Politics

నాయకుల కార్ఖానా…ఆంధ్ర విశ్వవిద్యాలయం

AU Alumni Impacting Indian And Telugu Politics

విశ్వవిద్యాలయాలు విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించటమే కాదు.. వారు నాయకులుగా మారటానికి.. నాయకత్వ లక్షణాలు అందిపుచ్చుకోవటానికి దోహదపడతాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమంది నాయకులు ఒకప్పుడు విశ్వవిద్యాలయాల్లో ఉండగానే నాయకులుగా మారినవారు కాగా.. మరికొందరు బయటకు వచ్చాక పెద్దపెద్ద నేతలుగా ఎదిగారు. మన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఈ విషయంలో అందరికంటే ముందుంది. ఇక్కడ చదివిన ఎంతోమంది నేడు ప్రముఖ నేతలయ్యారు. చాలామంది ఇంకా కొనసాగుతున్నారు. విశ్వవిద్యాలయం వ్యవస్థాపక ఉపకులపతి కట్టమంచి రామలింగారెడ్డి(సి.ఆర్‌.రెడ్డి) మొదలుకొని ప్రస్తుత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు వరకు ఈ విశ్వవిద్యాలయంలోనే రాజకీయ ఓనమాలు దిద్దారు.
కట్టమంచి రామలింగారెడ్డి తొలుత ఓ రాజకీయ పార్టీలో నాలుగేళ్లు పనిచేశారు.
**ఎందరో మహాను భావులు….!
విశాఖ మేయర్‌గా పనిచేసిన డి.వి.సుబ్బారావు, దివంగత ఎన్టీ రామారావు మంత్రి వర్గంలో కీలక భూమిక పోషించిన నల్లపురెడ్డి శ్రీనివాసులురెడ్డి, రాజ్యసభ మాజీ సభ్యులు యార్లగడ్డ లక్ష్మిప్రసాద్, అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్, కేంద్రమాజీ మంత్రి పనబాక లక్ష్మి, త్రిపురాన వెంకటరత్నం, వట్టి వసంతకుమార్, గంటా శ్రీనివాసరావు, రావెల కిశోర్‌ బాబు, మేరు నాగార్జున, కుంభా రవిబాబు, గోకరాజు గంగరాజు, పిన్నింటి వరలక్ష్మి వంటి ఎందరో నేతలను దాదాపు అన్ని రాజకీయ పార్టీలకు ఆంధ్రవిశ్వవిద్యాలయం అందించింది.
**ఎం.పి హరిబాబు…
ప్రస్తుత విశాఖ పార్లమెంటు సభ్యులు కంభంపాటి హరిబాబు ఏయూలోనే చదువుకున్నారు. విద్యార్థిగానే కాకుండా ఏయూలో అధ్యాపకుడిగా కూడా పనిచేశారు. విద్యార్థి నాయకునిగా కూడా పనిచేశారు.
**పర్వతనేని ఉపేంద్ర
దివంగత పర్వతనేని ఉపేంద్ర గురించి తెలియని వారుండరు. పార్లమెంటులో ప్రతిపక్ష నాయకునిగా, కేంద్రమంత్రిగా వ్యవహరించారు. ఉపేంద్ర కూడా ఏయూ విద్యార్థే.
**ఉత్తరాంధ్ర నాయకుడు..
కేంద్రమంత్రిగా పనిచేసిన ప్రముఖ ఉత్తరాంధ్ర నాయకుడు దివంగత కింజరాపు ఎర్రన్నాయుడు ఏయూ విద్యార్థే. ఆయన ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొలినాళ్లలో అప్పుడే యూనివర్సిటీ నుంచి పట్టా పట్టుకొని బయటకు వచ్చారు. ఆ పార్టీలో తనకంటూ ప్రత్యేక ముద్రవేశారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖమంత్రిగా రాష్ట్రానికి ప్రత్యేక నిధులు తీసుకువచ్చి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి దోహదపడ్డారు.
***వామపక్షాల నాయకులు ఏయూ విద్యార్థులే….
వామపక్ష ఉద్యమాలకు మంచి నాయకత్వం వహించిన నేతల్లో బి.వి.రాఘవులు ఒకరు. ఆయనా ఏయూ విద్యార్థే. సీపీఎంలో రాష్ట్ర కార్యదర్శిగా, నేడు జాతీయ పార్టీ కార్యవర్గ సభ్యునిగా ఉన్నారు. తనకు ఏయూతో ఎంతో అనుబంధం ఉందని పలుమార్లు పేర్కొనడం గమనార్హం.
**ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు..
భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఏయూలో న్యాయ విద్య అభ్యసించారు. అప్పట్లో ఏయూ విద్యార్థి సంఘ నాయకునిగా పనిచేసి తదనంతరం రాజకీయాల్లో ప్రవేశించారు. ఆయనకు నాయకత్వ శిక్షణ ఏయూలో అలవడిందని చెప్పవచ్చు. ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యునిగా, భారతీయ జనతాపార్టీ అధ్యక్షునిగా, కేంద్రమంత్రిగా పనిచేశారు. నేడు దేశంలోనే అత్యున్నత పదవుల్లో ఒకటైన ఉపరాష్ట్రపతిగా సేవలందిస్తున్నారు.
**బాలయోగి తెలియనివారున్నారా..
లోక్‌సభ స్పీకర్‌ పనిచేసిన దివంగత జీఎంసీ బాలయోగి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలయోగి ఏయూలో న్యాయశాస్త్రం అభ్యసించారు. దివంగత ఎర్రన్నాయుడు, ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కూడా బాలయోగికి ఏయూలో తోటి విద్యార్థులు కావటం విశేషం.