స్కూళ్లల్లో పిల్లలకు రకరకాల సబ్జెక్టులు ఉంటాయి. ఇంగ్లిష్, తెలుగు, హిందీ, సంస్కృతం, ఫ్రెంచి ఇలా రకరకాల భాషలు నేర్పిస్తుంటారు. సిలబస్‌లో అది భాగం కూడా. అయితే జీవితంలో ఎంతో అవసరమయ్యే డబ్బు భాషను మాత్రం ఎవ్వరూ నేర్పించరు. మనకు మనమే నేర్చుకుంటున్నాం. ఈ క్రమంలో మనం ఎదుర్కొన్న కష్టాలు మన పిల్లలు పడకుండా చూసుకోవాలంటే వారికి డబ్బు పట్ల చిన్నప్పటి నుంచే అవగాహన కల్పించడం మంచిది. ఎలాగంటారా… ఇప్పుడు చూద్దాం…
*** ఎప్పుడు ఎలా మొదలుపెట్టాలి…
వస్తువులను కొనాలంటే డబ్బు ఇవ్వాలి అన్న సంగతి పిల్లలకు తెలిసినప్పటి నుంచి వారికి మనీ మేనేజ్‌మెంట్ గురించి చెప్పడం ప్రారంభించాలి. పిల్లల వయసును బట్టి వారికి డబ్బు విలువను తెలియజేసేందుకు స్థాయిలు ఉంటాయి. ఇప్పటి పిల్లలకు డబ్బు అంటే ఏమిటో తెలియనంత అమాయకులేం కాదు. దాన్ని సరైన రీతిలో ఎలా వాడుకోవాలో చెప్పడమే పెద్దలుగా మన కర్తవ్యం.
*** ఎలా వ్యవహరించాలి…
పిల్లలకు చాక్లెట్లు, బిస్కట్లు, ఆట బొమ్మలు కొనివ్వకుండా నేరుగా డబ్బు ఇవ్వడం ఒక పద్ధతి. సాధారణంగా పెద్దవాళ్లు పిల్లలకు ఇలా డబ్బు ఇచ్చి మర్చిపోతుంటారు. ఈ సారి ఇలా చేయండి. వారికి ఒక పుస్తకం ఇచ్చి … దాంట్లో మీరు ఎంత డబ్బు ఇచ్చింది రాయమనండి. ఇక పిల్లలు ఏయే వస్తువులు కొన్నారు… దానికి ఎంత ఖర్చు అయ్యింది ఆ పుస్తకంలో రాయమనండి. దీని వల్ల వారికే తెలిసి వస్తుంది. దేనికి ఎంత ఖర్చు పెట్టామో.
*** సింపుల్‌గా చెప్పేయండి
డబ్బు, పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్, సేవింగ్స్, కరెంట్ అకౌంట్, ఇన్వెస్ట్‌మెంట్స్, ఇంట్రెస్ట్ రేట్స్, కంపౌండ్ ఇంట్రెస్ట్ … ఇలాంటి పదాలన్నీ మనకు సులువుగానే ఉండొచ్చు గాక. పదేళ్ల పిల్ల వాడిని అడగండి. ఇందులో మహా అంటే రెండు, మూడు పదాలు తెలుసు అని చెప్తాడు. ఇక ద్రవ్యోల్బణం అనే మాట అంటేనే అదేంటి కొత్త ఆటబొమ్మనా అని అడిగినా ఆశ్చర్యపోనవసరంలేదు. కాబట్టి పిల్లలకు ఆర్థిక పాఠాలు చెప్పేటప్పుడు సాధ్యమైనంత సింపుల్‌గా చేప్పేందుకు ప్రయత్నించండి.
*** పొదుపు మంత్ర
రేపటి కోసం ఏమైనా పెద్ద వస్తువు కొనాలంటే ఇప్పటి నుంచే దాచిపెట్టుకోవాలి. ఇదే పాఠాన్ని పిల్లలకు నేర్పించాలి. ఎలా అంటే వారు ఓ మంచి సైకిల్ కొనివ్వమని అడుగుతారనుకుందాం. దానికి సుమారు రూ.5వేలు అయితే … మీ దగ్గర అంత డబ్బు ఉన్నా సరే వెంటనే కొనివ్వకండి. నెలకు రూ.వెయ్యి ఇస్తూ వెళ్లండి. మీ పిల్లవాడికి చెప్పండి. 5 నెలలు భద్రంగా దాచిపెట్టుకుంటే సైకిల్ సొంతమవుతుందని. కొందరు దీనికి ఏడుపు మొహం పెడతారు. ఒక 4నెలలు గడిచాక సడెన్ సర్‌ప్రైజ్ ఇవ్వండి. నాలుగు వేల రూపాయలు మీ పిల్లవాడి దగ్గర్నుంచి తీసుకొని మీరొక రూ.1,000 జతచేసి సైకిల్ కొనిపించండి. కాస్త పెద్ద పిల్లలు అయితే వడ్డీ కాన్సెప్ట్‌ని వివరించండి. నెల నెలా పొదుపు చేస్తే అదనంగా వడ్డీ వస్తుందని చెప్పండి. ఇలా సైకిల్ కోసం దాచిన రూ.4వేలకు వడ్డీగా రూ.వెయ్యి మీరిస్తున్నట్టుగా చెప్పండి. ఆ తర్వాత నిదానంగా బ్యాంకుల్లో దాచే డబ్బుకు, ఫండ్లలో పెట్టుబడిపై వడ్డీ ఎలా వస్తుందో వివరించే ప్రయత్నం చేయండి.
*** బ్యాంకునకు తీసుకెళ్లండి
మీ పిల్లల వయసు 10ఏళ్లు దాటిందా? అయితే ఈ సారి బ్యాంకు వెళుతుంటే కూడా వారినీ తీసుకెళ్లండి. అక్కడ మీరు డబ్బులు ఎలా డిపాజిట్ చేస్తున్నది. ఏ ఫారం నింపుతున్నది. డబ్బు విత్‌డ్రా చేసుకునేందుకు ఎలాంటి ఫారం నింపుతున్నదీ తెలియజేయండి. పొదుపు ఖాతా అంటే ఏమిటి, దాని ఉపయోగాలేమిటో చెప్పండి. మీ బ్యాంకు అనుమతిస్తే వారి పేరిట బ్యాంకు ఖాతా ప్రారంభించి దాంట్లో కొంత సొమ్మును జమచేయించండి. ఏటీఎమ్ కార్డు అలవాటు చేయండి. ఏటీఎమ్ కార్డును అవసరానికి ఎలా వాడాలో వివరించండి. పిన్ నెంబరు ఎవ్వరికీ చెప్పొద్దు అన్న సంగతిని పదే పదే చెప్పండి.
*** డిజిటల్ వ్యాలెట్ల గురించి…
పాత పెద్ద నోట్ల రద్దు తర్వాత డిజిటల్ వ్యాలెట్ల హవా కొనసాగుతోంది. గతేడాది డబ్బు కోసం ఎంత ఇబ్బంది పడిందీ మీరు అనుభవించి ఉంటారు. పిల్లలకు కూడా ఈ విషయాలను వివరించండి. అలాగే మొబైల్ వ్యాలెట్లలో డబ్బు ఎలా నింపుతున్నారో చెప్పండి. పదేళ్లు దాటిన పిల్లలైతే వారి చేత ఆ ట్రాన్సాక్షన్స్ చేయించండి. వ్యాలెట్లతో ఏయే బిల్లులు చెల్లించొచ్చు చెప్పండి. లేదా వారిని పరిశోధించి మీకు చెప్పమనండి. వీలైతే వారితోనే బిల్లు చెల్లించేలా చూడండి. దీని వల్ల వారికి ఇంటిని నడిపించేందుకు నెల నెలా ఎంత డబ్బు ఖర్చు అవుతుంది ఒక అవగాహన ఏర్పడుతుంది.
*** ద్రవ్యోల్బణం గురించి కూడా…
ద్రవ్యోల్బణం అనే మాట పిల్లలకు విడమరిచి చెప్పాలంటే చాలా కష్టం. అయితే దాన్ని సులభంగా ఇలా చెప్పవచ్చు. ఏడాది కిందట మీరు మీ అబ్బాయికి మంచి డ్రెస్ లేదా ఆట బొమ్మ కొనిచ్చారు. దాని ధరను గుర్తుచేయండి. ఇప్పుడు అదే వస్తువు రూ.100 లేదా రూ.50 పెరిగిందని చూపించండి. ఇలా కొంత కాలానికి వస్తువుల విలువ పెరుగుతూ పోతుందని… ఇదే డబ్బుతో వచ్చే ఏడాది మనకు కావాల్సిన వస్తువు కొనలేమని చెప్పండి. ఈ ప్రభావాన్నే ద్రవ్యోల్బణం అంటామని వారికి అర్థమయ్యేలా చెప్పండి. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనేందుకు మార్గాలేమైనా ఉన్నాయా అని ఆలోచించమనండి. వాళ్లు చెప్పలేకపోతే పొదుపు, పెట్టుబడుల గురించి చెప్పండి. బ్యాంకులో డబ్బు వేస్తే వడ్డీ వస్తుంది. దీంతో ద్రవ్యోల్బణాన్ని అధిగమించవచ్చని తెలియజేయండి.
డబ్బును అలవాటు చేయడం వరకు మీ పని. ఇలా చిన్నప్పటి నుంచే పిల్లల్లో క్రమశిక్షణ ఉండేలా చేస్తే పెద్దయ్యాక వాళ్లు తమ సంపదను సమర్థంగా నిర్వహించుకోగలుగుతారు. మా తల్లిదండ్రులు మాకు చక్కని ఆర్థిక పాఠాలు నేర్పించారని భవిష్యత్‌లో గుర్తుతెచ్చుకుంటారు. డబ్బుతో పాటు మానవతా విలువలు నేర్పించడానికి సమ ప్రాధాన్యం ఇవ్వండి. అంతే కాదు ప్రపంచంలో డబ్బు అన్ని ఆనందాలను కొనలేదు అన్న విషయాన్ని వారికి తెలిసేలా చేయడం మన బాధ్యత.