Agriculture

కర్నూలు రైతుల దుర్భర దుస్థితి. కిలో టమాటాకి రూపాయి కూడా లేదు.

Kurnool District Pathikonda Farmers Throw Tomatoes Away For Less Than One Rupee Profit

ఆరుగాలం కష్టించి పండించిన పంటకు సరైన మద్దతు ధర రాలేదు. కనీసం పంటపై పెట్టిన పెట్టుబడి సైతం దక్కలేదు. స్పందించి మద్దతు ధర కల్పించేలా చర్యలు తీసుకుంటామని చెప్పిన అధికారులూ ఏం చేయలేకపోయారు. చేసేదేమీ లేక నెలలపాటు శ్రమించి పండించిన పంటను రైతులు నేలపాలు చేశారు. ఇదీ కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలోని రైతుల దుస్థితి. వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా పత్తికొండలోని వ్యవసాయ మార్కెట్‌లో టమాటా ధరలు బుధవారం అత్యల్ప స్థాయికి పడిపోయాయి. గత వారం రోజులుగా కిలో టమాటా ధర రూపాయి లేదా అంతకంటే తక్కువగానే ఉంటోంది. టమాటా ధర అంత తక్కువ స్థాయికి పడిపోవడంతో అక్కడి రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న జిల్లా మార్కెటింగ్‌ శాఖ, ప్రాంతీయ స్థాయి అధికారులు పత్తికొండ మార్కెట్‌ను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ధరలపై స్థానిక వ్యాపారులు, రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులు నష్టపోకుండా సరైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి వెళ్లిపోయారు. అధికారులు మార్కెట్‌ను పరిశీలించి 24గంటలు గడవకముందే టమాటా ధర మరింతగా పడిపోయింది. దీంతో కష్టానికి ప్రతిఫలం దక్కకపోవడంతో ఆవేదనకు గురైన రైతులు.. తాము తీసుకొచ్చిన టమాటాలను మార్కెట్‌ యార్డు ఆవరణలోనే కింద పారబోసి నిరసన వ్యక్తం చేశారు. తాము తీవ్ర నష్టాలు చవిచూసున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.