* కర్ణాటక శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఆత్మహత్య.రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న డిప్యూటీ చైర్మన్..ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ నెల 15 న కర్ణాటక శాసనమండలిలో తీవ్రమైన రసాభాస.. ఆయనను తన సీట్లో నుంచి కిందికి దించి అవమానపరిచారు అని ఆవేదన.ఘటనా స్థలంలో డిప్యూటీ చైర్మన్ ధర్మేందర్ గౌడ సూసైడ్ నోట్ లభ్యం.
* హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలను నిషేధిస్తూ మందుబాబులకు షాక్ ఇచ్చిన తెలంగాణ పోలీసులు.. ఇప్పుడు మరో బాంబ్ పేల్చారు. మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే పదేళ్లు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. తాగి వాహనాలు నడిపేవారు టెర్రరిస్టుల కంటే డేంజర్ అన్న సైబరాబాద్ సీపీ సజ్జనార్.. నిన్న ఒక్కరోజే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 402 మంది పట్టుబడ్డారని వెల్లడించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారెవరైనా సరే కఠినంగా శిక్షింప బడతారని అన్నారు సజ్జనార్.
* ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త స్ట్రెయిన్.. దక్షిణాఫ్రికాలో ఆంక్షలు మరింత తీవ్రం.. మద్యం సేల్స్ బ్యాన్
* సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నేరాలు 6.65 శాతం పెరిగాయని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ఈ మేరకు సైబరాబాద్ కమిషనరేట్ వార్షిక నేర గణాంకాలను సజ్జనార్ విడుదల చేశారు. రోడ్డు ప్రమాదాలు 22.7 శాతం, మహిళలపై నేరాలు 18.6 శాతం, చిన్నారులపై 12.2 శాతం నేరాలు తగ్గాయని వెల్లడించారు. హత్యలు, దోపిడీలు 26 శాతం తగ్గగా.. సైబర్ నేరాలు 135 శాతం పెరిగాయన్నారు. మరోవైపు సైబరాబాద్ పరిధిలో హత్యాయత్నం కేసులు 30 శాతం.. అత్యాచారం కేసులు 33 శాతం తగ్గినట్లు తెలిపారు. అలాగే ఆర్థిక నేరాలు 42 శాతం పెరిగినట్లు సీపీ వెల్లడించారు. కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ ఏడాది 16 వేలకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. సైబర్, ఆర్థిక నేరాల్లో ఎన్నో క్లిష్ట కేసులను ఛేదించినట్లు వివరించారు. లాక్‌డౌన్ సమయంలో పోలీసులు ప్రజలకు అండగా నిలిచారన్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం అనేక మార్పులు తీసుకొచ్చినట్లు సీపీ వెల్లడించారు.
* అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు అబ్దుల్ మజీద్ కుట్టీని గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) అరెస్టు చేసింది. 24 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న అతడిని జంషెడ్‌పుర్‌లో అదుపులోకి తీసుకున్నారు. 1997లో గణతంత్ర దినోత్సవం రోజున గుజరాత్, మహారాష్ట్రలో పేలుళ్లకు దావూద్ పన్నిన కుట్రలో మజీద్ భాగస్వామి అని అధికారులు స్పష్టం చేశారు. 24 ఏళ్లుగా పరారీలో ఉన్న మజీద్ ఝార్ఖండ్‌లో కొన్నేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా నివసిస్తున్నట్లు గుర్తించారు. పేలుళ్లకు సంబంధించి 106 తుపాకులు, 4 కిలోల మందుగుండు, మరికొన్ని పేలుడు సామగ్రిని విక్రయించిన కేసులో మజీద్ నిందితుడు. ముంబయి పేలుళ్ల కేసులోనూ అతడు నిందింతుడు.
* ద్విచక్రవాహనంపై రోడ్డు దాటుతున్న ఓ యువకుడిని వేగంగా వస్తున్న ఓ ఇసుక లారీ ఢీకొట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే స్థానికులు ఆగ్రహంతో ఆ వాహనానికి నిప్పంటించారు. అంతటితో ఆగక మరో 15 వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. బీర్కూర్, ఖద్గాం గ్రామాల పరిధి.. మంజీర నదిలోని ఇసుక క్వారీల నుంచి బిచ్కుంద మీదుగా హైదరాబాద్‌కు ఇసుకను తరలిస్తున్న లారీ ఎస్.బి.ఐ. సమీపంలో గోపన్‌పల్లికి చెందిన విజయ్(26)ను ఢీకొంది. ప్రమాదానికి ఇసుక లారీల వేగమే కారణమని భావించిన స్థానికులు మిగిలిన వాహనాలను అడ్డుకున్నారు. స్థానికులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించగా ఆగ్రహంతో వారిపై తిరగబడ్డారు. కొన్నిరోజులుగా ఇసుక లారీలతో ఇబ్బందులు పడుతున్నామని.. రాత్రిళ్లు తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని నిరసన వ్యక్తం చేశారు. క్షతగాత్రుడిని నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. రాత్రి ఎస్పీ శ్వేత ఘటనాస్థలిని పరిశీలించి వివరాలు తెలుసుకొన్నారు.
* వ్యాయామ ఉపాధ్యాయుడిపై ముగ్గురు సహాపాధ్యాయులు దాడి చేసి గాయపరిచిన ఘటన గుంటూరు జిల్లా బాపట్ల మండలం అప్పికట్ల జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగింది. బాధితుడు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. అప్పికట్ల జడ్పీ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వెంకటేశ్ సోమవారం పిల్లలను క్రీడా ప్రాంగణంలో ఆడించడానికి తీసుకువెళుతుండగా తాము కూడా గ్రౌండ్‌కు వచ్చి ఆడతామని సహోపాధ్యాయులు శివయ్య, జయరావు, బుల్లయ్యలు అన్నారు. విద్యార్థులు, సహోపాధ్యాయులు గ్రౌండ్‌కు చేరుకోగానే వారిని ఆడుకోవాలని చెప్పి.. ఏదో పని మీద వెంకటేశ్ తిరిగి హెచ్‌ఎం గది వద్దకు బయలుదేరాడు. తమను గ్రౌండ్‌లో ఉంచి నీవు ఏం చేద్దామని వెళుతున్నావని సహోపాధ్యాయులు దుర్భాషలాడుతూ వెంకటేశ్‌పై దాడి చేశారు. దీంతో ఆయన పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి, డీఈవో గంగాభవానికి ఫిర్యాదు చేశారు. తనపై శివయ్య, జయరావు, బుల్లయ్యలు హత్యాయత్నం చేశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరుపుతామని, అప్పటి వరకూ ముగ్గురు ఉపాధ్యాయులూ సస్పెన్షన్‌లో ఉంటారని డీఈఓ తెలిపారు. పాఠశాలలో తమకు తగిన ప్రాధాన్యం లభించకపోవడాన్ని మనసులో పెట్టుకొనే ముగ్గురు ఉపాధ్యాయులు ఈ దాడికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు.