కరోనా సంక్షోభం దెబ్బకు ఈ ఏడాది తొలి త్రైమాసికంలో భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు.. ఏప్రిల్ నుంచి శరవేగంగా పుంజుకున్నాయి. ఈ మెరుపు ర్యాలీతో దేశీయ కార్పొరేట్ రంగ ప్రమోటర్లలో మరో 10 మంది డాలర్ బిలియనీర్లు (సుమారు రూ.7,400 కోట్ల ఆస్తి)గా ఎదిగారు. 2019 డిసెంబరు చివరి నాటికి దేశంలో 80 మంది బిలియనీర్లుండగా.. ప్రస్తుతం ఈ సంఖ్య ఆల్‌టైం గరిష్ఠ స్థాయి 90కి పెరిగింది. ఈ ఏడాదిలో బిలియనీర్ల మొత్తం సంపద 48,300 కోట్ల డాలర్లకు (సుమారు రూ.35.50 లక్షల కోట్లు) చేరుకుంది. గత ఏడాది డిసెంబరు 31 నాటికి నమోదైన వీరి మొత్తం సంపద 36,400 కోట్ల డాలర్లతో పోలిస్తే 33 శాతం అధికం. మరిన్ని విషయాలు.. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ 8,750 కోట్ల డాలర్ల (రూ.6.44 లక్షల కోట్లు) దేశ సంపన్నుల జాబితాలో అగ్ర స్థానంలో ఉన్నారు. ఈ 12 నెలల్లో ఆయన సంపద 37.2 శాతం పెరిగింది. అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ, ఆయన కుటుంబ సభ్యుల సంపద ఏడాది కాలంలో 2,000 కోట్ల డాలర్ల నుంచి 4,100 కోట్ల డాలర్లకు ఎగబాకింది. అంటే, రెట్టింపునకు పైగా పెరిగింది. ఈ ఏడాది అత్యధిక సంపద వృద్ధిని నమోదు చేసుకున్న ప్రమోటర్లు వీరే. పతంజలి ఆయుర్వేద, రుచి సోయా ప్రమోటర్లైన యోగా గురువు బాబా రాందేవ్, ఆచార్య బాలకృష్ణ సంపదలో అందరికంటే అత్యధిక వృద్ధి నమోదైంది. గత ఏడాది చివరి నాటికి రూ.100 కోట్ల స్థాయిలో ఉన్న వారి ఆస్తి.. ఈ ఏడాది కాలంలో 18,108 శాతం వృద్ధి చెంది దాదాపు రూ.20,000 కోట్లకు చేరుకుంది. బీఎ్‌సఈ-500, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలకు చెందిన 807 లిస్టెడ్ కంపెనీల ప్రమోటర్ల మొత్తం సంపద ఈ ఏడాదిలో 56,600 కోట్ల డాలర్లకు (రూ.41.6 లక్షల కోట్లు) చేరుకుంది. గత ఏడాది డిసెంబరు చివరినాటికి నమోదైన 44,000 కోట్ల డాలర్ల(రూ.31.3 లక్షల కోట్లు)తో పోలిస్తే 33 శాతం అధికం. దేశంలోని అత్యధిక ధనవంతులైన 10 మంది ప్రమోటర్ల సంపద ఈ ఏడాదిలో 7,600 కోట్ల డాలర్లు (రూ.6 లక్షల కోట్లు) పెరిగింది. లిస్టెడ్ కంపెనీల ప్రమోటర్ల మొత్తం సంపదలో 44.4 శాతం వాటా ఈ పది మందిదే. 2019 డిసెంబరు నాటికి ఈ వాటా 40 శాతంగా ఉండగా.. 2018 మార్చిలో 28 శాతంగా ఉంది.
37.2 శాతం పెరిగిన అంబానీ ఆస్తులు
Related tags :