టాంటెక్స్ ఆధ్వర్యంలో నెలనెలా తెలుగు వెన్నెల ధారావాహిక ఈ ఏడాది చివరి కార్యక్రమంగా సాహిత్యాభిమానులందరి మధ్య ఘనంగా నిర్వహించారు. సాహితి వేముల, సిందూర వేముల “వినాయకా నిను వినా బ్రోచుటకు” అన్న రామకృష్ణ భాగవతార్ గీతాలాపనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉస్మానియా విశ్వ విద్యాలయ పూర్వ అధ్యాపకురాలు డాక్టర్ కృష్ణకుమారి “దక్షిణ భారతదేశంలో స్త్రీ వాగ్గేయకారులు” అన్న అంశంపై ప్రసంగించారు. కన్నడ నాటి హన్నమ్మ, రఘనాథనాయకుని సభలలో ప్రభవిల్లిన తెలుగు ప్రతిభా మూర్తులు రామభధ్రాంబ, పసుపులేటి రంగాజమ్మలను సైతం గుర్తు చేశారు. శాంతి స్వభావం, సమతుల్యత గుణాలు ప్రకృతి వరప్రసాదంగా పొందిన స్త్రీలు తమ రచనలలో లాలిత్యము, మాతృ ప్రేమ, భక్తి తత్వ సుగంధ పరిమళాలను పంచారని అన్నారు. “మనతెలుగు సిరి సంపదలు” ధారావాహిక లో భాగంగా యు.నరసింహారెడ్డి ఆధునిక కవుల ఉక్తులు సూక్తులు అన్న శీర్షిక క్రింద బసవరాజు, విశ్వనాథ, సోమసుందర్, దాశరథి వంటి వారి ప్రసిద్ద కవితాపంక్తులను ప్రస్తావించారు. ఉపద్రష్ట సత్యం “పద్య సౌగంధం” శీర్షికన పారజాతాపహరణ కృతికర్త ముక్కు తిమ్మనార్యుని ముద్దు పలుకులను ఉటంకించారు. జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం “మాసానికో మహనీయుడు” అనే శీర్షక కొనసాగింపుగా, డిసెంబరు మాసంలో జన్మించిన తెలుగు సాహితీ మూర్తులు నార్ల,ఉన్నవ, కట్టమంచి, బలిజేపల్లి వంటి వారిని ప్రస్తుతించారు. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం అధ్యక్షులు కృష్ణారెడ్డి కోడూరు ముఖ్య అతిధి ఉస్మానియా విశ్వ విద్యాలయ పూర్వ అధ్యాపకురాలు డాక్టర్ కృష్ణకుమారికి సభికులకు ధన్యవాదాలు తెలిపారు.
“దక్షిణ భారతదేశంలో స్త్రీ వాగ్గేయకారులు” అంశంపై టాంటెక్స్ సదస్సు
Related tags :