* అమెరికాలోని బిలియనీర్లు 2020లో ఏకంగా ట్రిలియన్ డాలర్ల సంపదను తమ ఖాతాల్లో వేసుకున్నారు. దీనిలో దాదాపు ఐదో వంతు సంపద కేవలం ఇద్దరు వ్యక్తుల జేబుల్లోకే వెళ్లింది. అందులో ఒకరు అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ కాగా.. మరొకరు టెస్లా, స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్. 2020లో మస్క్ సంపద ఏకంగా నాలుగింతలైంది. ఒక్క ఏడాదిలోనే 132 బిలియన్ డాలర్ల సంపద వచ్చి చేరింది. దీంతో ఆయన ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకారు. ఇక బెజోస్ సంపద 70 బిలియన్ డాలర్లు పెరిగింది. దీంతో ఆయన నికర సంపద 186 బిలియన్ డాలర్లకు చేరింది. వీరివురి సంపద పెరుగుదలకు ముఖ్య కారణం వారి కంపెనీల షేర్ల ధరలు పెరగడమే. మస్క్ స్థాపించిన వాహన తయారీ సంస్థ టెస్లా షేర్లు 2020లో 800 శాతం పెరుగుదలను నమోదు చేశాయి. షాంఘైలో భారీ వాహన తయారీ కేంద్రం ప్రారంభం కావడం, ప్రతి త్రైమాసికంలో కంపెనీ లాభాలు పెరగడం, 2021లో విద్యుత్తు వాహనాలకు గిరాకీ పెరగనుందన్న సంకేతాల వంటి పలు కారణాలు టెస్లా షేర్ల పరుగుకు కారణమయ్యాయి.
* బడ్జెట్‌కు ముందు జరిపే అంతరంగ చర్చలు ముగియడంతో అందరి కళ్లు ఫిబ్రవరి 1 భారత యూనియన్ బడ్జెట్ పైనే ఉన్నాయి. భారత ఆర్థిక మంత్రిత్వశాఖ, ఆర్థికఆ విధానం, దేశ అభివృద్ధిలో కీలక పాత్ర వహించే మౌలిక సదుపాయాల అభివృద్ధి, అడ్డంకులు లేని సులభతర వ్యాపారం లాంటి పలు విషయాలపై పలు సూచనలు పొందింది. 2021-22 కేంద్ర బడ్జెట్‌ను సిద్ధం చేయడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డిసెంబర్ 30న నిపుణులు, వ్యాపార ప్రముఖులు, అధికారులతో బడ్జెట్ ముందస్తు సంప్రదింపులను చర్చించారు. కొవిడ్-19 ప్రభావంలో ఫిబ్రవరి 1న తను సమర్పించే 3వ బడ్జెట్ ‘ఇంతకు ముందెన్నడూ లేనిది’గా ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
* రైతుల ఆందోళనలో భాగంగా తమ టవర్ల ధ్వంసం వెనుక ప్రత్యర్థి టెలికాం సంస్థలు ఉన్నాయంటూ జియో చేసిన ఫిర్యాదుపై ఎయిర్‌టెల్ స్పందించింది. జియో చేసినవి నిరాధార ఆరోపణలని పేర్కొంది. ఈ మేరకు టెలికాం విభాగం (డాట్) సెక్రటరీ అన్షు ప్రకాశ్‌కు లేఖ రాసింది. గతంలో కూడా జియో తమపై ఫిర్యాదు చేసిందని ఎయిర్‌టెల్ చీఫ్ రెగ్యులేటరీ ఆఫీసర్ రాహుల్ వాట్స్ తన లేఖలో పేర్కొన్నారు.
* కొత్త సంవత్సరం అంటే వేడుకలతో పాటు విషెస్ కూడా. డిసెంబరు 31 అర్ధరాత్రి 12 గంట కొట్టగానే ‘హ్యాపీ న్యూ ఇయర్’ పదాలతో యావత్ ప్రపంచం మార్మోగుతుంది. మామూలుగా అయితే బంధుమిత్రులను నేరుగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకునేవాళ్లం. కానీ, ఈసారి కరోనా భయం, ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలో చాలా మంది ఇళ్లకే పరిమితమవ్వాల్సి వచ్చింది. దీంతో శుభాకాంక్షలు చెప్పుకునేందుకు ఇంటర్నెట్‌ను ఆశ్రయించక తప్పలేదు. అలా ఈ ఏడాది న్యూఇయర్ వేళ ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో 100 కోట్ల మందికి పైగా కాల్స్ చేసుకున్నారట. ఈ మేరకు సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ వెల్లడించింది.
* ఈ ఆర్థిక సంవత్సరం తొమ్మిదో దశ సార్వభౌమ బంగారు బాండ్ల ఇష్యూ ఈ రోజు ముగుస్తుంది. ఈసారి 2020-21-సిరీస్ ఈX ఇష్యూ ధర గ్రాము బంగారానికి రూ.5000గా నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే పెట్టుబడిదారులకు గ్రాముకు రూ. 50 తగ్గింపు లభిస్తుంది. అప్పుడు గ్రాము బంగారానికి, రూ.4950 అవుతుంది.
* నూతన సంవత్సర వేడుకలపై నిబంధనలు, ఆంక్షలు విధించడంతో, డిసెంబరు 31న ఈసారి ఇళ్లలోనే పార్టీలు చేసుకున్న కుటుంబాల సంఖ్య అధికమైంది. హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీల నుంచి కావాల్సిన ఆహారాన్ని తెప్పించుకుని, స్నేహితులు, కుటుంబసభ్యులు, రెండు-మూడు కుటుంబాల వారు నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ సందడిగా గడిపారు. ఫలితంగా హోటళ్ల నుంచి కావాల్సిన ఆహార పదార్థాలు తెమ్మంటూ, ఆహార సరఫరా సేవల సంస్థలు స్విగ్గీ, జొమాటోలకు అత్యధిక ఆర్డర్లు లభించాయి. ముఖ్యంగా ఆన్‌లైన్ ద్వారా ఆహారాన్ని తెప్పించుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. గరిష్ఠంగా నిమిషానికి 5500 ఆర్డర్లు అందుకున్నట్లు స్విగ్గీ, 4254 ఆర్డర్లు లభించినట్లు జొమాటో వెల్లడించాయి.