Business

చెక్ చెల్లింపులపై SBI సరికొత్త నిబంధనలు-వాణిజ్యం

చెక్ చెల్లింపులపై SBI సరికొత్త నిబంధనలు-వాణిజ్యం

* అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) చెక్ ద్వారా చెల్లింపులు చేసే వారికి ‘పాజిటీవ్ పే సిస్ట‌మ్’‌ను అమ‌లులోకి తీసుకురానుంది. ఈ విధానంలో రూ.50 వేలకు మించిన చెక్‌ల‌ను పునః-నిర్ధార‌ణ చేయాల్సి ఉంటుంది. ఈ కొత్త చెక్ చెల్లింపు వ్య‌వ‌స్థ జ‌న‌వ‌రి 1, 2021 నుంచి అమ‌లులోకి రానుంది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు మరోసారి లాభాల్లో ముగిశాయి. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌ షేర్లు రాణించడంతో సూచీలు వరుసగా ఆరో రోజూ లాభాలు చవిచూశాయి. దీంతో మరోసారి సూచీలు జీవనకాల గరిష్ఠాలను నమోదు చేయగా.. నిఫ్టీ 14 వేల మార్కుకు కొద్ది దూరంలో నిలిచింది.

* ఐటీ రిటర్నుల దాఖలుకు సంబంధించిన గడువును కేంద్రం మరోసారి పొడిగించింది. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు 10 రోజుల గడువు ఇచ్చింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీ రిటర్నులను జనవరి 10 వరకు దాఖలు చేసుకునే వెసులుబాటు కల్పించింది. అలాగే కంపెనీల ఐటీ రిటర్నుల దాఖలు గడువును 15 రోజులు పెంచింది. ఫిబ్రవరి 15 లోపు రిటర్నులు దాఖలు చేసుకునే వీలు కల్పించింది. కొవిడ్‌ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది.

* ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) సోమవారం ఒక ప్రామాణిక ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీని ప్రతిపాదించింది. దీనిని ఏప్రిల్ 1, 2021 నాటికి ప్రారంభించాలని ఐఆర్డీఏఐ భావిస్తుంది. ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ విక్రయాలను పెంచాలనే లక్ష్యంతో ఐఆర్డీఏఐ ఈ సరికొత్త పాలసీని తీసుకొచ్చింది.

* కరోనా వ్యాప్తి.. లాక్‌డౌన్‌.. ఆదాయం తగ్గుదల.. ఈ ఏడాది సామాన్యుల నుంచి ధనికుల వరకు అందరిపైనా ప్రభావం చూపింది ఈ అంశాలే. ఎన్నో ప్రణాళికలతో.. మరెన్నో ఆశలతో 2020 సంవత్సరాన్ని ప్రారంభించినా.. మార్చి నుంచి కలలన్నీ కళ్లలుగా మిగిలాయి. నచ్చినవి కొనుగోలు చేయాలన్నా.. అంత ఆర్థిక స్తోమత లేక వెనకడుగు వేశారంతా. ఇప్పుడు ఈ ఏడాది ముగిసిపోతుంది. జనం లాక్‌డౌన్‌ ప్రభావం నుంచి క్రమంగా బయటపడుతున్నారు. కాస్తోకూస్తో.. చేతులో డబ్బులాడుతున్నాయి. కొత్త సంవత్సరంలోనైనా అవసరమైనవి కొనాలని ఎదురుచూస్తున్నారు. కానీ ఈ ఆర్ఠిక కష్టాలు వచ్చే ఏడాదిలోనూ కొనసాగనున్నాయి. కొత్త ఏడాది ఆరంభం నుంచే ధరల మోత మోగనుంది. ఎలక్ట్రానిక్‌, గృహోపకరణాల ధరలు ప్రియం కానున్నాయన్న సంకేతాలు.. మధ్య తరగతిని కలవరపెడుతున్నాయి. పసిడి ధరలు పరుగులు పెట్టుతున్నాయన్న అంచనాలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.