Politics

పోలవరంపై ఆదిత్యనాథుడి హామీ

AP CS Adityanatha Das Promises Polavaram Completion

పోలవరం ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేసేందుకు అన్ని రకాలుగా కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)గా బాధ్యతలు స్వీకరించిన ఆదిత్యనాథ్‌ దాస్‌ చెప్పారు. రాష్ట్ర ప్రజల కల నెరవేర్చడంలో తన వంతు పాత్ర పోషిస్తానన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యాలు నెరవేర్చడమే తన కర్తవ్యమని అభిప్రాయపడ్డారు. ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించే అవకాశం ఇచ్చిన ప్రభుత్వానికీ, ప్రజలకూ కృతజ్ఞతలు చెప్పారు. వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాకులో గురువారం మధ్యాహ్నం ఆయన సీఎస్‌గా పగ్గాలు చేపట్టారు. ఉద్యోగ విరమణ చేస్తున్న ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర పునర్‌ విభజన తర్వాత సీఎస్‌గా ఎంపికైన వారిలో ఆయన 8వ అధికారి. ఐఏఎస్‌ 1987 బ్యాచ్‌కి చెందిన ఆయన బాధ్యతలు తీసుకున్నాక విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ విజన్‌ను ముందుకు తీసుకువెళ్తానని చెప్పారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగా ఉన్న నేపథ్యంలో ఎలా ముందుకు సాగుతారని ప్రశ్నించగా.. ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుందని, సమస్యలకు పరిష్కారాలు వెతకడమే అధికారులుగా తమ విధి, బాధ్యత అని స్పష్టం చేశారు. సీఎస్‌గా బాధ్యతలు తీసుకున్నాక ఆయన్ను ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రావత్‌, ఎంటీ కృష్ణబాబు, ఇతర ఐఏఎస్‌ అధికారులు ఉదయలక్ష్మి, కాటంనేని భాస్కర్‌, ముఖేశ్‌ కుమార్‌ మీనా, ప్రవీణ్‌కుమార్‌, సర్వీసుల విభాగం కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ తదితరులు కలిసి అభినందించారు. అంతర్రాష్ట్ర బదిలీలకు సంబంధించిన ఫైలుపై ఆదిత్యనాథ్‌ తొలి సంతకం చేశారు.