Business

రేపు SBI గృహాల ఈ-వేలం-వాణిజ్యం

రేపు SBI గృహాల ఈ-వేలం-వాణిజ్యం

* దేశంలోనే అతి పెద్దదైన స్టేట్‌బ్యంక్‌ ఆఫ్‌ ఇండియా రేపటి నుంచి మెగా ప్రాపర్టీ వేలాన్ని ప్రారంభించనుంది. తాకట్టులో ఉన్న ఆస్తులను ఈ ఎలక్ట్రానిక్‌ విధానంలో వేలం వేయనుంది. దీనిలో వాణిజ్య, గృహ సముదాయలు ఉన్నాయి. ఈ విషయాన్ని ఎస్‌బీఐ ట్విటర్‌లో ప్రకటించింది. మార్కెట్‌ ధరల కంటే కొంచె చౌకగా ఇళ్లను కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది మంచి అవకాశమని పేర్కొంది.

* దేశీయ మార్కెట్లు వరుసగా ఐదో రోజూ లాభాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెన్స్‌ 259 పాయింట్లు లాభపడి, 47,613 వద్ద ముగియగా, 59 పాయింట్ల లాభంతో నిఫ్టీ 13,932 వద్ద స్థిరపడింది.

* యాంట్‌ ఫైనాన్షియల్‌ ఐపీవో వ్యవహారం అలీబాబా సంపదను హారతి కర్పూరం చేస్తోంది. అలీబాబా వ్యవస్థాపకుడు జాక్‌మా సలహాలు ఇవ్వబోయి చైనా పాలకుల ఆగ్రహానికి గురైన ఫలితం అనుభవిస్తున్నాడు. చైనా నియంత్రణ సంస్థలు వివిధ కారణాలు చూపిస్తూ యాంట్‌ ఫైనాన్షియల్‌ 10 బిలియన్‌ డాలర్ల ఐపీవోను ఆపేశాయి. ఆయన కంపెనీ అంతకు పదింతలు విలువను కోల్పోయింది. వరుసగా రెండు ట్రేడింగ్‌ సెషన్ల అలీబాబా సంపద 116 బిలియన్‌ డాలర్ల మేరకు తుడిచిపెట్టుకుపోయింది. అంటే మన కరెన్సీలో రూ.8.5 లక్షల కోట్లు అన్నమాట.

* ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం స్కోడా భారత్‌లో తన మోడల్స్‌ ధరలను పెంచనుంది. ఈ పెంపు 2.5శాతం వరకు ఉంటుంది. 2021 జనవరి ఒకటి నుంచి ఇది అమల్లోకి రానుంది. ముడిపదార్థాల ధరలు పెరగడంతో ఈ పెంపు తప్పలేదని కంపెనీ పేర్కొంది. ముడిపదార్థాల ధరలు చాలా కంపెనీలపై ప్రభావం చూపాయి. ఇప్పటికే పలు ఆటో మొబైల్‌ కంపెనీలు జనవరి 1 నుంచి ధరలు పెంచుతామని ప్రకటించాయి.

* ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ బజాజ్‌ ఆటో అరుదైన మైలురాయిని చేరుకుంది. మంగళవారం స్టాక్‌ మార్కెట్లలో ఈ కంపెనీ షేర్లు రాణించడంతో రూ. లక్షకోట్ల మార్కెట్‌ విలువ గల సంస్థల క్లబ్‌లో చేరింది. ఈ ఘనత సాధించిన నాలుగో ఆటోమొబైల్‌ సంస్థ ఇది. బజాజ్‌ ఆటో కంటే ముందు మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్‌ మహీంద్రా, టాటా మోటార్స్‌ కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి.