అరణ్యాల్లో ఉండే మర్కటాలు జనాలపై పడి అల్లకల్లోలాన్ని సృష్టిస్తున్నాయి. పల్లెలు, పట్టణాల్లో ఇళ్లలోకి చొరబడి మనుషులను గాయపరుస్తున్నాయి. చేతికి దొరికిన వస్తువులను ఎత్తుకెళుతున్నాయి. ఇళ్లలోని వారు బయట అడుగు పెట్టాలంటేనే హడలిపోతున్నారు. పొలాల్లో పంటలను నాశనం చేస్తున్నాయి. ఈకారణంగా కొన్నిచోట్ల రైతులు కూరగాయల సాగు వదిలేస్తున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లో ఎన్నికల ఎజెండాగా మారిన కోతుల సమస్య పరిష్కారం.. రాష్ట్రంలోని కొన్ని గ్రామాల్లో ఎన్నికల ప్రచారాంశం అవుతోంది. పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం.. పచ్చదనం తగ్గడం. ఆహారం దొరక్కపోవడం. అడవిలో మేడి, తునికి వంటి పండ్ల చెట్లు తగ్గిపోతుండటం కోతులు ఊళ్లలోకి రావడానికి కారణమని పలువురు చెబుతున్నారు. కొత్తగూడెం జిల్లాలో లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, పాల్వంచ, బూర్గంపాడు, అశ్వారావుపేట, చంద్రుగొండ, దమ్మపేట, దుమ్ముగూడెం, జూలూరుపాడు, ములకలపల్లి, టేకులపల్లి, ఇల్లెందు మండలాల్లో కోతుల బెడద తీవ్రంగా ఉంది. పత్తి, కూరగాయల పంటలకు తీవ్రనష్టం కలిగిస్తున్నాయి. వరి కంకులను తెంపేస్తున్నాయి. జిల్లాలో ఈ ఏడాది 437 మంది కోతుల దాడిలో గాయపడ్డారు. వీటిని పట్టుకునేందుకు కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీలు రూ.5 లక్షలు, రూ.3.80 లక్షల చొప్పున వ్యయం చేశాయి.
* పలు జిల్లాల్లో కోతుల బెడద ఎక్కువగా ఉంది. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో 3 వేల కుటుంబాలున్నాయి. ఇంటికి రూ.50 చొప్పున రూ.1.50 లక్షలు సేకరించి గ్రామాభివృద్ధి కమిటీతో ఈ మర్కటాల్ని పట్టిస్తున్నారు. సమస్య పునరావృతమైనపుడుప్రజలు చందాలువేసుకుంటున్నారు.
* హైదరాబాద్‌కు సమీపంలోని మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలో కూరగాయల సాగు ఎక్కువ. కోతుల బెడదను తప్పించుకునేందుకు గూడూరులో రైతులు సొంత ఖర్చుతో బోను తయారుచేశారు. కోతుల్ని అడవిలో వదిలిపెట్టినా తిరిగి వస్తున్నాయి.
* మహబూబాబాద్ జిల్లాలో డోర్నకల్ మండలంలో 2018లో 503 మంది, 2019లో 598 మంది కోతుల దాడులకు గురయ్యారు. వాటిని భయపెట్టడానికి పులి బొమ్మలను వాడుతున్నారు.
* వికారాబాద్ జిల్లాలో పంటల్ని కాపాడుకునేందుకు రైతులు దీపావళి బాంబులు పేలుస్తున్నారు. చేను చుట్టూ వలలు ఏర్పాటు చేసుకుంటున్నారు.
* మహబూబాబాద్ మండలం ముడుపుగల్‌లో ఇళ్లపై ముళ్లకంపలు కనిపిస్తాయి. గ్రామంలో 30 మందికి పైగా గాయపడ్డారు.