తన పాటలతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న సంగీత దర్శకుడు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా. ఒకటి రెండు కాదు ఏకంగా 1000 సినిమాలకు పైగానే ఈయన సంగీతం అందించాడు. వేల పాటలను కంపోజ్ చేసాడు. ఎప్పటికీ బోర్ కొట్టని అద్భుతమైన బాణీలను అందించాడు ఇళయరాజా. అయితే పాటల్లో ఎన్ని అద్భుతాలు సృష్టించాడో..వివాదాల్లో కూడా అలాగే ముందుంటాడు ఈయన. అప్పట్లో తన ప్రాణమిత్రుడు, దివంగత బాలసుబ్రమణ్యం తన పాటలు పాడాడని ఆయనకే లీగల్ నోటీసు పంపించాడు ఇళయరాజా. ఆ తర్వాత కొన్ని వివాదాలు కూడా రాజా చుట్టూ ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ప్రసాద్ స్టూడియోస్ యాజమాన్యంతో ఇళయరాజా చేస్తున్న యుద్ధం. 80ల్లో ఇళయరాజా రోజుకు 20 సినిమాల వరకు రికార్డింగ్ చేసేవాడు. అక్కడా ఇక్కడా తిరగడం అంటే టైమ్ వేస్ట్ అని.. ఆయన కోసం ప్రసాద్ స్టూడియో యాజమాన్యం 1976లో ప్రత్యేక రికార్డింగ్ స్టూడియో కట్టించారు.
అందులోనే అప్పట్నుంచి కూడా ఈయన పాటల రికార్డింగ్ జరుగుతుంది. అయితే కొన్నేళ్ళ తర్వాత ప్రసాద్ స్టూడియోస్ వారసులు వచ్చారు. వాళ్లు వచ్చిన తర్వాత ఇళయరాజాను తమ స్థలం తమకు ఇచ్చేయాలని కోరారు. దానికి మ్యాస్ట్రో నిరాకరించాడు. ఇది తన ఆస్తి అంటూ అక్కడే ఉండిపోయాడు. కానీ దానికి ప్రసాద్ స్టూడియోస్ వారసులు ఒప్పుకోలేదు. విషయం కోర్టు వరకు వెళ్లింది. కొన్నేళ్లుగా అక్కడే విషయం నానుతూ ఉంది. ఈ లోపు ఇళయరాజా కూడా ప్రసాద్ స్టూడియోస్ వారసులపై కేసులు కూడా ఫైల్ చేసాడు. కానీ రెండేళ్లుగా జరుగుతున్న ఈ వివాదంలో చివరికి ఇళయరాజా వెనక్కి తగ్గాడు. మొన్నటి వరకు ఈ రికార్డింగ్ స్టూడియో ఖాళీ చేయడానికి ఒప్పుకోని ఆయన..ఇప్పుడు తన వాయిద్యాలతో పాటు సంగీత పరికరాలు కూడా తీసుకెళ్లడానికి ఒప్పుకున్నాడు.
కాకపోతే అక్కడ ఒకసారి తనను ధ్యానం చేసుకునేందుకు అవకాశం కల్పించాలని ఇళయరాజా న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసాడు. ఈ ప్రతిపాదనను మొదట వ్యతిరేకించిన స్టూడియో యాజమాన్యం ఆ తర్వాత కొన్ని షరతులతో అంగీకరించింది. ఏదైనా ఒక రోజు ఉదయం 9 నుంచి సాయత్రం 4 గంటల వరకు ధ్యానం చేసుకుని సంగీత పరికరాలు తీసుకెళ్లేందుకు అనుమతించాలని యాజమాన్యాన్ని కోర్టు ఆదేశించింది. దాంతో డిసెంబర్ 29 ఉదయం ప్రసాద్ స్టూడియోకు ఇళయరాజా వస్తారని ప్రకటన విడుదల చేసారు ఆయన పిఆర్ టీం. చెప్పినట్లుగానే ఆయన వచ్చాడు. అయితే లోపలికి మాత్రం తాను వెళ్లకుండా తన సహాయకులను పంపించాడు. అక్కడికి వెళ్ళి చూసేసరికి ఇళయరాజా రికార్డింగ్ స్టూడియో తలుపులు బద్దలు కొట్టి ఉండటం..అప్పటికే అక్కడ్నుంచి సంగీత పరికరాలు తీసి మరో గదిలో ఉండటం చూసి ఇళయరాజా తట్టుకోలేకపోయారని అతడి సహాయకులు చెప్తున్నారు. తనకు జరిగిన అవమానం గుర్తు చేసుకుని బాధ పడుతున్నారని..అందుకే ఆయన ప్రసాద్ స్టూడియోస్ లోపలకి కూడా రాలేదని చెప్పారు వాళ్లు. ఏదేమైనా ఇన్నేళ్ల వివాదం ఇప్పుడు క్లియర్ కావడంతో ఓ సమస్య సమసిపోయింది.