Fashion

నునె-ఉప్పు-మట్టి-గుడ్లు. అందానికి రహస్యాలు.

నునె-ఉప్పు-మట్టి-గుడ్లు. అందానికి రహస్యాలు.

అందాన్ని మెరుగుపరచుకోడానికి వాడే సౌందర్య లేపనాలు, సంప్రదాయ పద్దతులు వేల సంవత్సరాల క్రితం నుంచి ఉన్నవేనని చరిత్ర చెబుతోంది. ఈ తరం వారు వాడుతున్న సౌందర్య లేపనాలు గతంలో మన పూర్వీకులు వాడినవే అని మనకు తెలియని విషయం. చర్మ సౌందర్యానికి, మచ్చలు నివారించేందుకు ఎలిజబెత్‌ రాణి కాలంలో ఒక రకమైన చూర్ణాన్ని మొహానికి రాసుకునేవారు. అశాస్త్రీయమైన పద్దతులను పాటించడం వల్ల మొహాలపై మచ్చలు పడేవి. ఆ తరువాతి కాలంలో పాదరసంతో మొహం కడుక్కునేవారు. కొన్ని సార్లు ఇవి పనిచేసేవి, ఇంకొన్నిసార్లు వికటించేవి. ఏది ఏమైనా గతం నుంచి వాడుతూ వస్తున్న సౌందర్య చిట్కాలు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. వాటి గురించి తెలుసుకుందాం..
1. కొబ్బరి నూనె
చర్మ వ్యాధుల్ని నివారించేందుకు, బాక్టీరియా, ఫంగల్‌ వంటి వాటికి నివారిణిగా కొబ్బరి నూనెను వాడతారు. సౌందర్య సాధనాల్లో దీని వాడకం ఈ మధ్య బాగా పెరిగింది. అయితే దీని వాడకం వందల సంవత్సరాల నుంచి అనాదిగా వస్తుంది. సంస్కృతంలో కొబ్బరి చెట్టుకు ఉన్న పేరును అనువదిస్తే.. ‘బతకడానికి అన్నీ ఇచ్చే చెట్టు’ అనే అర్థం వస్తుంది. ఇప్పట్లో తలకు కొబ్బరి నూనెతో మాస్క్‌ వేయడం బ్యూటీ పార్లర్‌లో చూస్తున్నాం. గతంలో చర్మానికి అతినీలలోహిత కిరణాలు తగతకుండా, చర్మానికి నేరుగా సూర్యరశ్మి తాకకుండా కొబ్బరి నూనెను ఉపయోగించేవారు. చర్మం విటమిన్‌-డి అందేందుకు కొబ్బరి నూనె ఉపయోగపడుతుంది. వందల సంవత్సరాల నుంచి ఈ పద్దతులు అవలంభిస్తున్నారు.
2. సముద్రపు ఉప్పు
సౌందర్య లేపనంగా, ఔషధంగా పురాతన కాలం నుంచి వాడుకలో ఉన్న మరో సాధనం సముద్రపు ఉప్పు. గాయాలు మానేందుకు యంటీ సెప్టిక్‌గా, పదార్థాలను నిల్వ ఉంచేందుకు దీన్ని మన పూర్వీకులు విరివిగా ఉపయోగించేవారు. చర్మంపై మృత కణాలను తొలగించుకునేందుకు, చర్మం మెరిసేలా చేసేందుకు సముద్రపు ఉప్పుతో ఫేస్‌ మాస్క్‌ వేసుకునేవారు. గ్రీకులు సముద్రపు నీరు, ఉప్పుతో మసాజ్‌ చేయించుకునేవారు. అప్పట్లో వాడుకలో ఉన్న ఒక రకమైన హైడ్రో థెరపీకి సముద్రపు నీటితో నింపిన చిన్న కొలనును ఉపయోగించేవారు.
3. ఆలివ్‌ నూనె
దాదాపు ఐదు వేల సంవత్సరాల క్రితం నుంచి ఆలివ్‌ నూనెను సౌందర్య ఉత్పత్తుల్లో వాడుతున్నట్లు ఆధారాలున్నాయి. పురాతన గ్రీకులు, రోమన్‌లు, ఈజిప్షియన్లు తమ అందాలను మెరుగుపరచుకునేందుకు దీన్ని వాడేవారు. దీంట్లో విటమిన్‌- ఇ అధిక మోతాదులో ఉంటుంది. దీన్ని చర్మానికి, గోళ్లకు, జుట్టుకు పట్టించి, దీనిలో ఉన్న ఔషధ గుణాలను పొందేవారు. ఇది చర్మానికి సాగే గుణం వచ్చేలా చేస్తుంది. చర్మానికి ఉండే సహజ నూనెలను బయటకు పోనివ్వకుండా కాపాడుతుంది. జుట్టు ప్రకాశవంతంగా ఉండేందుకు తోడ్పడుతుంది. గోళ్లు పొడిబారకుండా మెరిసేలా చేస్తుంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకూ దీని వాడకం కొనసాగుతోంది.
4. వ్యాక్సింగ్‌
క్రీస్తు పూర్వం 1900 సంవత్సరం నుంచే వ్యాక్సింగ్‌ అందుబాటులో ఉందనేది నమ్మలేని నిజం. అప్పట్లో దీన్ని పర్షియన్‌ వ్యాక్సింగ్‌ అనేవారు. చెరకు నుంచి తీసిన మొలాసిస్‌, నిమ్మరసం, తేనెలను ఉపయోగించి మైనం వంటి పదార్థం తయారు చేసేవారు. దీన్ని ఉపయోగించి చర్మంపై ఉన్న వెంట్రుకలను తొలగించేవారు. ఇప్పుడు బ్యూటీ పార్లర్లలో వ్యాక్సింగ్‌ పద్ధతి పురాతన కాలం నుంచి వారసత్వంగా వచ్చిందే!
5. తేనె
సౌందర్య లేపనాల్లో ఉపయోగించే తియ్యని పదార్థం తేనె. దీంట్లో యంటీ ఆక్సిండెంట్లు ఎక్కువగా ఉంటాయి. గాయాలు మానేందుకు యాంటీ సెప్టిక్‌గా కూడా తేనెను ఉపయోగించడం పురాతన కాలం నుంచి వస్తుంది. ఈజిప్షియన్లు వైద్యంతో దీన్ని విరివిగా వాడేవారు. చర్మ సౌందర్యానికి కూడా దీన్ని వినియోగించేవారు. చర్మంపై వచ్చే మొటిమలను తగ్గించేందుకు తేనెతో చేసిన లేహాన్ని మొహానికి ప్యాక్‌లా వేసుకునేవారు. చర్మాన్ని, జుట్టును మృదువుగా చేసేందుకు తేనెను వాడేవారు.
6. కుంకుమ పువ్వు నూనె
ఈజిప్షియన్ల రాణి క్లియోపాత్రా కుంకుమ పువ్వు నూనె, పాల మిశ్రమంతో స్నానం చేసేదట. ఆమె అందానికి రహస్యం ఇదేనని అప్పట్లో ప్రజలు చెప్పుకునేవారట. ఈ సౌందర్య లేపనం వేల సంవత్సరాల నుంచి వినియోగంలో ఉంది. మన దేశంలోని పురాతన ఆయుర్వేద పద్ధతుల్లో దీని ప్రస్థావన ఉంది. క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల క్రితం నుంచి కుంకుమ పువ్వుతో తీసిన నూనెను వాడుతున్నారని అంచనా. ఈ సౌందర్య లేపనం ధరలు చాలా ఎక్కువ. ఫలితంగా దీని వాడకం ఈ కాలంలో చాలా వరకూ తగ్గింది. మొరాకో, భారత దేశంలో దీన్ని వాడేవారని తెలుస్తోంది.
7. బంక మట్టి
ఇప్పట్లో విరివిగా వాడుకలో ఉన్న అనేక ఫేస్‌మాస్కులు బంక మట్టితో తయారు చేసేవే. దీన్ని నేరుగా మొహానికి మాస్కులా వేయవచ్చు. మృత సముద్రం నుంచి తీసిన మేలిమి బంకమట్టితో తయారు చేసిన ఫేస్‌ మాస్కును క్లియోపాత్రా వాడేదని తెలుస్తుంది. ఆమె అందానికి ఇది కూడా ఒక రహస్యమట!
8. గుడ్లు
అతి తక్కువ ఖర్చుతో మనకు అందుబాటులో ఉండే సౌందర్య సాధనం గుడ్డు. వేల సంవత్సరాల నుంచి ఆహారంలో గుడ్డు భాగంగా ఉంటోంది. అందాన్ని మెరుగు పరచుకోడానికి దీన్ని పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. తలకు గుడ్డు సొన పెట్టుకుని స్నానం చేయడం ఎప్పటినుంచో వస్తోంది. పచ్చ సొనకు తేనెను కలిపి చర్మానికి రాస్తే కాంతివంతంగా మెరుస్తుంది. గుడ్డును సౌందర్య ఉత్పత్తుల్లో వాడటం వేల సంవత్సరాల నుంచి వస్తున్న సంప్రదాయ పద్దతి అని చెప్పవచ్చు.