దాదాపు 2500 ఏళ్ల క్రితం.. వైదిక సంప్రదాయ వ్యతిరేక శక్తులు, మతాచార పద్ధతుల కారణంగా ప్రాచీన వేద, ధర్మాలు తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఏర్పడినప్పుడు.. వాటిని తట్టుకునేందుకు వేద, ధర్మ పరిరక్షణకు శ్రీ ఆదిశంకరాచార్యులు నడుంబిగించారు. అసాధారణమైన యోగ శక్తితో కైలాసంలో పరమేశ్వరుడిని దర్శించుకుని, ఆ హరుడు ప్రసాదించిన ఐదు స్ఫటిక లింగాలతో భారతదేశంలో ఐదు చోట్ల పీఠాలను స్థాపించారని భక్తుల విశ్వాసం. ఆ ఐదు పీఠాల్లో.. శృంగేరి, పూరి, ద్వారకా, బదరీనాథ్ పీఠాల బాధ్యతలను శిష్యులకు అప్పగించి, కంచి పీఠానికి సర్వజ్ఞ పీఠాధిపతిగా ఉన్నారు. శతాబ్దాలుగా ఆ పరంపర కొనసాగుతోంది. క్రీస్తు పూర్వం 509లో ఈ పీఠం ఆవిర్భవించినట్లు చరిత్ర చెబుతోంది. షణ్మత స్థాపనాచార్యులుగా పూజలందుకుంటున్న ఆదిశంకరులు.. కంచిపాలకుడు రాజసేన సహకారంతో కంచిని పునరుద్ధరించి కామాక్షి అమ్మవారికి, వరదరాజస్వామివారికి, శ్రీ ఏకామ్రనాథుడికి ఆలయాలు నిర్మించారు. కంచినే కేంద్రంగా చేసుకుని దక్షిణాదిన వేద పరిరక్షణ, వైదిక సంప్రదాయాల వ్యాప్తికి చర్యలు తీసుకున్నారు.
**ఆలయాల పునరుద్ధరణ..
చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి హయాంలో కంచి పీఠం వేద సంరక్షణకు పలు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా.. శిథిలావస్థలో ఉన్న ఎన్నో ప్రాచీన ఆలయాలకు మరమ్మతులు చేపట్టి పూజాదికార్యక్రమాలను పునరుద్ధరించారు. 1978లో శంకర జయంతి రోజున కాలడి వద్ద ‘కీర్తి స్తంభ’ పేరుతో ఒక స్థూపాన్ని స్థాపించారు. జయేంద్ర సరస్వతి స్వామి కూడా ఆ సంప్రదాయాల్ని కొనసాగించి దేశవ్యాప్తంగా ఎన్నో ఆలయాలను పునరుద్ధరించారు. ఢిల్లీ, సికింద్రాబాద్‌లో సుబ్రహ్మణ్యస్వామి, కోవై, సేలంలలో కామాక్షి అమ్మవార్ల కొత్త ఆలయాలను నిర్మించారు. అసోంలోని గౌహతిలో శ్రీ పూర్వ తిరుపతి బాలాజీ మందిర్‌ను నిర్మించారు. ఆ మందిరంలోని వేంకటేశ్వరుని విగ్రహాన్ని 11 అడుగుల ఎత్తుతో తిరుమలేశుడి విగ్రహ నమూనాతో ప్రతిష్టించారు. అలాగే గోవాలోని పోండా ప్రాంతంలో బాలాజీ ఆలయాన్ని నిర్మించి, 2000, ఏప్రిల్ 24న మహాకుంభాభిషేకం నిర్వహించారు. చెన్నైలోని కంచి కామకోటి చైల్డ్ ట్రస్టు ఆసుపత్రి సహా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని కంచి కామకోటి పీఠం ఆసుపత్రులను ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించారు.
**గురు పరంపరలో..
ఆది శంకరుల తరువాత సురేశ్వరాచార్యుల వారు పీఠాధిపతి అయ్యారు. వారి తరువాత ఉత్తరాధికారం సర్వజ్ఞాత్మన్ సరస్వతి స్వామి నిర్వహించారు. నాటి నుంచి కొనసాగుతున్న గురుపరంపరలో.. కృపా శంకరులు (9వ ఆచార్యులు), మూక శంకరులు (20వ ఆచార్యులు), విద్యాఘన (37వ ఆచార్యులు), అభినవ శంకరులు (38వ ఆచార్యులు), చంద్రకుల సరస్వతి (47వ ఆచార్యులు), విద్యాతీర్థ (51వ ఆచార్యులు), వ్యాసాచల మహాదేవేంద్ర సరస్వతి (54వ ఆచార్యులు), పరమశివేంద్ర సరస్వతి (57వ ఆచార్యులు) స్వామివార్లు కంచి కామకోటి పీఠం ఆశయాలను, లక్ష్యాలను బాగా ముందుకు తీసుకెళ్లినట్లు చరిత్ర చెబుతోంది. కాంచీపురం కేంద్రంగా తమిళనాట అసాధారణ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో 62వ ఆచార్యులైన చంద్రశేఖరేంద్ర (1746-1783) కుంభకోణంలోని కావేరి తీరాన కొత్త మఠాన్ని స్థాపించారు. 63వ ఆచార్యులుగా చంద్రశేఖరేంద్ర సరస్వతి హయాంలో కంచి కామకోటి పీఠం ఎంతో అభివృద్ధిని సాధించింది.
**1840లో కామాక్షి అమ్మవారి ఆలయానికి మరమ్మతులు చేపట్టి, మహాకుంభాభిషేకం నిర్వహించారు. మహాదేవేంద్ర సరస్వతి (65వ ఆచార్యులు) దక్షిణాదిన అన్ని రాష్ట్రాల్లోనూ పీఠం ఆచారవ్యవహారాల వ్యాప్తికి కృషి చేశారు. ఇక ప్రపంచ ప్రసిద్ధి చెందిన పరమాచార్యులు.. నడయాడే దేవుడుగా భక్తులు కొలిచే చంద్రశేఖరేంద్ర సరస్వతిస్వామి 1907లో కంచి కామకోటి పీఠం 68వ ఆచార్యులుగా నియమితులై 87 ఏళ్ల సుదీర్ఘ కాలంపాటు సేవలందించారు. 1954, మార్చి 22న జయేంద్ర సరస్వతి స్వామి తన 19వ ఏట కంచి కామకోటి ఉత్తరాధికారిగా నియమితులయ్యారు. ప్రారంభకాలంలోనే ఒక బాలుడికి యుక్తవయసులోనే సన్యాస దీక్ష ఇచ్చి తన వారసుడిగా ప్రకటించారు. ఆయనే.. శంకర విజయేంద్ర సరస్వతి. 1994లో చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి శివైక్యం కావడంతో జయేంద్ర సరస్వతి 69వ పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఉత్తరాధికారిగా ఉన్న విజయేంద్ర సరస్వతి మఠానికి 70వ అధిపతిగా బాధ్యతలు స్వీకరించారు.
2500ఏళ్ల విశేష చరిత్ర కలిగిన కంచి పీఠం
Related tags :