చైనాకు భూదాహం ఎక్కువ.. దానికి నైతిక విలువలు.. విచక్షణ ఏవీ ఉండవు. సాధారణంగా ఒక ప్రదేశాన్ని గుప్పిట పెట్టుకోవడానికి ఏ దేశమైనా ఏం చేస్తుంది..? సైనిక బలగాలను ప్రయోగిస్తుంది.. లేదా అభివృద్ధి చేస్తామని ఆశపెడుతుంది..? అదీ కాకపోతే ప్రజలకు తాయిలాలను ప్రకటిస్తుంది. కానీ, చైనా అలాకాదు.. ఓ బాలుడిని కిడ్నాప్ చేసింది..! హా.. నిజమే..! ప్రపంచంలో రెండో ఆర్థిక మహాశక్తి చేసిన నిర్వాకం ఇదీ..! ఆ బాలుడి స్థానంలో తన కీలుబొమ్మ వంటి వ్యక్తిని ప్రవేశపెట్టింది. ఇలాంటి పనే మరోసారి చేయాలని చూస్తోంది. దీంతో ఈ సారి అమెరికా రంగంలోకి దిగింది. చైనా ఎక్కువ ఉత్సాహం చూపించకుండా అడ్డుకొనేలా ఓ బిల్లును ప్రవేశపెట్టింది. నిన్న ట్రంప్ దానిపై సంతకం చేశారు. మన పొరుగున ఉన్న టిబెట్ ఈ ఉత్కంఠభరిత పరిణామాలకు కేంద్రంగా మారింది. తాజాగా అమెరికా ‘ది టిబెటియన్ పాలసీ అండ్ సపోర్ట్ యాక్ట్ 2020’ అమల్లోకి రానుంది. ఈ ఏడాది మే 20వ తేదీన చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఓ కీలక ప్రకటన చేశారు. టిబెట్‌కు చెందిన 11వ పంచయిన్ లామ గెధున్ చొయికి నైమా క్షేమ సమాచారం అది. ‘‘బాలుడిగా ఉన్నప్పుడు అతడికి తప్పనిసరి విద్యను అందించాం. ఇప్పుడు ఆ యువకుడు గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు. ఉద్యోగం కూడా లభించింది. 31ఏళ్ల అతడు గానీ.. అతడి కుటుంబం గానీ ప్రస్తుతం ఉన్న ప్రశాంత పరిస్థితులను వదులుకోవాలనుకోవడం లేదు’’ అని పేర్కొన్నారు. టిబెట్‌లో 10వ పంచయిన్ లామా వారసుడిగా గుర్తింపు పొందిన ఆరేళ్ల బాలుడు గెధున్ చొయికి నైమాను సరిగ్గా 25 ఏళ్ల క్రితం చైనా సైన్యం కిడ్నాప్ చేసింది. అప్పటి నుంచి అతడి ఆచూకీ ఎవరికీ తెలియదు. పంచయన్ లామా అంటే దలైలామాకు ముందు ఉండే పదవి. అంటే టిబెట్ బౌద్ధుల్లో రెండో అత్యున్నత స్థానం.
1950లో చైనా టిబెట్‌పై ఆక్రమణ ప్రారంభించింది. ఆ తర్వాత చాలా ప్రాంతాలను కలిపేసుకొని.. మిగిలిన వాటికి స్వయం ప్రతిపత్తి ఇచ్చింది. 1959లో టిబెట్ తిరుబాటు చేసింది.. కానీ, అది విఫలం కావడంతో టిబెటియన్ల బౌద్ధ మత గురువు దలైలామా భారత్‌కు శరణార్థిగా వచ్చారు. ఆయన ధర్మశాలలో ఆశ్రయం పొందుతున్నారు. ఆయన తర్వాతి స్థానంలో ఉన్న 10వ పంచయిన్ లామా లోబ్సాంగ్ గ్యాల్సెన్ మాత్రం టిబెట్‌లోనే ఉండిపోయారు. అదే సమయంలో చైనా సాంస్కృతిక విప్లవం పేరుతో టిబెట్ సంస్కృతిని ధ్వంసం చేయడం మొదలుపెట్టింది. మఠాలు, రచనలను ధ్వంసం చేసింది. మరోపక్క చైనా ఆగడాలను దలైలామా ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు. దీంతో భవిష్యత్తులో దలైలామా స్థానాన్ని కబ్జా చేయాలని చైనా భావించింది. ఈ దలైలామ ఎంపికలో పంచయిన్ లామా పాత్ర చాలా కీలకం. 1989లో టిబెట్‌లోనే ఉండిపోయిన పంచయిన్ లామా అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆయనపై విష ప్రయోగం చేశారంటారు. ఆయన మరణం తర్వాత వారసుడి ఎంపికను తాషి లున్పో ఆశ్రమం, బౌద్ధ సన్యాసులు వారి ఆచారాల ప్రకారం చేస్తారు. అప్పటికే టిబెట్‌ను గుప్పిట పెట్టుకొన్న చైనా.. భారత్‌లో ఉన్న దలైలామాను ఈ ఎంపిక ప్రక్రియకు దూరం పెట్టాలని నిర్ణయించింది. తాషి లున్పో మఠాధిపతిని ఈ ఎంపికకు అధిపతి చేసింది. పంచయిన్ లామా ఎంపికకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కానీ, తాషి లున్పో అధిపతి పంచయిన్ లామా వారసుడిగా సరిపోలిన బాలుడిని గుర్తించి ఆ జాబితాను ప్రవాసంలో ఉన్న దలైలామాకు రహస్యంగా చేరవేశాడు. ఆయన 1995 మే 14న ఆరేళ్ల బాలుడైన గెధున్ చొయికి నైమా పేరును 11వ పంచయిన్ లామాగా ప్రకటించారు. దీంతో చైనా ఆగ్రహం కట్టలు తెంచుకొంది. సరిగ్గా మూడు రోజుల తర్వాత చైనా సైన్యం ఆ బాలుడిని కిడ్నాప్ చేసింది. అప్పటి నుంచి అతను ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియదు. తాషి లున్పో అధిపతిని జైల్లో వేసింది. ఆ తర్వాత చైనా గ్యాన్సీ నిబ్రో అనే ఐదేళ్ల బాలుడిని పంచయిన్ లామాగా ప్రకటించింది. ఎందుకో తెలుసా..? పంచయిన్ లామా ఎంపికలో దలైలామా పాత్ర ఉన్నట్లే.. కొత్త దలైలామా ఎంపికలో పంచయిన్ లామా పాత్ర ఉంటుంది. తాను ఎంపిక చేసిన పంచయిన్ లామాతో తనకు నచ్చిన వ్యక్తిని దలైలామాగా ప్రకటింపజేయాలి. ఆ తర్వాత కొత్త దలైలామా సహకారంతో టిబెట్ స్వతంత్ర ఉద్యమాన్ని అణచివేయాలన్నది వ్యూహం. చైనా ఎంపిక చేసిన పంచయిన్ లామాను ఇప్పటికీ టిబెటియన్లు ఏ మాత్రం పట్టించుకోరు.
ప్రస్తుత దలైలామాకు దాదాపు 85ఏళ్ల వయస్సు వచ్చేసింది. ఆయన చైనా దుర్బుద్ధిని ముందే పసిగట్టి తన వారసుడు కేవలం టిబెట్ నుంచే రావాల్సిన అవసరం లేదని.. ఉత్తర భారత్, నేపాల్, భూటాన్‌ల నుంచి కూడా రావచ్చని ప్రకటించారు. తర్వాత దలైలామా ఎంపిక స్వేచ్ఛగా, చైనా జోక్యం లేకుండా.. సంప్రదాయం ప్రకారం జరిగేలా చూడాలని అమెరికా కాంగ్రెస్ నిర్ణయించి.. ‘ది టిబెటియన్ పాలసీ అండ్ సపోర్ట్ యాక్ట్ 2020’ పాస్ చేసింది. దీని ప్రకారం టిబెట్‌లో లాసాలో అమెరికా ప్రత్యేక రాయబార కార్యాలయం ఏర్పాటు చేయనుంది. దీంతో టిబెట్ వాసులకు మద్దతుగా ఓ కూటమి తయారు చేయాలని భావిస్తోంది. దలైలామా ఎంపికలో చైనా జోక్యం చేసుకొంటే భారీ ఆంక్షలను రుచి చూడాల్సి ఉంది. దీనిపై డ్రాగన్ బుసలు కొట్టింది. మా అంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించింది. అమెరికాపై ప్రతి ఆంక్షలు విధిస్తామని పేర్కొంది. అంతేకాదు టిబెట్‌కు చెందిన ఎన్‌జీవోలకు సహకారం అందించాలని నిర్ణయించింది. లాసాలో అమెరికా రాయబారా కార్యాలయం ఏర్పాటు అయ్యే వరకు కొత్తగా చైనా ఏర్పాటు చేయాలనుకునే రాయాబారా కార్యాలయాలపై ఆంక్షలు విధించింది. టిబెట్ వ్యవహారాలు చూసేందుకు ఓ అధికారిని కూడా నియమించింది. ప్రస్తుతం దలైలామాకు ఆశ్రయం ఇస్తున్న భారత్ మాత్రం నిశ్శబ్దంగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తోంది. ఇప్పటికే లాద్దాఖ్‌లో భారత్‌తో ఘర్షణకు దిగిన చైనాను ఈ పరిణామాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.