Business

అమెరికాలో మహీంద్రాకు లైన్ క్లియర్-వాణిజ్యం

అమెరికాలో మహీంద్రాకు లైన్ క్లియర్-వాణిజ్యం

* భారత్‌కు చెందిన మహీంద్రా అండ్‌ మహీంద్రాకు అమెరికా రెగ్యులేటరీ అనుకూలంగా తీర్పునిచ్చింది. ది ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ కమిషన్‌ 2020 తర్వాత ఉత్పత్తి చేసే మహీంద్రా రోక్సర్‌ మోడల్‌ ఫియట్‌ క్రిస్లర్‌ ఆటోమొబైల్‌కు చెందిన ఎటువంటి మేధో హక్కులను ఉల్లంఘించలేదని పేర్కొంది. రోక్స్‌ర్‌ పాతమోడళ్ల విక్రయాలపై ఆరునెలల పాటు ఆంక్షలు విధించిన తర్వాత ఈ తీర్పు వెలువడింది.

* రాష్ట్రంలోని వివిధ మద్యం దుకాణాలు బార్ అండ్ రెస్టారెంట్లు నిత్యం పనిచేస్తున్న విధంగానే నూతన సంవత్సర ప్రారంభాన్ని పురస్కరించుకుని ఈనెల 31వతేది కూడా యదావిధంగా నిర్దేశిత సమయాల్లోనే పనిచేస్తాయని రాష్ట్ర బీవరేజెస్ కార్పొరేషన్ ఎండి డి.వాసుదేవ రెడ్డి తెలియజేశారు.రానున్న జనవరి 1వతేదీ నూతన సంవత్సరం సందర్భంగా ఈనెల 31వతేదీన మద్యం దుకాణాలు,బార్ అండ్ రెస్టారెంట్ల వ్యాపార సమయాల్లో మార్పులు ఏమైనా ఉన్నాయాయని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి తన కార్యాలయానికి అనేక ఫోన్ కాల్స్ వస్తున్న నేపధ్యంలో ఆయన దీనిపై స్పష్టత ఇచ్చారు.రాష్ట్రంలో ప్రస్తుతం మద్యం దుకాణాలు ఉదయం 11గం.ల నుండి రాత్రి 9గం.ల వరకు,బార్ అండ్ రెస్టారెంట్లు ఉదయం 10గం.ల నుండి రాత్రి 10గం.ల వరకూ పనిచేస్తున్న విధంగానే ఈనెల 31వతేదీన కూడా అదే సమయాల్లో యదావిధిగా పనిచేస్తాయని ఈసమయాల్లో ఎలాంటి మార్పులు లేవని ఎండి వాసుదేవ రెడ్డి స్పష్టం చేశారు.

* అగ్రిగోల్డ్‌ ఆస్తులు ఈడీ తాత్కాలిక జప్తు. హైదరాబాద్‌ అగ్రిగోల్డ్‌ ఆస్తులను ఈడీ తాత్కాలిక జప్తు చేసింది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఒడిశాలోని రూ.4109 కోట్ల విలువైన అగ్రిగోల్డ్‌ ఆస్తులను అటాచ్‌ చేసింది. ఏపీలోని సుమారు 48 ఎకరాల్లోని హాయ్‌లాండ్‌ ఆస్తులను స్వాధీన పరుచుకుంది.

* ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ కొత్త యూజర్లను చేర్చుకోవడంలో అగ్రస్థానంలో నిలిచింది. అక్టోబర్‌ నెలకు గానూ ఆ కంపెనీ కొత్తగా 36.7 లక్షల మందిని ఆకర్షించింది. మరో టెలికాం సంస్థ జియోలో కొత్తగా 22.2 లక్షల మంది చేరినట్లు ట్రాయ్‌ వెల్లడించింది. ఇదే సమయంలో ఇతర టెలికాం సంస్థలైన వీఐ (వొడాఫోన్‌ ఐడియా) 26.5 లక్షల యూజర్లను, ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ 10వేల మంది చందాదారులను కోల్పోయాయి.

* ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్‌ చెల్లించాల్సిన రూ. 20వేల కోట్ల రెట్రోస్పెక్టెవివ్‌ పన్ను కేసులో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం (ఆర్బిట్రేషన్ కోర్టు‌) ఇచ్చిన తీర్పును భారత్‌ సవాల్‌ చేసినట్లు సమాచారం. ఆర్బిట్రేషన్‌ తీర్పును సవాల్‌ చేసేందుకు ఉన్న 90 రోజుల గడువు గురువారంతో ముగియనున్న నేపథ్యంలో నేడు అప్పీల్‌ దాఖలు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు మరోసారి అదరగొట్టాయి. బ్యాంక్‌, ఫైనాన్స్‌ షేర్ల అండతో వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిశాయి. అదే సమయంలో ఇటీవల రాణించిన ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా షేర్లలో లాభాల స్వీకరణకు మదుపరులు మొగ్గు చూపడంతో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. మొత్తంగా ‘బ్లాక్‌ మండే’ నష్టాలను చివరి మూడు సెషన్ల లాభాలు భర్తీ చేశాయి.