* కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి వచ్చిన నేపథ్యంలో.. ఇక వాటి పంపిణీపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. త్వరలో ప్రారంభం కానున్న ఈ వ్యాక్సిన్ పంపిణీ ఎన్నికల ప్రక్రియలో ఉండే బూత్‌స్థాయి ఆధారంగా ప్రణాళికను రూపొందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. ఇందుకోసం నైపుణ్యం కలిగిన సిబ్బందిని అందుబాటులో ఉంచేందుకు భారీ ఏర్పాట్లు కొనసాగుతున్నాయని తెలిపారు.
* కరోనా వ్యాక్సిన్ కోసం భారత్‌తో పాటు యావత్ ప్రపంచ దేశాలు ఆశగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ సమయంలోనే అత్యవసర వినియోగం కింద రెండు వ్యాక్సిన్‌లకు అనుమతి ఇస్తున్నట్లు భారత ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐ ప్రకటించింది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌లకు అనుమతిస్తూ భారత్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్వాగతించింది. కరోనాపై చేస్తున్న పోరాటాన్ని మరింత బలోపేతం చేయడంతోపాటు కట్టడిని ఉద్ధృతం చేయడంలో భారత్ నిర్ణయం దోహదపడుతోందని డబ్ల్యూహెచ్‌ఓ ఆగ్నేయాసియా రీజినల్ డైరెక్టర్ డాక్టర్ పూనమ్ కేత్రాపాల్ సింగ్ వెల్లడించారు.
* కొవాగ్జిన్ టీకాను అన్ని దేశాలకు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని భారత్ బయోటెక్ జేఎండీ సుచిత్ర ఎల్ల తెలిపారు. వైరల్ ప్రొటీన్లను తట్టుకునేలా కొవాగ్జిన్ టీకాను రూపొందించినట్లు సుచిత్ర ఎల్ల వెల్లడించారు. బలమైన రోగనిరోధక ప్రతిస్పందనలను కొవాగ్జిన్ ఉత్పత్తి చేసిందన్నారు. ఇప్పటివరకు చేసిన వాటిలో కొవాగ్జిన్ ప్రయోగమే అతి పెద్దదని తెలిపారు.
* మూడు రోజుల క్రితం వరకు సొంత ఊరిలో ఉన్నప్పుడు పట్టించుకోని పోలీసులు.. పనిమీద పొరుగు రాష్ట్రంలో ఉంటే హడావుడి చేయడమేంటని తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవి ప్రశ్నించారు. చెన్నైలో కడప స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసిన అనంతరం ఆయన ఓ వీడియో సందేశం విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడుతున్న తెదేపా నేతలను అరెస్ట్ చేసినంత మాత్రాన వెనక్కి తగ్గేది లేదన్నారు.
* టాలీవుడ్‌లో డ్రగ్స్ బాగోతం బయటపడింది. సుశాంత్‌సింగ్ కేసులో భాగంగా బయటపడ్డ డ్రగ్స్ కేసు మొన్నటి వరకూ బాలీవుడ్‌లో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉండగానే.. ముంబయిలోని మిరా రోడ్డులో ఉన్న ఓ హోటల్‌లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారులు సోదాలు చేశారు. ఈ క్రమంలో డ్రగ్స్ విక్రయిస్తున్న వ్యక్తితో పాటు ఓ టాలీవుడ్ నటిని అదుపులోకి తీసుకున్నారని సమాచారం.
* తమిళనాడులో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. అప్పుడే హామీల వర్షం కురిపించడం మొదలు పెట్టాయి. తాజాగా డీఎంకే అధినేత స్టాలిన్ కీలక ప్రకటన చేశారు. తాము అధికారంలోకి వస్తే ఉన్నత విద్యాభ్యాసం కోసం తీసుకున్న విద్యా రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈరోడ్ పశ్చిమ నియోజకవర్గంలోని ఓ గ్రామసభలో పాల్గొన్న సందర్భంగా ఆయన ప్రకటన చేశారు.
* మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ఆదివారం మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. భాజపా సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియాకు విధేయులైన ఇద్దరు ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఇటీవల నవంబర్‌లో నిర్వహించిన ఉప ఎన్నికల్లో తులసీరాం సిలావత్, గోవింద్ రాజ్‌పూత్‌లు ఘన విజయం సాధించడంతో వారికి అమాత్య పదవి కట్టబెడుతూ నిర్ణయించారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ ఆనందిబెన్ పటేల్ సమక్షంలో ఇద్దరు నేతలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
* కరోనా వైరస్‌కు సంబంధించి భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్’, సీరం ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ‘కొవిషీల్డ్’ టీకాల అత్యవసర వినియోగానికి ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) అనుమతులను జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనితో ప్రపంచంలోనే అతి పెద్ద టీకా పంపిణీ కార్యక్రమానికి మనదేశంలో మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలో కొవిడ్ టీకాలు తీసుకోవడం వల్ల నపుంసకత్వం తలెత్తుతుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఇవన్నీ వట్టి పుకార్లంటూ డీసీజీఐ స్పష్టం చేసింది.
* ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత్ సారథి విరాట్ కోహ్లి, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించినట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా క్రికెట్ సంఘం నిబంధనల ప్రకారం సిరీస్ ముగిసే వరకు ఆటగాళ్లు బయటకు వెళ్లకూడదు. అయితే గత డిసెంబర్ 7న కోహ్లీ, హార్దిక్ సిడ్నీలోని బేబీ షాప్‌లో ముఖానికి మాస్కులు ధరించకుండా దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
* అరుణ గ్రహంపైకి చైనా ప్రయోగించిన టియాన్‌వెన్-1 పరిశోధక నౌక ప్రయాణం కొనసాగుతోంది. జులై 23న వెన్‌ఛాంగ్ అంతరిక్ష ప్రయోగశాల నుంచి లాంగ్‌మార్చ్-5 రాకెట్ ద్వారా దీన్ని ప్రయోగించారు. టియాన్‌వెన్ ఇప్పటి వరకు 400 మిలియన్ కిలోమీటర్లకు పైగా ప్రయాణించినట్లు చైనా జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (సీఎన్‌ఎస్‌ఏ) వెల్లడించింది. ఈ మేరకు తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. మరో నెల రోజుల్లో అరుణ గ్రహం కక్ష్యలోకి ప్రవేశించనున్నట్లు తెలిపింది.