైద్యులు తగిన మొత్తంలో తీసుకోకపోతే ప్రమాదమని హెచ్చరించారు.
జనగామ ప్రమీలమ్మ…నీరే తాగదమ్మా!
Related tags :