ఇకపై తెలంగాణలో నియంత్రిత సాగు విధానం అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఏ పంట వేయాలనే విషయంలో ఇకపై ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయదని స్పష్టం చేసింది. ఏ పంటలు వేయాలో రైతులే నిర్ణయించుకోవాలని సూచించింది. మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసుకున్న రైతు వేదికల్లోనే అన్నదాతలు, అధికారులు తరచూ సమావేశమై నిర్ణయం తీసుకోవాలని కోరింది. మార్కెట్ పరిస్థితులను బట్టి ఏ పంట వేయాలో చర్చించుకోవాలని పేర్కొంది. పంట ఎక్కడ అమ్ముకుంటే మంచి ధర వస్తుందో అక్కడే విక్రయించుకోవచ్చని.. మద్దతు ధర వచ్చేలా వ్యూహం రూపొందించుకోవాలని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో పంటల కొనుగోళ్లు సహా ఇతర సాగు అంశాలు, యాసంగి పెట్టుబడి కోసం రేపటి నుంచి ‘రైతుబంధు’ కింద ఆర్థిక సహాయం చేయనున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పంటల కొనుగోళ్లతో ప్రభుత్వానికి భారీ నష్టం వచ్చినట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి రూ.7,500 కోట్ల నష్టం వచ్చిందని చెప్పారు. కేవలం ధాన్యం కొనుగోళ్లతోనే రూ.3,935 కోట్లు, మక్కల కొనుగోళ్లతో రూ.1,548 కోట్లు, కందులతో రూ.413 కోట్ల నష్టం వచ్చిందని వివరించారు. కరోనా దృష్ట్యా రైతులు నష్టపోకూడదనే గ్రామాల్లో పంట కొనుగోళ్లు చేపట్టామని అధికారులు వివరించారు. వచ్చే ఏడాది నుంచి గ్రామాల్లో పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం సాధ్యపడదని అధికారులు తెలియజేశారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 61.49లక్షల మంది రైతులకు రూ.7,515కోట్లు పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎకరాకు రూ.5వేల చొప్పున 1.52కోట్ల ఎకరాలకు ఆర్థిక సహాయం అందిస్తామని.. అర్హులైన రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయనున్నట్లు వెల్లడించింది.
ఇక…తెలంగాణా వ్యవసాయంలో ప్రభుత్వం వేలుపెట్టదు
Related tags :