* ముంబయిలో ఓ కానిస్టేబుల్ అప్రమత్తత నిండు ప్రాణాన్ని నిలబెట్టిన ఘటన దహిస్సర్ రైల్వే స్టేషన్‌లో జరిగింది. ఓ అరవై ఏళ్ల వ్యక్తి ఆ స్టేషన్‌లోని ట్రాక్‌పై ఉన్న సమయంలో సబర్బన్ రైలు రాకెట్‌లా దూసుకువచ్చింది. ఈ క్రమంలో సదరు వ్యక్తి ఫ్లాట్‌ఫామ్‌పైకి ఎక్కేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ కానిస్టేబుల్ ఈ విషయాన్ని గమనించి అతడికి సాయం చేశాడు. వేగంగా స్పందించి ఆ వ్యక్తిని ఫ్లాట్‌ఫామ్ పైకి లాగేశాడు. దాంతో అతడు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డయ్యాయి.
* కొవిడ్ వ్యాక్సిన్‌కు సంబంధించి మరో ముందడుగు పడింది. దేశీయంగా భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్‌కు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీవో) ఆధ్వర్యంలోని నిపుణుల బృందం షరతులతో కూడిన అత్యవసర వినియోగానికి అనుమతివ్వాలని భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ)కు సిఫార్సు చేసింది. సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్‌కు సిఫార్సు చేసిన మరుసటి రోజే కొవాగ్జిన్‌కూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం.
* దేవుడి సేవకంటే పవిత్రమైన పని మరొకటి లేదని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఉత్తరాంధ్ర అయోధ్యగా కొలుస్తున్న రామతీర్థంలో విగ్రహం ధ్వంసం చేయడం ద్వారా కోదండరాముడికి అవమానం జరిగిందన్నారు. వైకాపా పాలనలో దేవాలయాలపై దాడులు జరగడం అత్యంత దారుణమన్నారు. విగ్రహాల ధ్వంసంతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అంతకుముందు నాటకీయ పరిణామాల నడుమ రామతీర్థం చేరుకున్న చంద్రబాబు మెట్ల మార్గం ద్వారా బోడికొండపైకి వెళ్లారు. విగ్రహం ధ్వంసమైన బోడికొండ ప్రదేశాన్ని పరిశీలించారు. అక్కడ రాముడి శిరస్సును ధ్వంసం చేసి పడేసిన కోనేరును పరిశీలించారు. విగ్రహం ధ్వంసంపై అక్కడి పూజారులు, స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.
* వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం మడికొండ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. వరంగల్ జైలులో ఉన్న జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డిని పరామర్శించేందుకు కాంగ్రెస్ ఎంపీలు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి తదితరులు వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ర్యాలీగా వచ్చేందుకు నాయకులు ప్రయత్నించడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. వాహనాలు వెళ్లకుండా రహదారికి అడ్డంగా పోలీసులు తాడును కట్టడంతో పోలీసులు, కార్యకర్తలకు మధ్య స్వల్ప ఘర్షణ, తోపులాట చోటుచేసుకుంది. దీంతో అసహనానికి గురైన ఉత్తమ్ కుమార్ రెడ్డి వాహనాన్ని దిగి కొంతదూరం రహదారిపై కాలినడకన వచ్చారు. అనంతరం కారు ఎక్కి వరంగల్‌కి బయలుదేరారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు.
* అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పశ్చిమబెంగాల్‌లో రాజకీయాలు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి. గత నెల భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రంలో పర్యటించిన విషయం తెలిసిందే. నడ్డా పర్యటన సమయంలో ఆయన కాన్వాయ్‌పై దాడి జరగడం వివాదానికి తెరలేపింది. ఆ సంఘటన జరిగిన దాదాపు నెల రోజుల తర్వాత నడ్డా మరోసారి బెంగాల్‌కు వెళ్లనున్నారు.
* సీఎం జగన్ జనరంజక పాలన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే రాష్ట్రంలోని ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం జరుగుతోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. సీఎంపై బురద చల్లేందుకే తెదేపా అధినేత చంద్రబాబు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. రోజుల వ్యవధిలోనే విజయనగరం జిల్లా రామతీర్థంలో కోదండరాముడి విగ్రహం, తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో విఘ్నేశ్వర స్వామి ఆలయంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలను కొంత మంది దుండగులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై శుక్రవారం సజ్జల మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్.. ఇలాంటి చర్యలకు పాల్పడి తన కన్నును తానే పొడుచుకుంటారా? అని సజ్జల ప్రశ్నించారు. అలాంటి అవసరం సీఎంకు లేదన్నారు. విగ్రహాలను ధ్వంసం చేసిన వారు ఎవరైనా త్వరలోనే పట్టుకుంటామన్నారు. నిందితులు దొరికిన తర్వాత వారు ఇలాంటి పనులు చేసేలా ఎవరు ప్రేరేపించారో తప్పక తేలుస్తామని హెచ్చరించారు.
* పులివెందులలో జరిగిన ఎస్సీ మహిళ హత్య కేసులో దోషులను శిక్షించాలంటూ ఆందోళన చేసిన తెదేపా నేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం దుర్మార్గమని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. రాజకీయ కక్ష సాధింపుల కోసం ఎస్సీ, ఎస్టీలను రక్షించేందుకు ఉన్న చట్టాలను ఉపయోగించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని ఆక్షేపించారు. తక్షణమే కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు చంద్రబాబు ఓ ప్రకటన విడుదల చేశారు.
* విజయనగరం జిల్లా బోడికొండ కోదండరాముడి విగ్రహ ధ్వంసంపై చెలరేగిన రాజకీయ దుమారం కొనసాగుతోంది. తెదేపా, భాజపా, వైకాపా నేతల పర్యటనతో రామతీర్థం రణరంగంగా మారింది. పూర్తిగా ఎటు చూసినా రాజకీయ వేడి కనిపిస్తోంది. నాటకీయ పరిణామాల నడుమ తెదేపా అధినేత చంద్రబాబు రామతీర్థం చేరుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న చంద్రబాబు మెట్ల మార్గం వద్ద కొబ్బరికాయ కొట్టి బోడికొండపైకి బయల్దేరి వెళ్లారు. చంద్రబాబు వెంట నేతలు అశోక్‌గజపతిరాజు, అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు, తెదేపా శ్రేణులు ఉన్నారు. విగ్రహం ధ్వంసమైన బోడికొండ ప్రదేశాన్ని చంద్రబాబు పరిశీలించారు. అక్కడ రాముడి శిరస్సును ధ్వంసం చేసి పడేసిన కోనేరును పరిశీలించారు. కోదండరాముడి విగ్రహం ధ్వంసంపై అక్కడి పూజారులు, స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
* కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీని పునఃప్రారంభించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) వెల్లడించింది. ఇవాళ అర్ధరాత్రి నుంచి సర్వదర్శనం టోకెన్లను జారీ చేయనున్నట్లు ప్రకటించింది. జనవరి 4వ తేదీ దర్శనానికి సంబంధించి దర్శన టోకెన్లను ఇవాళ అర్ధరాత్రి జారీ చేయనున్నట్లు తెలిపింది. తిరుపతిలోని విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్‌లో టైంస్లాట్ టోకెన్లు జారీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తితిదే పేర్కొంది.
* తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్థరణ పరీక్షల్లో కొత్తగా 293 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,87,108కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ శనివారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. నిన్న కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,546కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 535 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,79,991కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 5,571 ఉండగా వీరిలో 3,418 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో నిన్న 72 కేసులు నమోదయ్యాయి.
* రామతీర్థంలో విగ్రహ ధ్వంసంపై ఓవైపు తెలుగుదేశం నేతల నిరసన కొనసాగుతుండగానే కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు రామతీర్థం, పైడితల్లి, మందపల్లి దేవస్థానాల ధర్మకర్తగా ఉన్న గజపతిరాజును ఆ హోదా నుంచి తొలగించింది.
* ఏపీలో ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం అనేది రాజకీయం కాదని ధార్మికపరమైన అంశమని భాజపా ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. దీన్ని రాజకీయంగా వాడుకోవడం సరికాదని హితవు పలికారు. ఆత్మాభిమానం, స్వాభిమానానికి అనుగుణంగా ఈ అంశాన్ని స్వీకరించడానికి భాజపా వెనకడుగు వేయదని స్పష్టం చేశారు.
* సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ నెల 8 నుంచి 14 వరకు తెలంగాణలోని వివిధ ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు టీఎస్‌ఆర్టీసీ రంగారెడ్డి జిల్లా ప్రాంతీయ మేనేజర్ బి.వరప్రసాద్ వెల్లడించారు. హైదరాబాద్ నుంచి తెలంగాణ సహా ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు 4,980 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. వాటిలో తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు 3,380 ప్రత్యేక బస్సులు, ఏపీకి 1,600 బస్సులను నడుపుతున్నట్లు వెల్లడించారు.
* ఈ ఏడాది మే 4వ తేదీ నుంచి సీబీఎస్‌ఈ పరీక్షలు నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ఇటీవల వెల్లడించారు. ఆ తర్వాత నుంచి సీబీఎస్‌ఈ పరీక్షల డేట్‌షీట్(ఏయే తేదీన ఏ పరీక్షలు ఉంటాయో చెప్పే షీట్) ఒకటి సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది. అయితే అది నకిలీ షెడ్యూల్ అని, దాన్ని నమ్మొద్దని కేంద్రం తాజాగా వెల్లడించింది. పరీక్షలకు సంబంధించి బోర్డు ఇంకా డేట్ షీట్‌ను విడుదల చేయలేదని స్పష్టం చేసింది.
* కరోనా వైరస్ విజృంభణతో ఉక్కిరిబిక్కిరైన దేశ రాజధాని నగరం ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటోంది. ఏడు నెలల తర్వాత తొలిసారి 500 కన్నా తక్కువ కేసులు నమోదయ్యాయి. దిల్లీలో శుక్రవారం 67,364 శాంపిల్స్ పరీక్షించగా 494 కొత్త కేసులు వచ్చాయి. అలాగే, 14 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 0.73శాతంగా ఉన్నట్టు తెలిపారు.
* కొత్త సంవత్సరం అంటే వేడుకలతో పాటు విషెస్ కూడా. డిసెంబరు 31 అర్ధరాత్రి 12 గంట కొట్టగానే ‘హ్యాపీ న్యూ ఇయర్’ పదాలతో యావత్ ప్రపంచం మార్మోగుతుంది. మామూలుగా అయితే బంధుమిత్రులను నేరుగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకునేవాళ్లం. కానీ, ఈసారి కరోనా భయం, ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలో చాలా మంది ఇళ్లకే పరిమితమవ్వాల్సి వచ్చింది.
* టీమ్‌ఇండియాకు చెందిన ఐదుగురు క్రికెటర్లను ఐసోలేషన్‌కు పంపించారు. మెల్‌బోర్న్‌లోని ఓ హోటల్లో కలిసి భోజనం చేయడంతో ఇతర క్రికెటర్లతో వారిని దూరంగా ఉంచినట్టు తెలిసింది. పైగా వారు బయోబుడగ నిబంధనలు ఉల్లంఘించారో లేదో క్రికెట్ ఆస్ట్రేలియా, బీసీసీఐ సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.